కలుషిత ఆహారం తిని 32 మందికి అస్వస్థత
ABN , Publish Date - Nov 17 , 2024 | 02:09 AM
తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల వసతి గృహంలో ఆహారం కలుషితమై శుక్రవారం రాత్రి 32 మంది విద్యార్థినులు అస్వస్థతకు గరయ్యారు.
అర్ధరాత్రి 17 మంది రుయాకు తరలింపు ఫ మరో 15 మందికి వసతిగృహంలోనే వైద్యం
గిరిజన వసతి గృహంలో ఘటన
తిరుపతి(వైద్యం/విద్య), నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల వసతి గృహంలో ఆహారం కలుషితమై శుక్రవారం రాత్రి 32 మంది విద్యార్థినులు అస్వస్థతకు గరయ్యారు. సుమారు 10 గంటల సమయంలో కడుపు నొప్పితో మొదలై విరోచనాలు, తలనొప్పి, కళ్లు తిరగడంతో అధికారుల దృష్టికి వాచ్ ఉమెన్ తీసుకెళ్లారు. అర్ధరాత్రి దాటాక 17 మంది విద్యార్థినులను 108 వాహనాల్లో రుయాకు తరలించారు. రుయా అధికారులను, డీఎంహెచ్‌వో శ్రీహరిని కలెక్టర్ వెంకటేశ్వర్ అప్రమత్తం చేయడంతో వాళ్లంతా ఆస్పత్రికి చేరుకొన్ననరు. మెడిసిన్ వార్డులో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వైద్య చికిత్సలు అందించారు. శనివారం మధ్యాహ్నానికి విద్యార్థులు కోలుకున్నారు. ఇద్దరు మినహా మిగిలిన 15 మందిని డిశ్చార్జి చేశారు. శనివారం ఉదయానికి మరో 15 మంది స్వల్పంగా అస్వస్థతకు గురవంతో వసతి గృహంలోనే వారికి చికిత్స అందించారు. ప్రస్తుతం అందరూ బాగున్నారని వైద్యాధికారులు వెల్లడించారు.
ఆహారంలో బల్లి?
ఏం జరిగింది, ఏమి తిన్నారు, ఆహారం ఎలా ఉందని విద్యార్థులను శుక్రవారం రాత్రి వైద్యులు ఆరా తీయగా విస్తుపోయే విషయాలు చెప్పారు. భారతీయ అటవీ జాతుల స్వాతంత్య్ర సమర యోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా గిరిజన భవన్‌లో శుక్రవారం గిరిజన స్వాభిమాన ఉత్సవాలు జరిగాయి. మధ్యాహ్నం గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాలల వసతి గృహాల విద్యార్థులకు పప్పు, గుత్తివంకాయ, బఠానీ కూర, కోడి గుడ్ల పులుసు వడ్డించారు. రాత్రి పాఠశాల విద్యార్థులకు వసతి గృహంలోనే భోజనం పెట్టారు. పప్పు కూరలో బల్లి లాగా ఏదో కనిపించిందని, దానిని పడేశానని ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో చెప్పినట్టు విద్యార్థినులు చెప్పారు. ఇలా అప్పుడప్పుడూ ఆహారంలో కీటకాలు కనిపిస్తుంటాయని, సిబ్బందిని అడిగితే తిడతారని, అందువల్ల తాము వాటిని తీసేసి తినేస్తుంటామని చెప్పారు. మధ్యాహ్నం వడ్డించగా మిగిలిన కోడిగుడ్ల పులుసును రాత్రి మళ్లీ వేశారని, అప్పటికే కోడిగుడ్లు చెడిపోయి వాసన వస్తున్నట్లు తెలిపారు. వాటిని విద్యార్థులకు వడ్డించడం, సిబ్బందికి భయపడి వారు తినేయడం అనారోగ్యానికి కారణంగా కనిపిస్తోంది. ఈ విషయాలన్నీ కొందరు విద్యార్థులు ఆంధ్రజ్యోతికి వివరించారు. ఐతే శనివారం మధ్యాహ్నానికి కొందరు మాట మార్చారు. వసతి గృహ అధికారులు భయపెట్టడంతోనే విద్యార్థులు మాటమార్చినట్టు విమర్శలున్నాయి. కాగా, రుయాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి సుగుణమ్మ పరామర్శించారు. ఏం జరిగిందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు భాస్కర్, హేమంత్, వెంకటేష్, రమణ తదితరులు పాల్గొన్నారు. గిరిజన సంఘాల నాయకులు వసతి గృహంవద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఆహార పదార్థాలను పరిశీలించారు. బియ్యం సహా కూరగాయలు, ఉల్లిపాయలన్నీ నాసిరకంగా, కుళ్లిపోయి ఉన్నాయని సిబ్బందిని, అధికారులను నిలదీశారు.