వారం రోజుల్లో 93,203 బుకింగ్స్
ABN , Publish Date - Nov 07 , 2024 | 01:23 AM
జిల్లాలో ఉచిత గ్యాస్ బుకింగ్‌కు అనూహ్య స్పందన కనిపిస్తోంది. దీపం-2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమల్లోకి వచ్చిన వారం రోజుల్లో 93,203 మంది బుక్ చేసుకున్నారు.
- ఉచిత గ్యాస్‌కు అనూహ్య స్పందన
- 62,300 మందికి సిలిండర్ల డెలివరీ
- 26,100 మంది ఖాతాల్లో నగదు జమ
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉచిత గ్యాస్ బుకింగ్‌కు అనూహ్య స్పందన కనిపిస్తోంది. దీపం-2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమల్లోకి వచ్చిన వారం రోజుల్లో 93,203 మంది బుక్ చేసుకున్నారు. ఒక్కో ఏజెన్సీ నుంచి నగరాలు, పట్ణణాల్లో అయితే రోజుకు సగటున 450 నుంచి 500.. గ్రామీణ ప్రాంతాల్లో 300 వరకు సిలిండర్లు బుక్ అవుతున్నట్లు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ఇందులో 45 నుంచి 50 శాతం వరకు ఉచిత గ్యాస్ బుకింగ్‌లు జరుగుతున్నాయి. ఈ లెక్కన వారం రోజుల వ్యవధిలో 62 ఏజెన్సీల ద్వారా దాదాపు 93,203 మంది ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం బుక్ చేసుకున్నారు. అందులో 62,300 మందికి సిలిండర్లు డెలివరీ అయ్యాయి. వీరిలో చాలా మంది ఈకేవైసీ చేసుకోక పోవడంతో ఇప్పటి వరకు 26,100 మందికి మాత్రమే నగదు జమైంది. మిగిలిన వారు ఈకేవైసీ చేసుకోవాలని, రానున్న మూడు నెలల వ్యవధిలో అందరికీ నగదు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నగదు జమకాని వారు సంబంధిత గ్యాస్ ఏజెన్సీలను, డీఎ్‌సవోను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పౌరసరపరాల శాఖ అధికారులు సూచించారు.
అనుమానాలుంటే నివృత్తి చేసుకోండి
గ్యాస్ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ ఆధార్ ఇవ్వకపోవడంతో కొందరు ఉచిత గ్యాస్‌కు అర్హత పొందలేక పోయారు. వీరు ఆధార్ అనుసంధానం చేసుకుంటే పథకానికి అర్హులవుతారు. కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరిట గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే పథకానికి సంబంధించిన రాయితీ వర్తిస్తుంది. భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా అర్హులవుతారని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇంకా ఎవరికైనా అనుమానాలుంటే 1967 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోను చేసి తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.