Share News

Chandrababu: జగన్‌కు 11 సీట్లు.. ఎందుకంటే..?

ABN , Publish Date - Jun 21 , 2024 | 03:57 AM

ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి విధ్వంసానికి గురైందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.

Chandrababu: జగన్‌కు 11 సీట్లు.. ఎందుకంటే..?
CM Chandrababu Naidu

అంతా ధ్వంసం చేశారు.. ఒక దుర్మార్గుడి వల్ల రాజధాని బలైంది: చంద్రబాబు

ఏం చేయాలో, ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు.. అందరి అభిప్రాయాలు తీసుకుని మళ్లీ పట్టాలపైకి

‘‘రాష్ట్రం, దేశం, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రార్థనాలయాలు, పవిత్ర నదుల నుంచి మట్టి, జలాలు తీసుకొచ్చి రాజధాని నిర్మాణానికి ఆనాడు శంకుస్థాపన చేశాం. గత ఐదేళ్లలో జగన్‌ ఎంతగానో విధ్వంసం చేయాలని ప్రయత్నించినా ఆ మహిమే ఈరోజు రాజధానిని కాపాడింది. అమరావతి రైతులు 1631 రోజులు ఉద్యమం చేశారు. వాటిలో ఒక్కో సంఖ్య కూడితే 11 వస్తుంది. చివరికి జగన్‌కు కూడా 11 సీట్లే వచ్చాయి అంటే ఇది దేవుడి స్క్రిప్టే’’

- చంద్రబాబు


ghn.jpg

బ్రాండ్‌ను ఘోరంగా దెబ్బతీశారు..

ఐదేళ్లపాటు తుమ్మచెట్లు పెంచారు

ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది

మరోవైపు గల్లా పెట్టె ఖాళీ చేశారు

అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం

రాజధానికి పూర్వ వైభవం తీసుకొస్తాం

రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన

ప్రజావేదిక ప్రాంతంతో మొదలుపెట్టి అన్ని భవన

సముదాయాలు పరిశీలించిన ముఖ్యమంత్రి

ఏ రూల్‌ ప్రకారం ప్రజావేదిక కూల్చారు?

అధికారులను నిలదీసిన ముఖ్యమంత్రి

వేదిక నమూనా చిత్రం చూస్తూనే భావోద్వేగం


అమరావతి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి విధ్వంసానికి గురైందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. అమరావతిని అన్ని రకాలుగా దెబ్బతీసే ప్రయత్నం చేశారన్నారు. ఒకవైపు విధ్వంసం, నిర్వీర్యం చేస్తూనే మరోవైపు అపహాస్యం చేశారని వ్యాఖ్యానించారు. చివరికి రాజధానిలోని భవనాల్లో తలుపులు పగలగొట్టించి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చారని మండిపడ్డారు. గురువారం రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాలుగు గంటలపాటు విస్తృతంగా పర్యటించారు. నాటి సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చివేసి తన విధ్వంసక పాలనను ప్రారంభించారు. చంద్రబాబు కూలిన ప్రజావేదిక ప్రాంతంలో మొదలుపెట్టి రాజధాని ప్రాంతంలోని అన్ని భవన నిర్మాణ సముదాయాలను పరిశీలించారు. అనంతరం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో రైతుల సమక్షంలో మీడియాతో మాట్లాడారు. ‘‘అమరావతి మనకు చిరునామా లాంటిది. ఐదు కోట్ల మంది దిశ దశను నిర్ధారించే రాజధాని ఇది. ఉద్యోగం, ఉపాధి కోసం చెన్నై, బెంగళూరు నగరాలకు తరలిపోకుండా సగర్వంగా మా రాజధాని అని చెప్పుకొనే నగరం. మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారు. ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పనితో పాలన ప్రారంభిస్తారు. కానీ జగన్‌ ప్రజావేదిక కూల్చివేతతో పరిపాలన మొదలుపెట్టారు. అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీయాలని విషం జల్లే ప్రయత్నాలు చేశారు. ఐదేళ్ల కిందట వేసిన మట్టి అక్కడే ఉంది. చివరికి రాజధాని నిర్మాణానికి తీసుకొచ్చిన పైపులు, ఇసుక, రోడ్డు కంకర కూడా దొంగలించారు. ఒక్క భవనాన్ని కూడా పూర్తిచేసే ఆలోచన చేయలేదు. మొత్తం తిరిగి చూశాక నాకే ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి వచ్చింది. రోడ్లు మధ్యలోనే ఆగిపోయాయి. అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదయాలు నిలిచిపోయాయి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూస్తే బాధ కలిగింది. రాష్ట్రం, దేశం, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రార్థనాలయాలు, పవిత్ర నదుల నుంచి పవిత్ర మట్టి, జలాలు తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం. ప్రధాని మోదీ పార్లమెంటులోని మట్టితో పాటు యమునా నదీ జలాలు తీసుకొచ్చారు. ఎంత విధ్వంసం చేయాలని ప్రయత్నించినా ఆ మహిమే ఈరోజు రాజధానిని కాపాడింది.’’ అని చంద్రబాబు తెలిపారు.


శ్వేతపత్రం విడుదల చేస్తాం

‘‘రాజధానిని తిరిగి పునర్‌నిర్మించాలి. మరోవైపు ప్రభుత్వ గల్లా పెట్టె ఖాళీ చేశారు. అందుకే అసలు పరిస్థితి ఏంటనే దానిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఇది ఏ ఒక్క వ్యక్తికీ చెందిన రాజధాని కాదు. ఇది రాష్ట్ర ప్రజలందరిది. మరోవైపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, కర్నూలును అధునాతన నగరంగా తీర్చిదిద్దుతాం. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పింది. అందుకు అనుగుణంగానే అమరావతిని ఎంపిక చేశాం. దీనిపై ఇన్‌సైడింగ్‌ ట్రేడింగ్‌ అని, స్విస్‌ చాలెంజ్‌ అని అవహేళన చేశారు. ఫలితంగా రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా రాజధాని ఇదీ అని చెప్పుకోలేని దుస్థితి. అమరావతి కోసం 55వేల ఎకరాలు సేకరించాం. 29వేల మంది రైతుల్లో ఒక్కరూ కోర్టుకు వెళ్లలేదు. రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన తర్వాత మిగిలిన భూములు విక్రయించడం ద్వారా అద్భుతమైన రాజధాని కట్టొచ్చు. అందుకే ఇది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సిటీ. రాజధాని నగరం వల్ల ఆదాయం పెరుగుతుంది. తద్వారా అభివృద్ధి కార్యక్రమాలతోపాటు సంక్షేమ పథకాలు అమలుచేయవచ్చు’’ అన్నారు.


తుమ్మ చెట్లు పెంచారు...

‘‘రాజధాని ప్రాంతం మొత్తం తుమ్మచెట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు వాటిని తొలగించడమే పెద్ద పని. అందుకే టెండర్లు పిలిచి మొత్తం తుమ్మ చెట్లు తొలగించాలని ఆదేశించా. అప్పుడే ఏది ఎక్కడుందనే క్లారిటీ వస్తుంది. రాజధాని ప్రాంతం మొత్తాన్ని అతలాకుతలం చేశారు. మౌలిక సదుపాయాల నిర్మాణ సామగ్రిని దొంగలించారు. పైగా అసాంఘిక కార్యకలాపాలు, రౌడీయిజానికి అడ్డాగా మార్చారు. ఇకపై ఈ ప్రాంతంలో తప్పుడు పని చేసేవారిని నిర్మొహమాటంగా అణచివేస్తాం. గతంలో ముఖ్యమంత్రులు మంచి చేయలేకపోతే వదిలేసేవారు. అంతేగానీ ఉన్నవాటిని చెడగొట్టే ప్రయత్నం చేయలేదు. కానీ జగన్‌ అందుకు భిన్నంగా మొత్తం నాశనం చేశారు’’ అని చంద్రబాబు ఆగ్రహించారు.


పూర్వవైభవం తీసుకొస్తాం

‘‘ఎక్కడికక్కడ నిలిచిపోయిన అమరావతికి తిరిగి పూర్వవైభవం తీసుకొస్తాం. ఓవైపు ఖాజానా ఖాళీ అయినందున ఎలా చేస్తే బాగుంటుందో పరిశీలిస్తాం. ఇందుకోసం ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్లీ పని ప్రారంభిస్తాం. రాజధాని నగరంలో భూ రికార్డులు ఏం చేశారో చూడాలి. ప్రజావేదికపై ఏం చేయాలో చూడాలి. జపాన్‌లో హిరోషిమా, నాగసాకి నగరాలను... అణుబాంబులు వేసిన తర్వాత విధ్వంసానికి ప్రతీకగా అలాగే ఉంచారు. ఇప్పుడు ప్రజావేదికను కూడా అలాగే ఉంచాలా? లేదా? అనేది చూస్తాం. గత ప్రభుత్వంలో కొందరు అధికారులు అడ్డగోలుగా పనిచేసి ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోయారు. ఎడాపెడా అప్పులు చేశారు. చివరికి భవిష్యత్తులో వచ్చే మద్యం ఆదాయం చూపి కూడా అప్పులు తీసుకొచ్చారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు..


జగన్‌కు దేవుడి స్క్రిప్టే..

‘‘అమరావతి రైతులు 1631 రోజులు ఉద్యమం చేశారు. వాటిలో ఒక్కో సంఖ్య కూడితే 11 వస్తుంది. చివరికి జగన్‌కు కూడా 11 సీట్లే వచ్చాయి అంటే ఇది దేవుడి స్క్రిప్టే. మనది చారిత్రక విజయం. దేశ చరిత్రలో ఇలాంటి ఘన విజయం లేదు. వైసీపీకి ఓట్లు వేసిన వారు కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి వారు రాజకీయాలకు అర్హులా? అని చూడా లి. దీనిపై విస్తృత చర్చ జరగాలి. నన్ను అరెస్టు చేసినప్పుడు 80 దేశాల్లో నిరసనలు తెలిపారు. అది చూసి మన తెలుగువారు ఇన్ని దేశాల్లో ఉన్నారా అని ఆశ్చర్యపోయా. అంటే అదంతా అభివృద్ధి జరగడం వల్ల సాధ్యమైంది. జగన్‌ నుంచి దేవుడే అమరావతి కాపాడాడు’’ అని చంద్రబాబు అన్నారు.


ఇవి వ్యక్తిగత సంపదలు కావు

‘‘రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు వ్యక్తిగత సంపదలు కావు. ఇవి రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడేవి. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి, నదుల అనుసంధానం చేసుకుంటే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. అలాంటి పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందుతుంది. అమరావతిని పూర్తి చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. అందువల్ల వీటిని ఏ ఒక్కరి ఆస్తిగా భావించకూడదు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.


బాబును చూడగానే జేజేలు..

ఐదేళ్ల నుంచి రాజధాని కోసం పూజలు చేస్తున్నామని, ఇప్పటికి అవి ఫలించాయని ఆయనతో వారు అన్నారు. పక్కనే ఉన్న శిలాఫలకాలను చూశారు. అక్కడ రైతులు, మహిళలు జైజై బాబు అని నినాదాలు చేశారు. చంద్రబాబు దగ్గరకు వచ్చి మహిళలు సంతోషం వెలిబుచ్చారు. సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ ప్రదేశాన్ని చూసి ఒకింత కలత చెందినట్లుగా ఆయన కనిపించారు. ఆ తర్వాత జరిగిన ప్రెస్‌మీట్‌లో.... అమరావతి ప్లాన్‌ ఫొటోను చూపించారు. తర్వాత రాయపూడిలో ఓ అపార్ట్‌మెంట్‌ పైకి ఎక్కి అమరావతిలో పెరిగిన తుమ్మచెట్లను, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. హైకోర్టు సమీపంలో నిలిచిపోయిన జడ్జిల నివాస భవనాలను పరిశీలించారు. ప్రభుత్వ కార్యదర్శుల భవన సముదాయాలను పరిశీలించుకుంటూ సెక్రటేరియట్‌ భవన నిర్మాణ ప్రదేశానికి చంద్రబాబు వచ్చారు. అక్కడ నీట మునిగి ఉన్న పునాదులను చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అధికారులను అడిగి నిర్మాణ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు 80శాతం, ఐఏఎస్‌ అధికారుల భవనాలు 70శాతం పూర్తయ్యాయని అధికారులు వివరించారు. అక్కడి నుంచి గ్రూప్‌- 4 ఉద్యోగుల భవన సముదాయం, న్యాయమూర్తులు, మంత్రుల గృహ సముదాయాలను పరిశీలించుకుంటూ నిర్మాణంలో ఉన్న సీఆర్డీఏ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రజలను, మీడియాను ఉద్దేశించి భావోద్వేగంతో ప్రసంగించారు. ప్రజలు, మీడియా నుంచి ఆయన సలహాలు, సూచనలు కోరారు. పర్యటన దారిపొడవునా విపరీతంగా తుమ్మచెట్లు పెరిగి అడవిని తలపించింది. దీంతో వెంటనే తుమ్మచెట్ల తొలగింపునకు ఆదేశాలు జారీచేశారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఉన్నతాధికారులు అనిల్‌కుమార్‌ సింఘాల్‌, కాటమనేని భాస్కర్‌, వివేక్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.


‘‘నాటి వైసీపీ దుష్ట పాలనలో రాజధాని ప్రాంతం విధ్వంసానికి గురైంది. మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారు. ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పనితో పాలన ప్రారంభిస్తారు. కానీ జగన్‌ ప్రజావేదిక కూల్చివేతతో తన పరిపాలనను అప్పట్లో మొదలుపెట్టారు. శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూస్తే బాధ కలిగింది.’’

‘‘ఐదేళ్ల కిందట రాజధాని శంకుస్థాపనకు వేసిన మట్టి ఎక్కడిది అక్కడే ఉంది. చివరికి రాజధాని నిర్మాణానికి తీసుకొచ్చిన పైపులు, ఇసుక, రోడ్డు కంకర కూడా దొంగలించారు. ఒక్క భవనాన్నీ పూర్తిచేసే ఆలోచన చేయలేదు. మొత్తం తిరిగి చూశాక, నాకే ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి వచ్చింది. రోడ్లు మధ్యలోనే ఆగిపోయాయి. అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదయాలు నిలిచిపోయాయి’’

- చంద్రబాబు


ఏ రూల్‌ ప్రకారం ప్రజావేదిక కూల్చారు?

అధికారులను నిలదీసిన ముఖ్యమంత్రి

ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో పర్యటించారు. ఆయన ఇంటి పక్కనే కూల్చివేసిన ప్రజావేదికతో తన పర్యటన మొదలుపెట్టారు. అక్కడి శకలాలను పరిశీలించారు. ఏ రూల్‌ ప్రకారం ప్రజావేదికను కూల్చివేశారని సీఆర్‌డీఏ అధికారులను ప్రశ్నించారు. ‘ప్రజావేదికను నిబంధనల ప్రకారం నిర్మించాం. మీరు ఏ రూల్‌ ప్రకారం కూల్చివేశారో చెప్పండి. దీనికి కాంపిటేటివ్‌ అథారిటీ ఎవరు?’ అని నిలదీశారు. పై అధికారులు ఆదేశాలిచ్చారని అక్కడున్న అధికారులు సమాధానమిచ్చారు. రాతపూర్వకంగా ఇచ్చారా? మౌఖికంగా ఇచ్చారా? అని ప్రశ్నించగా మౌఖిక ఆదేశాలు వచ్చాయి అని బదులిచ్చారు. ఏ రూల్‌ ప్రకారం కూల్చారనేదానికి మాత్రం అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. అనంతరం శకలాల మధ్యలోకి చంద్రబాబు వెళ్లి చూశారు. ప్రజావేదిక నమూనా చిత్రాన్ని చూసి ఆవేదన వ్యక్తంచేశారు.

Updated Date - Jun 21 , 2024 | 07:24 AM