Share News

CM Chandrababu : నామినేటెడ్‌లో బీసీలకు కోటా

ABN , Publish Date - Dec 24 , 2024 | 03:30 AM

నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని.. దీనికి కూడా చట్టబద్ధత తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu : నామినేటెడ్‌లో బీసీలకు కోటా

  • 34% ఇచ్చి తీరతాం.. చట్టబద్ధతా కల్పిస్తాం: సీఎం

  • ప్రత్యేక రక్షణ చట్టంపై మరికొంత కసరత్తు

  • ఇబ్బందుల్లేకుండా రూపొందించాలి

  • బాలికల హాస్టళ్లకు తక్షణమే మరమ్మతులు

  • తక్షణమే డైట్‌, కాస్మోటిక్‌ చార్జీల చెల్లింపు

  • ఆ మూడు బీసీ భవనాలు పూర్తిచేయాలి

  • ప్రతి సామాజికవర్గానికీ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌

  • త్వరలోనే 104 శంకరన్‌ నాలెడ్జ్‌ సెంటర్లు

  • పింఛన్ల తనిఖీయే తొలగింపు కాదు

  • అర్హులకు ఆందోళన అక్కర్లేదు

  • తప్పుడు ధ్రువపత్రాలిచ్చే వైద్యులు, అధికారులపై చర్యలు: చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని.. దీనికి కూడా చట్టబద్ధత తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సోమవారమిక్కడ రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గిపోయాయి.. దీంతో వారు 16,500 పదవులకు దూరమయ్యారని గుర్తుచేశారు. వాటిని పునరుద్ధరించేందుకు ఎదురవుతున్న న్యాయపరమైన సమస్యలపై అధికారులతో ఆయన చర్చించారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ చేసిన సూచనలను అధికారులు వివరించారు. మరికొంత కసరత్తు తర్వాత సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ చట్టాన్ని తీసుకురావాల ని సీఎం సూచించారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పనపైనా సమీక్షించారు. బాలికల హాస్టళ్లను తక్షణమే మరమ్మతు చేయాలని ఆదేశించారు. డైట్‌ చార్జీలు, కాస్మోటిక్‌ చార్జీల చెల్లింపు, ట్యూటర్‌ ఫీజు చెల్లించాలని ఆదేశించారు. ‘గత ప్రభుత్వం పెట్టిన రూ.110 కోట్ల డైట్‌ బిల్లుల బకాయిల్లో ఇప్పటికే రూ.76.38 కోట్లు చెల్లించాం. మిగిలిన రూ.34.14 కోట్ల పెండింగ్‌ బిల్లులు కూడా ఇవ్వాలి. కాస్మోటిక్‌ బిల్లులు రూ.20కోట్లు పెండింగ్‌లో ఉంటే మేమొచ్చాక రూ.7.10 కోట్లు చెల్లించాం. విద్యార్థులకు ట్రంక్‌ బాక్సులు, ఇతర వస్తువులకు గాను బడ్జెట్‌లో రూ.18 కోట్లు కేటాయించాం. వాటిని త్వరగా కొనుగోలు చేసి విద్యార్థులకు అందించాలి’ అని స్పష్టం చేశారు.


బీసీ భవనాల కోసం భూసేకరణ

ఉమ్మడి జిల్లాల్లో 13 బీసీ భవనాల నిర్మాణాలకు 2016-17లో నాటి టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. ఒక్కో భవనానికి రూ.5 కోట్లు ఖర్చవుతుంది. వీటిలో 3 నిర్మాణంలో ఉన్నాయి. వ్యయం పెరిగిన నేపథ్యంలో ఒక్కో బీసీ భవన్‌కు రూ.10 కోట్లు కేటాయించాలని బీసీ నేతలు కోరుతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూడు బీసీ భవనాలను త్వరగా పూర్తి చేయాలని, మిగిలిన భవనాల నిర్మాణానికి ఇతర జిల్లాల్లో భూసేకరణ పూర్తి చేయాలని సీఎం సూచించారు. ‘బీసీల రూ.896 కోట్ల రుణానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలి. అదేవిధంగా మిగిలిపోయిన 4 కాపు భవనాల నిర్మాణాలకు అవసరమైన నిధులు కేటాయించి పూర్తిచేయాలి. ప్రతి సామాజికవర్గానికి కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ ఏర్పాటు చేసి ఆయా వర్గాలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలి. ప్రతి సామాజికవర్గంలో ఆర్థికం గా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్లు ఎంతో కొంత సాయం చేయాలని భావిస్తున్నారు. ఇలాంటివారిని ప్రోత్సహించి ఆర్థికంగా ఆయ సామాజికవర్గాల్లో ఉన్న పేదలను పైకి తెచ్చేందుకు ప్రయత్నం చేయాలి’ అని పేర్కొన్నారు. త్వరలో ఎస్‌ఆర్‌ శంకరన్‌ నాలెడ్జ్‌ సెంటర్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. 26 జిల్లాల్లోని 104 బీసీ హాస్టళ్లలో పైలట్‌ ప్రాజెక్టులుగా దీన్ని అమలు చేయనున్నారు.


సామాజిక పెన్షన్లు తనిఖీ చేయాలి..

రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్న దివ్యాంగుల్లో పలువురు అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసిందే. అర్హులందరికీ పెన్షన్లు, పథకాలు అందాలన్నదే తమ ఉద్దేశమని, అనర్హులకు ఇవ్వడం సరికాద ని ఈ సందర్భంగా అన్నారు. ఎవరు అర్హులు, ఎవరు కాదో తేలాలంటే నిర్దిష్ట నిబంధనలు అమలు కావాలన్నారు. అనర్హులను తొలగించేందు కు పూర్తిస్థాయిలో పింఛన్ల తనిఖీ చేపట్టాలని ఆదేశించారు. పింఛన్ల తనిఖీని కొందరు తొలగింపు కార్యక్రమమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై అర్హులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు. 3 నెలల్లో దివ్యాంగుల పింఛన్లపై తనిఖీలు పూర్తి చేయాలన్నారు. తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చే వైద్యులు, అధికారులు, సిబ్బందిపై చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. తప్పుడు సర్టిఫికెట్‌ ఇస్తే.. ఎప్పటికైనా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 03:34 AM