Coldest Temperatures : ఏజెన్సీ గజగజ
ABN , Publish Date - Dec 17 , 2024 | 04:21 AM
మధ్య భారతం నుంచి వీస్తున్న అతి శీతల గాలుల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చలి మరింత పెరిగింది.
అరకు లోయలో 3.8 డిగ్రీలు
ఉదయం పదైనా వీడని పొగమంచు
మధ్య భారతం నుంచి వీస్తున్న అతి శీతల గాలుల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చలి మరింత పెరిగింది. సోమవారం ఉదయం పది గంటల వరకు మన్యంలో అనేకచోట్ల ప్రజలు చలికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 3.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే జి.మాడుగులలో 4.1, డుంబ్రిగుడలో 6, జీకే వీధిలో 7.3, చింతపల్లి, ముంచంగిపుట్టులో 8.1, హుకుంపేటలో 8.8, పెదబయలులో 9.0, అనంతగిరిలో 9.4, తీర ప్రాంతంలోని కళింగపట్నంలో 13.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో మొదటిసారి ఏజెన్సీవ్యాప్తంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతకు గిరిజనులు గజగజ వణుకుతున్నారు. ఉదయం పది గంటల వరకూ పొగమంచు వదలడం లేదు. దీంతో వాహనచోదకులు లైట్లు వేసుకోకుండా రాకపోకలు సాగించలేదని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో గిరిజనులు పెద్దపెద్ద దుంగలతో మంటలు వేసుకుని చలి నుంచి రక్షణ పొందుతున్నారు. కాగా, మంగళవారమూ చలి ప్రభావం కొనసాగుతుందని, అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి చలి స్వల్పంగా తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది.