శ్రీవారి ఆలయానికి సమీపంలో ప్రయాణించిన హెలికాఫ్టర్
ABN , Publish Date - Oct 22 , 2024 | 02:12 AM
తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో సోమవారం ఓ హెలికాఫ్టర్ ప్రయాణించడం కలకలం సృష్టించింది.
తిరుమల, అక్టోబరు21(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో సోమవారం ఓ హెలికాఫ్టర్ ప్రయాణించడం కలకలం సృష్టించింది. సాధారణంగా ఆలయ ఆగమశాస్త్రం ప్రకారం గర్భాలయం పైభాగంలో విమానాల రాకపోకలుండకూడదు. అయితే కొద్ది నెలలుగా తిరుమల క్షేత్రం మీదుగా విమానాలు, హెలికాఫ్టర్లు ప్రయాణిస్తూనే ఉన్నాయి. దీనిపై ఇప్పటికే పలుమార్లు అర్చకులు, ఆగమ పండితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తిరుమలను నోఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని టీటీడీ గతంలో అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే నోఫ్లయింగ్ జోన్‌గా తిరుమలను ప్రకటించడం సాఽధ్యం కాదని కేంద్రమూ స్పష్టం చేసింది. కానీ భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వీలైనంతవరకు తిరుమల క్షేత్రం మీదుగా విమానాలు, హెలికాఫ్టర్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే ఇటీవల తిరుమలపై విమానాలు ప్రయాణిస్తూనే ఉన్నాయి. తాజాగా సోమవారం ఉదయం 10.30 గంటల సమమంలో హెలికాఫ్టర్ భారీ శబ్దంతో ప్రయాణించడంతో మళ్లీ నో ఫ్లయింగ్ జోన్ అంశం తెరపైకి వచ్చింది. ఈ హెలికాఫ్టర్‌పై ఉన్న లోగోను పరిశీలిస్తే ఇండియన్ ఆర్మీకి సంబంధించినదిగా తెలుస్తోంది. దీంతో టీటీడీ అధికారులు మౌనంగా ఉండిపోయారు.