Share News

సిలికాసురులు, గనులు మింగిన వారిపై కొరడా

ABN , Publish Date - Oct 27 , 2024 | 01:33 AM

వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా రెచ్చిపోయిన సిలికాసురులు, గనులు మింగిన వారిపై కొరడా ఝళిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా భూగర్భ, గనుల శాఖ అధికారులు వారం రోజులుగా అక్రమార్కుల చిట్టాను తయారు చేయడంలో తలమునకలై ఉన్నారు.

సిలికాసురులు, గనులు మింగిన వారిపై కొరడా
జగన్‌ జమానాలో అనధికారికంగా తనిఖీ చేస్తున్న ‘జే’టాక్స్‌ సిబ్బంది(ఫైల్‌ఫోటో)

గూడూరు(అర్బన్‌), అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా రెచ్చిపోయిన సిలికాసురులు, గనులు మింగిన వారిపై కొరడా ఝళిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా భూగర్భ, గనుల శాఖ అధికారులు వారం రోజులుగా అక్రమార్కుల చిట్టాను తయారు చేయడంలో తలమునకలై ఉన్నారు. ముందుగా ఎం.డి.ఎల్‌(మైనింగ్‌ డీలర్స్‌ లైసెన్స్‌) అక్రమాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అనుమతుల్లేని చోట్ల అక్రమంగా ఖనిజాల సేకరణ, ప్రభుత్వ రాయల్టీకి మించి కట్టిన ‘.జే’ట్యాక్స్‌తో పొందిన పర్మిట్లు, లెక్కకు మించిన ఖనిజాల నిల్వలపై లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. 300 సిలికా సాండ్‌, క్వార్ట్జ్‌, గ్రావెల్‌ మైనింగ్‌ డీలర్లపై శాఖాపరమైన చర్యలు తప్పనిసరిగా తెలుస్తోంది. అలాగే మైనింగ్‌ లీజులను గలీజుగా మార్చిన మరికొంతమంది గనుల యజమానులపైనా ఉల్లంఘనలను బట్టి చర్యలు తీసుకోనున్నారు. గూడూరు, నాయుడుపేట డివిజన్లలో మొత్తం 399 ఎం.డి.ఎల్‌లకు సిలికా సాండ్‌, క్వార్ట్జ్‌, గ్రావెల్‌ తదితర ఖనిజాల గ్రేడింగ్‌, రవాణా కోసం భూగర్భ, గనుల శాఖ నుంచి అనుమతులున్నాయి. వీటిలో 72 ఎం.డి.ఎల్‌లకు మైనింగ్‌ అధికారులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. 327 మంది మైనింగ్‌ డీలర్లపై వివిధ రకాల అభియోగాలను నమోదు చేసి, ప్రభుత్వానికి పంపారు. వీరిపై తదుపరి చర్యల కోసం అధికారులు వేచి చూస్తున్నారు. క్లీన్‌చిట్‌ అందుకున్న డీలర్లకు ఖనిజాల రవాణా పర్మిట్లను అందించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. నిబంధనలను స్వల్పంగా అతిక్రమించిన వారికి తగిన జరిమానా విధించి ఆపై రవాణా అనుమతులు ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు సూతప్రాయంగా వెల్లడించాయి. అభియోగాలు తీవ్రంగా ఉన్న డీలర్లపై కఠినంగా వ్యవహరించే అవకాశముంది.

గనుల యజమానులపైనా చర్యలు..

గీత దాటిన మైనింగ్‌ యజమానులపై చర్యలకు గూడూరు అధికారులు తలమునకలై ఉన్నారు. మైనింగ్‌ డీలర్లపై చర్యల అనంతరం వారిపై దృష్టి సారించనున్నారు. గూడూరు డివిజన్‌లోని కోట, చిల్లకూరు మండలాల్లో 80 సిలికా గనులు, చిల్లకూరు, గూడూరు రూరల్‌ మండలాల్లో 15 క్వార్ట్జ్‌, మైకా(అభ్రకం), ఫెల్సపర్‌ గనులు 5 వర్ముఖ్‌ లైట్‌ గనుల్లో నుంచి ఖనిజాల వెలికితీతకు ప్రభుత్వ అనుమతులున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న 2019-24 మధ్య కాలంలో, ఎక్కువగా 2023-24కాలంలో వైసీపీ నాయకుల అండతో అనుమతులు ఉన్న గనులతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ అనుమతులు ఉన్న గనుల నుంచి పర్మిట్లను డ్రా చేసి అక్రమ రవాణాకు ఉపయోగించినట్లు మైనింగ్‌ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనిపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. రెండు మూడు రోజుల్లో పూర్తి నివేదికలను ప్రభుత్వానికి పంపనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

నివేదికలు సిద్ధం

గూడూరు డివిజనల్‌ భూగర్భగనులశాఖ పరిధిలోని 14 మండలాల్లో ప్రధానంగా కోట, చిల్లకూరు, గూడూరు రూరల్‌ మండలాల్లో 2023-24 ఆర్ధిక సంవత్సరంలో జరిగిన మైనింగ్‌ అక్రమాలపై నివేదికలు దాదాపు సిద్ధం చేసినట్లు డివిజనల్‌ భూగర్భ, గనుల శాఖ అధికారి కె.శ్రీనివాసరావు వెల్లడించారు. ఎండీఎల్‌లో జరిగిన అక్రమాలపై విచారణ పూర్తికాగా మైనింగ్‌ లీజుల్లో జరిగిన ఉల్లంఘనలపై సోమవారం కల్లా నివేదికలను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. గత ఆర్ధిక సంవత్సరంలో మైనింగ్‌ ద్వారా తమ డివిజన్‌లో ప్రభుత్వానికి రూ.77కోట్లు ఆదాయం సమకూరినట్లు డీఎంవో తెలిపారు.

Updated Date - Oct 27 , 2024 | 01:33 AM