Share News

రూ.50 లక్షల లిక్విడ్‌ గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Aug 23 , 2024 | 02:06 AM

తిరుపతిలో పోలీసులు దాదాపు 50 లక్షల విలువ చేసే లిక్విడ్‌ గంజాయిని గురువారం మధ్యాహ్నం ఓ కారుతోపాటు స్వాధీనం చేసుకున్నారు.

రూ.50 లక్షల లిక్విడ్‌ గంజాయి స్వాధీనం
లిక్విడ్‌ గంజాయిని మీడియాకు చూపుతున్న సీఐ సాదిక్ ఆలి

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 22: తిరుపతిలో పోలీసులు దాదాపు 50 లక్షల విలువ చేసే లిక్విడ్‌ గంజాయిని గురువారం మధ్యాహ్నం ఓ కారుతోపాటు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రూరల్‌ సీఐ సాదిక్‌ ఆలి తెలిపిన వివరాల మేరకు.. కేఎల్‌71-డీ 3686 నెంబరుతో ఉన్న కారులో లిక్విడ్‌ గంజాయి భారీ ఎత్తున తీసుకెళుతున్నారని పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో రూరల్‌ సీఐతోపాటు ఎస్‌ఐలు షేక్‌ షావలి, నాగేంద్రబాబు తమ సిబ్బందితో కలసి నాయుడుపేట- పూతలపట్టు జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్నారు. చిత్తూరు వైపు వెళుతున్న ఈ కారులోని వారు పోలీసులను చూసి పరారవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంబడించడంలో కారును రామానుజపల్లె సర్కిల్‌ వద్ద వదిలి, అందులోని ముగ్గురు పరారయ్యారు. కారును పరిశీలించగా డిక్కీ, డ్రైవర్‌ సీటు వెనుక లిక్విడ్‌ గంజాయి మూటలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారుగా రూ.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పరారైన ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఏఎ్‌సఐ రాఘవ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2024 | 02:06 AM