702 ఎకరాల ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:11 AM
నిబంధనలకు విరుద్ధంగా చాలావరకు నిషేధిత భూములను ఫ్రీ హోల్డ్ చేయించారు.
మాటల్లేవ్. మాట్లాడుకోవడాల్లేవ్. నిబంధనలు ఖాతరు చేయడాల్లేవ్. అంతా మేం చెప్పినట్లే చేయాలంతే. అలా.. వైసీపీ నేతలు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. కొందరు అధికారులూ ఉత్సాహం చూపారు. నిబంధనలకు విరుద్ధంగా చాలావరకు నిషేధిత భూములను ఫ్రీ హోల్డ్ చేయించారు. వీటిలో 702 ఎకరాలను అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు. కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టడంతో ఈ వ్యవహారం బయటపడింది.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి
వైసీపీ ప్రభుత్వంలో..
ఫ్రీ హోల్డ్ చేసింది: 76 వేల ఎకరాలు
నిబంధనల ఉల్లంఘన: 30 వేల ఎకరాల వరకు..
మొత్తం రిజిస్ట్రేషన్లు జరిగింది: 1761 ఎకరాలు
వీటిలో అడ్డగోలుగా చేసింది: 702 ఎకరాలు
జిల్లాలో ఫ్రీహోల్డ్ భూములపై విచారణ కొనసాగుతోంది. ఫ్రీ హోల్డ్ చేయడంలో.. చేసిన వాటి రిజిస్ట్రేషన్లలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. 2003కు ముందు జారీ చేసిన అసైన్‌మెంట్.. డీకేటీ పట్టాలకు చెందిన భూములను మాత్రమే ఫ్రీ హోల్డ్ చేయడానికి జీవో అవకాశం కల్పించింది. జిల్లాలో మాత్రం 2003 తర్వాత జారీ అయిన అసైన్‌మెంట్ పట్టా భూములనూ నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టు విచారణ అధికారులు గుర్తించారు. పశువుల మేత పొరంబోకు భూములుగా రికార్డుల్లో నమోదైన వాటిని ఫ్రీ హోల్డ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ వీటికి కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చినా ప్రభుత్వం నుంచి అనుమతి రానిదే ఫ్రీ హోల్డ్ చేయకూడదని నిబంధనలున్నాయి. అలాంటి పశువుల మేత పొరంబోకు భూములనూ ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్టర్ చేసేశారు. ఒకరి పేరిట పట్టా జారీ అయిన భూముల్లో ఇతరులు ఉన్నట్లయితే వాటినీ ఫ్రీ హోల్డ్ చేయకూడదు. ఇలా నిబంధనన్నీ ఉల్లంఘించి 702 ఎకరాలకు రిజిస్టర్ చేశారని పక్కాగా నిర్ధారించారు.
ఆ భూముల విలువ అపారం
జిల్లాలో రిజిస్టర్ అయిన 1761 ఎకరాల్లో వెయ్యి ఎకరాలు కేవలం శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, చంద్రగిరి మండలాల్లోనే ఉన్నాయి. ఇక్కడి భూములకు విలువ ఎక్కువ. శ్రీకాళహస్తి మండలంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ఎకరా రూ.30 లక్షల దాకా పలుకుతోంది. ఇక ప్రధాన రహదారులకు చేరువగా ఉంటే రూ.కోట్లు పలుకుతోంది. మిగిలిన మూడు మండలాల్లోనూ ఎకరా రూ.కోట్లలోనే ఉంది. పోనీ, ఎకరా రూ.30 లక్షలతోనే లెక్కించినా కూడా అక్రమంగా రిజిస్టర్ అయిన వెయ్యి ఎకరాల విలువ రూ. 300 కోట్లు. వాస్తవ విలువ మేరకు లెక్కిస్తే ఆ మొత్తం రూ. వేల కోట్లకు చేరుతుంది. కూటమి ప్రభుత్వం వీటి రిజిస్ట్రేషన్లను నిలపకుంటే.. అంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం నష్టపోయినట్టు అయ్యేది.
60 వేల ఎకరాల్లో పరిశీలన పూర్తి
జిల్లావ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వం 76 వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ చేసిన క్రమంలో కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికి 60 వేల ఎకరాలకు సంబంధించిన రికార్డులతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన కూడా పూర్తి చేశారు. ఈ 60 వేలల్లో సుమారు 30 వేల ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసినట్టు గుర్తించారు. మిగిలిన 16 వేల ఎకరాలపై విచారణ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. అందులో ఎన్ని ఎకరాల విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందో తేలనుంది.
ఎన్నికలు సమీపించిన తరుణంలోనే..
నిజానికి నిషేధిత జాబితాలోని భూముల స్వభావం, ఫ్రీ హోల్డ్ చేయడానికి అర్హత ఉందా లేదా అన్నది వీఆర్వో రికార్డులు పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారించి డిప్యూటీ తహసీల్దారుకు ప్రతిపాదించాలి. తన స్థాయిలో డీటీ పరిశీలించి నిర్ధారించుకున్నాక తహసీల్దారుకు నివేదించాలి. ఆయన క్రాస్ చెక్ చేసుకుని ఆర్డీవోకు సిఫారసు చేస్తే.. ఆయన ఆ ఫైలును క్షుణ్ణంగా పరిశీలించి జేసీకి పంపాలి. జేసీ నుంచి అందిన ప్రతిపాదనలపై కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేస్తే గానీ నిషేధిత జాబితా నుంచీ భూములు ఫ్రీ హోల్డ్ కావు. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో త్వరగా డీకేటీ, అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్టర్ చేసుకోవాలనే తలంపుతో వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్ళు తెచ్చినట్టు సమాచారం. దీంతో చాలావరకూ తహసీల్దారు స్థాయిలోనే భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టు తెలిసింది. కొంత మేరకు ఆర్డీవోల స్థాయిలో ఈ తంతు నడిచినట్టు సమాచారం. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ ఈ ప్రహసనం నడిచింది. దీంతో బాధ్యులపై ప్రభుత్వం కనుక చర్యలకు దిగితే పెద్ద సంఖ్యలో వీఆర్వోలు, డీటీలు, తహసీల్దార్లతో పాటు ఆర్డీవోలపైనా వేటు పడుతుంది. దీంతో చర్యలకు సిఫారసు చేసే విషయంలో ఏమి చేయాలో తోచక జిల్లా యంత్రాంగం సతమతమవుతోంది.