Share News

పరకామణి దొంగతనంపై విచారణ కమిషన్‌ వేయాలి

ABN , Publish Date - Dec 26 , 2024 | 01:42 AM

శ్రీవారి పరకామణి దొంగతనంపై విచారణ కమిషన్‌ వేయాలని టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకా్‌షరెడ్డి డిమాండు చేశారు. పరకామణి జియ్యర్‌ మఠం ఉద్యోగి రవికుమార్‌ శ్రీవారి సొమ్మును దొంగలించి లోక్‌ అదాలత్‌లో రాజీ పడి టీటీడీకి స్వాధీనం చేసిన ఆస్తులను బుధవారం ఆయన పరిశీలించారు.

పరకామణి దొంగతనంపై విచారణ కమిషన్‌ వేయాలి
అపార్టుమెంట్‌లో ఫ్లాట్లను పరిశీలిస్తున్న భానుప్రకా్‌షరెడ్డి

ఒకే అపార్టుమెంటులో కొన్న 14 ప్లాట్లు టీటీడీకి రాయించుకుని రాజీ చేశారు

టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి

తిరుపతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి పరకామణి దొంగతనంపై విచారణ కమిషన్‌ వేయాలని టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకా్‌షరెడ్డి డిమాండు చేశారు. పరకామణి జియ్యర్‌ మఠం ఉద్యోగి రవికుమార్‌ శ్రీవారి సొమ్మును దొంగలించి లోక్‌ అదాలత్‌లో రాజీ పడి టీటీడీకి స్వాధీనం చేసిన ఆస్తులను బుధవారం ఆయన పరిశీలించారు. తిరుపతిలోని మంగళం పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగాగల పసుపర్తి అపార్ట్‌మెంట్‌లో శ్రీవారి సొమ్ముతో కొనుగోలు చేసిన 14 ఫ్లాట్లను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023లో పరకామణి చోరీపై జియ్యర్‌ మఠం ఉద్యోగి రవికుమార్‌పై నమోదైన కేసును పునర్విచారణ చేయాలని ఇప్పటికే టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావుకు విజ్ఞప్తి చేశానన్నారు. పోలీసుల ఒత్తిడితో లోక్‌ అదాలత్‌లో రాజీ పడ్డామని విజిలెన్స్‌ అధికారులు ఇచ్చిన నివేదికను ఆయన తప్పుబట్టారు. శ్రీవారి హుండీ కాజేసి కూడగట్టిన రూ.40 కోట్ల విలువైన ఆస్తులను రవికుమార్‌ టీటీడీకి బదిలీ చేశారని చెప్పారు. అప్పటి విజిలెన్స్‌ అధికారులు అతన్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారన్నారు. అయితే కేసు రాజీపై పలు అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. రాజీ కోసం ఒత్తిడి చేసిన పోలీసులు, టీటీడీ అధికారులు ఎవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. హుండీలో రవికుమార్‌ దోచేసిన మొత్తాన్ని కక్కిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం శ్రీవారి ఖజానాను దోచుకుందని మండిపడ్డారు. టీటీడీ విజిలెన్స్‌ రిపోర్టులో రూ.72వేల విదేశీ కరెన్సీ పట్టుకున్నట్టు ఉందన్నారు. ఇండియన్‌ పోలీస్‌ సర్వీ్‌సను జగన్మోహన్‌ రెడ్డి పొలిటికల్‌ సర్వీసుగా మార్చాడని ఆరోపించారు. అప్పటి టీటీడీ పాలక మండలిలో ఎవరెవరు ఒత్తిడి చేశారో తేలాల్సిన అవసరం ఉందన్నారు. రవికుమార్‌ నుంచి పసుపర్తి అపార్ట్‌మెంట్‌లో 14ఫ్లాట్‌లను టీటీడీ రాయించుకుందన్నారు. ఇవన్నీ దాదాపు రూ10కోట్లు విలువ చేస్తాయన్నారు. పూర్తిస్థాయిలో హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని, దోషులను భక్తుల ముందు నిలబెడతామని హెచ్చరించారు. దాదాపు రూ.500కోట్ల కుంభకోణం నడిచిందని, రవికుమార్‌ నుంచి కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. అందుకే ఈకేసును నీరుగార్చారన్నారు. దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు లేకుండా సీసీ ఫుటేజీని కూడా తొలగించారని చెప్పారు. ఈ కుంభకోణంలో పెద్ద తలల బాగోతం బయటపడుతుండడంతో రవికుమార్‌ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని, ఆయనకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే అందరి జాతకాలు బయటపెడతామని, విజిలెన్స్‌ నివేదిక చదివిన తర్వాత టీటీడీలో ఇంత దారుణాలు జరిగాయా? అని కంట్లో నీళ్లు వచ్చాయన్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిసి వివరించానని చెప్పారు. బీజేపీ నేత, అడ్వకేట్‌ అజయకుమార్‌ మాట్లాడుతూ.. భక్తులు సమర్పించిన కానుకలను దొంగలించిన రవికుమార్‌ కేసులో బలమైన 409 సెక్షన్‌ నమోదు చేయకుండా నామమాత్రపు సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశారన్నారు. ఉన్నతస్థాయి విచారణ జరిగితే ఈకేసు వెనుక ఉన్నవారు బయటకు వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వరప్రసాద్‌, పొనగంటి భాస్కర్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 01:42 AM