Share News

సింగిల్‌ బెడ్‌రూం ఇంట్లో 32 ఓట్లు!

ABN , Publish Date - Feb 08 , 2024 | 12:39 AM

తొలగించమని ఇంకెన్నిసార్లు చెప్పాలన్న టీడీపీ నేతలు

సింగిల్‌ బెడ్‌రూం ఇంట్లో 32 ఓట్లు!

తిరుపతి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరం అబ్బన్న కాలనీలో 18-39-ఎస్‌4-407 డోరు నెంబరుగల సింగిల్‌ బెడ్‌రూం ఇంటిలో 32 మంది ఓటర్లు ఇంకా కొనసాగుతుండడం చూసి టీడీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ బీఎల్‌ఏ ఇచ్చిన సమాచారం మేరకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్‌ నరసింహ యాదవ్‌ ఇతర టీడీపీ నేతలు బుధవారం సదరు డోర్‌ నెంబరు కలిగిన ఇంటికి వెళ్లి పరిశీలించారు. అధికార పార్టీకి చెందిన కార్యకర్త ఇల్లుగా గుర్తించారు. ఇంత చిన్న ఇంటిలో 32 ఓట్లు ఎలా వచ్చాయని ఆ కార్యకర్తను ప్రశ్నించగా గతంలో ఇక్కడ ఉండేవారని, ఇప్పుడు మంగళం తదితర ప్రాంతాల్లో ఉన్నారని, ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు వేసి పోతుంటారంటూ అతను నిర్భయంగా చెప్పిన సమాధానానికి విస్మయానికి గురయ్యారు.నగరపాలక సంస్థ ఎన్నికల సమయంలోనే దొంగ ఓట్లు చేర్చినట్టుగా అంచనాకొచ్చారు.ప్రస్తుతం ఆ ఇంట్లో వున్న ఇద్దరి ఓట్లను మాత్రమే వుంచి మిగిలిన ఓట్లను తొలగించాలని డిమాండు చేశారు. తిరుపతిలో దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు.టీడీపీ నాయకులు ఆర్సీ మునికృష్ణ, మునిశేఖర్‌ రాయల్‌, మహేష్‌ యాదవ్‌, బ్యాంకు శాంతమ్మ, రాజేంద్ర ప్రసాద్‌, యువరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2024 | 12:39 AM