Share News

Chandrababu: కాఫీ తాగి.. డప్పు వాయించి.. గిరిజన నృత్యంతో ఆకట్టుకున్న చంద్రబాబు

ABN , Publish Date - Aug 09 , 2024 | 11:56 AM

ఏపీ సీఎం చంద్రబాబు ప్రవర్తన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఆయన వ్యవహరించే తీరు ఒక సామాన్యుడిని తలపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు తన వ్యవహార శైలితో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న చేనేత దినోత్సవం రోజున ఎగ్జిబిషన్‌కు వెళ్లి అక్కడ అందరితో ఆయన మాట్లాడిన తీరు ఆకట్టుకుంది.

Chandrababu: కాఫీ తాగి.. డప్పు వాయించి.. గిరిజన నృత్యంతో ఆకట్టుకున్న చంద్రబాబు
CM Chandrababu

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ప్రవర్తన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఆయన వ్యవహరించే తీరు ఒక సామాన్యుడిని తలపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు తన వ్యవహార శైలితో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న చేనేత దినోత్సవం రోజున ఎగ్జిబిషన్‌కు వెళ్లి అక్కడ అందరితో ఆయన మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ఆ తరువాత ప్రకాశం బ్యారేజ్‌పై సందర్శకులతో సరదాగా మాట్లాడి.. వారితో సెల్ఫీలు దిగారు. ఇవాళ ఆదివాసీలతో మాట్లాడి.. వారు తయారు చేసిన వస్తువులన్నింటినీ ఆసక్తిగా తిలకించారు. నృత్యం చేశారు.. డప్పు వాయించారు.. ఆ తరువాత ఆదివాసీలు తయారు చేసిన కాఫీని ఆయన తాగడమే కాదు.. అక్కడున్న అధికారులను పిలిచి మరీ తాగించారు.


Chandrababu-Tribal-Day-3.jpg

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఆదివాసి దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. గిరిజన సంప్రదాయ నృత్యాల్లో కళాకారులతో పాటు చంద్రబాబు సైతం పాల్గొన్నారు. కళాకారుల డప్పు తీసుకుని స్వయంగా డప్పు వాయించారు. గిరిజన లంబాడి కళాకారులతో సరదాగా కాసేపు ముచ్చటించారు. గిరిజన సంప్రదాయమైన కొమ్మ కోయ ధరించి కళాకారులతో చంద్రబాబు జత కలిశారు. గిరిజనలు ప్రదర్శించిన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు తయారు చేసిన కాఫీని సేవించారు. ఆ తరువాత ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్ పక్కనున్న అధికారులను పిలిచి మరీ వారితో కాఫీ తాగించారు.


Chandrababu-Tribal-Day-1.jpg

ఆదివాసీల జీవనశైలికి సంబంధించిన పనిముట్లతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను చంద్రబాబు తిలకించారు. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను.. వాటి వివరాలను చంద్రబాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అడవి నుంచి వచ్చే కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ఎక్కువ డిమాండ్ ఉందని చంద్రబాబు అన్నారు. గిరిజన తేనెను కొనుగోలు చేశారు. గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాన్ని అధికారులు కల్పించాలని చంద్రబాబు సూచించారు. అంతకు ముందు ఎక్స్ వేదికగా అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా గిరిజనులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటని.. అందుకే నాటి తెలుగుదేశం హాయంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించామని, అరకు కాఫీకి, గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపుకోసం ప్రోత్సాహాన్ని అందించామన్నారు.

Updated Date - Aug 09 , 2024 | 12:09 PM