మరింత పటిష్ఠంగా సోషల్ మీడియా సెల్
ABN , Publish Date - Nov 21 , 2024 | 01:15 AM
సైబర్ క్రైం సెల్‌కు అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా సెల్‌ను మరింత పటిష్ఠ పరచడానికి చర్యలు చేపట్టారు.
అనుచిత పోస్టులు, అసభ్యకర వ్యాఖ్యలపై నిఘా
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): సైబర్ క్రైం సెల్‌కు అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా సెల్‌ను మరింత పటిష్ఠ పరచడానికి చర్యలు చేపట్టారు. ఈ సెల్‌కు అవసరమైన అన్ని అధికారాలు కట్టబెట్టడానికి జిల్లా అధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో దాదాపు 16 కేసులు నమోదైనట్లు అఽధికారులు చెప్పారు. ఇన్‌స్టా, వాట్సాప్, ఎక్స్ మాధ్యమాల్లో అసభ్యకర మెసేజీలు పోస్టు చేస్తున్న వారికి 41 ఏ నోటీసులు అందించడం.. మరోవైపు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అయినా కొందరు అటు అధికారులు.. ఇటు ప్రభుత్వ అధినేతలను టార్గెట్‌గా చేసుకుని ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట నుంచి వాట్సా్‌పలు, ఇన్‌స్టా ద్వారా అసభ్యకర పోస్టులు పెడుతూనే ఉన్నారు. దీన్ని గుర్తించిన అధికారులు సోషల్ మీడియా సెల్‌కు అవసరమైన బాధ్యతలు, అధికారాలు కట్టబెట్టాలని ఆలోచిస్తున్నారు. కాగా, సోషల్ మీడియాలో పేరు ఒకరిది.. అకౌంటు మరొకరు హ్యాండిల్ చేస్తుండటం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. నచ్చని పార్టీ నాయకుడిపై అసభ్యకరంగా పోస్టింగ్ లేదా మార్ఫింగ్ చేసిన ఫొటోలను అప్లోడ్ చేయడం వంటి వ్యవహారాలన్నీ చేస్తున్న హ్యాండిలర్స్ ఎక్కువగా యువకులే ఉన్నట్లు తెలిసింది. అటువంటి వారిపైనా పోలీసులు దృష్టి సారించారు. ప్రధానంగా కొంతమంది ఉన్నత స్థాయి చదువులు చదువుతున్న వారు.. మరికొందరు మధ్యలో ఆగిపోయి సులభంగా డబ్బు సంపాదనకు ఆశపడి ఇలాంటి అసభ్యకర పోస్టులు పెట్టి డబ్బులు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పాటు చేసుకుంటూ అసభ్యకరమైన పోస్టులు చేస్తున్న వారిని ఒకదారికి తీసుకురావడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం సైబర్ క్రైం సెల్‌కు అనుబంధంగా వున్న సీఐ విక్రమ్‌ను ఇన్చార్జిగా నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వారిపై ఇప్పటికే 16 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు మరికొంతమందిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.