ఐదేళ్లలో 3746 మంది అదృశ్యం
ABN , Publish Date - Jul 31 , 2024 | 02:43 AM
తిరుపతి జిల్లా వరకే చూస్తే గడచిన ఐదేళ్ళలో ఏకంగా 3746 మంది బాలికలు, యువతులు, మహిళలు అదృశ్యమయ్యారు.
బాలికలు, యువతులు, మహిళల అదృశ్యంపై లోక్‌సభలో హోం శాఖ సహాయ మంత్రి వెల్లడి
తిరుపతి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బాలికలు, యువతులు పెద్ద సంఖ్యలో అదృశ్యమవుతున్నారంటూ ఇదివరకూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. రాష్ట్రం పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ అప్పట్లో వైసీపీ వర్గాలు ఆయనపై విరుచుకుపడ్డాయి. అయితే తాజాగా మంగళవారం సాక్షాత్తూ లోక్‌సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వెల్లడించిన వివరాలు గత వైసీపీ పాలకులకు చెంపపెట్టుగా పరిణమించింది. ఏపీ మొత్తం సంగతి పక్కన పెట్టి ఒక్క తిరుపతి జిల్లా వరకే చూస్తే గడచిన ఐదేళ్ళలో ఏకంగా 3746 మంది బాలికలు, యువతులు, మహిళలు అదృశ్యమయ్యారు.అదే సమయంలో ఈ ఐదేళ్ళ వ్యవధిలో పోలీసు యంత్రాంగం 3848 మంది ఆచూకీని కనుక్కోగలిగింది. 2019కి ముందు అదృశ్యమైన వారి, అలాగే ఇతర ప్రాంతాల్లో అదృశ్యమైన వారి ఆచూకీ జిల్లాలో లభించడం వల్ల అదృశ్యమైన వారి సంఖ్య కంటే ఆచూకీ దొరికిన వారి సంఖ్య స్వల్పంగా ఎక్కువగా కనిపిస్తోంది.
ఐదేళ్ళలో 3746మంది అదృశ్యంపై ఫిర్యాదులు
గడచిన ఐదేళ్ళలో జిల్లానుంచీ 3746మంది కనిపించకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇందులో కేటగిరీ వారీగా చూస్తే 1389మంది బాలికలు గల్లంతు కాగా అదే కేటగిరీలో 1420మంది ఆచూకీ తెలిసింది. అలాగే 2357మంది యువతులు, మహిళలు ఆచూకీ తెలియలేదని ఫిర్యాదులందగా ఆ ఏడాదిలోనే 2418మంది ఆచూకీ తెలిసింది. మొత్తంగా ఐదేళ్ళలో ఈ రెండు కేటగిరీలూ కలిపి 3746మంది అదృశ్యం కాగా 3848మంది ఆచూకీ తెలిసింది. మంగళవారం లోక్‌సభలో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, బీకే పార్థసారధి దీనిపై లిఖితపూర్వక ప్రశ్నలు వేయగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై వివరాలు వెల్లడించారు.
2019లో 579 మంది అదృశ్యం
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 2019లో 18 ఏళ్ళ లోపు బాలికలు 219మంది అదృశ్యమయ్యారు.అదే ఏడాది 240మంది ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. 18 ఏళ్ళు, ఆపై వయసున్న యువతులు, మహిళలు 360మంది అదృశ్యం కాగా 347మంది ఆచూకీ తెలిసింది.ఈ రెండు కేటగిరీల్లో కలిపి ఆ ఏడాది 579మంది అదృశ్యమైనట్టు ఫిర్యాదులు అందగా 587మంది ఆచూకీని పోలీసులు కనుగొన్నారు.
2020లో 931మంది గల్లంతు
2020లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 18ఏళ్ళ లోపు బాలికలు 349మంది అదృశ్యమైతే ఆ ఏడాదిలో 347మంది ఆచూకీ తెలిసింది. 18ఏళ్ళ యువతులు, అంతకు పైబడిన వయసు కలిగిన మహిళలు 582మంది ఆచూకీ గల్లంతు కాగా 605మంది ఆచూకీని కనుగొన్నారు. ఆ ఏడాది బాలికలు, యువతులు, మహిళలూ కలిపి 931మంది అదృశ్యమైనట్టు పోలీసులకు ఫిర్యాదులందితే 952మందిని ట్రేస్ చేయగలిగారు.
2021లో 1085మంది మాయం
2021లో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 412మంది బాలికలు కనిపించకుండా పోగా ఆ ఏడాదిలో 428మంది బాలికల ఆచూకీని కనిపెట్టగలిగారు. అలాగే 673మంది యు వతులు, మహిళలు గల్లంతు కాగా 717మంది ఆచూకీ వెల్లడైంది. ఆ ఏడాది మొత్తంగా 1085మంది బాలికలు, యువతులు, మహిళలు కనిపించకుండా పోగా 1145మంది ఆచూకీ తెలిసింది.
2022లో కనిపించకుండా పోయిన 615మంది
2022లో కొత్త జిల్లాల ప్రాతిపదికన తిరుపతి జిల్లాలో 217మంది బాలికలు గల్లంతు కాగా 211మంది ఆచూకీ కనిపెట్టారు.398మంది యువతులు,మహిళలు కనిపించకుండా పోగా 425మంది ఆచూకీ తెలిసింది. ఆ ఏడాది మొత్తంగా 615మంది అదృశ్యమైతే 636మంది ఆచూకీని కనిపెట్టారు.
2023లో 536మంది మిస్సింగ్
2023లో 192మంది బాలికలు అదృశ్యం కాగా 194మంది ఆచూకీ తెలిసింది. 344మంది యువతులు, మహిళలు గల్లంతు కాగా 324మంది ట్రేస్ అయ్యారు. మొత్తం 536మంది కనిపించకుండా పోగా 518 మందిని కనిపెట్టారు.