Share News

CM Chandrababu : మనమే ప్రతిపక్షం

ABN , Publish Date - Nov 14 , 2024 | 04:55 AM

అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా ఎన్డీయేనే పోషించాలి. ప్రశ్నలు మనమే వేద్దాం.. సమాధానాలూ మనమే చెబుదాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu : మనమే ప్రతిపక్షం

ప్రజాసమస్యలపై ప్రశ్నలు వేద్దాం

మనమే సమాధానాలూ చెబుదాం

అందరం కలిసి టీమ్‌ వర్క్‌ చేద్దాం

సభపై ప్రజల్లో గౌరవం పెంచుదాం

చీఫ్‌విప్‌, విప్‌లకు చంద్రబాబు నిర్దేశం

అమరావతి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):‘‘అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా ఎన్డీయేనే పోషించాలి. ప్రశ్నలు మనమే వేద్దాం.. సమాధానాలూ మనమే చెబుదాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొత్తగా ఎంపికైన చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు సహా కూటమి పార్టీలకు చెందిన విప్‌లు బుధవారం ఉదయం అసెంబ్లీలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఆయన పలు సలహాలు, సూచనలు చేశారు. ‘‘చీఫ్‌ విప్‌, విప్‌లపై పెద్ద బాధ్యత ఉంటుంది. ప్రజలంతా అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు, ప్రసంగాలను చూస్తుంటారు. కాబట్టి అసెంబ్లీ గౌరవమర్యాదలు నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ ఉండాలి. ముఖ్యంగా ఆ బాధ్యత చీఫ్‌ విప్‌, విప్‌లపై ఎక్కువగా ఉంది. అందరం కలిసి టీమ్‌ వర్క్‌ చేద్దాం. అందుకే ప్రతి పదిమంది ఎమ్మెల్యేలకు ఒక విప్‌ను కేటాయించాం. ప్రతిపక్ష పార్టీకి బాధ్యత లేదు. కాబట్టి ఆ పార్టీ పాత్ర కూడా మనమే పోషించాలి. నియోజకవర్గాల్లో ప్రజలకు దగ్గరగా ఉండాలి’’ అని చంద్రబాబు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన శాఖలో అద్భుతంగా పని చేస్తున్నారని సీఎం కొనియాడారు.

ఒకే కుటుంబంగా కలిసి ఉండి సుపరిపాలన అందిద్దామన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడంతోపాటు వాటికి పరిష్కారాలు కూడా సభలో సూచించాలని కోరారు. ఆ మేరకు ఎమ్మెల్యేలను చీఫ్‌ విప్‌; విప్‌లు సిద్ధం చేయాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే, విప్‌ అదినారాయణ రెడ్డి.... వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు చేసిన అరాచకాలను సీఎంకు వివరించారు. చంద్రబాబు కల్పించుకుని....రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, దానిని సరిచేసే పనిలోనే ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా పాలన చేస్తుందని, ఎమ్మెల్యేలంతా ప్రజలకు దగ్గరగా ఉండాలని చంద్రబాబు సూచించారు. అనంతరం వారిని అభినందించారు.

లోకేశ్‌ను కలిసిన చీఫ్‌ విప్‌, విప్‌లు

బుధవారం అసెంబ్లీ ముగిసిన అనంతరం మంత్రి లోకేశ్‌ను చీఫ్‌ విప్‌, విప్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఉభయసభల్లో సంధించాల్సిన ప్రశ్నలతోపాటు విప్‌లు అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సభలో మంత్రులు కూడా ప్రశ్నించాలని ఆయన సూచించారు. ప్రతిపక్షం లేకపోయినా అర్థవంతమైన చర్చ జరగాలని లోకేశ్‌ ఆకాంక్షించారు. రెండు, మూడు పార్లమెంట్‌ స్థానాల పరిధిలోని ఎమ్మెల్యేలకు ఒక విప్‌ చొప్పున కేటాయించి.. సమన్వయం చేసుకోవాలని సూచించారు.

చీఫ్‌ విప్‌లకు కేబినెట్‌ హోదా

అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ, మండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌, ప్రభుత్వ విప్‌లను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ, మండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌లకు కేబినెట్‌ మంత్రి హోదాను, ప్రభుత్వ విప్‌లకు సహాయ మంత్రి హోదాను కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి వినయ్‌ చంద్‌ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా నియమితులైన వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బుధవారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబును సతీసమేతంగా కలిశారు. చీఫ్‌ విప్‌ పదవి ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని సీఎంతో చెప్పారు.

Updated Date - Nov 14 , 2024 | 04:55 AM