Nallamala forest : ఎట్టకేలకు చిక్కిన చిరుతపులి
ABN , Publish Date - Jun 29 , 2024 | 04:36 AM
నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారిలో నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన బోనుకు ఓ చిరుత పులి చిక్కింది. .
మహిళను చంపిన చిరుతగా ప్రాథమిక అంచనా
తిరుపతి జూకు తరలించిన అటవీశాఖ అధికారులు
శిరివెళ్ల, జూన్ 28: నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారిలో నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన బోనుకు ఓ చిరుత పులి చిక్కింది. . కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ షేక్ మెహరున్నీసాపై ఈ నెల 25న చిరుతపులి దాడిచేసి హతమార్చిన విషయం తెలిసిందే. చిరుత తరచూ గ్రామ పరిసరాల్లో సంచరిస్తుండడంతో దాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు పలు చోట్ల బోన్లు, ట్రాప్ కెమెరాలను అమర్చారు. ఎట్టకేలకు పచ్చర్ల చెక్‌పోస్టు సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో శుక్రవారం తెల్లవారుజామున ఓ చిరుత పులి చిక్కింది. ప్రస్తుతం బోనులో చిక్కిన చిరుత పులి.. మహిళపై దాడి చేసిన చిరుతగా అటవీశాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు కలిగిన ఈ చిరుతను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్‌కు తరలించినట్టు ఎఫ్‌ఆర్‌వో ఈశ్వరయ్య వెల్లడించారు.