Share News

రామ్మూర్తినాయుడుకు కన్నీటి వీడ్కోలు

ABN , Publish Date - Nov 18 , 2024 | 01:08 AM

జనసంద్రమైన నారావారిపల్లి పాడె మోసిన చంద్రబాబు, లోకేశ్‌ చితికి నిప్పంటించిన నారా రోహిత్‌, గిరీష్‌ హాజరైన మహరాష్ట్ర గవర్నర్‌ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు

రామ్మూర్తినాయుడుకు కన్నీటి వీడ్కోలు

తిరుపతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడుకి నారావారిపల్లెలో ఆదివారం కన్నీటితో వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌ నుంచి రామ్మూర్తి నాయుడు భౌతికకాయం చేరుకోకముందు నుంచే ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచీ జనం నారావారిపల్లెకు పోటెత్తారు. ఇతర జిల్లాల నుంచి కూడా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలూ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేకించి చంద్రగిరి నియోజకవర్గంలో గతంలో రామ్మూర్తినాయుడుతో కలసి పనిచేసిన సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో కనిపించారు. తమలో ఒకడుగా ఆప్యాయంగా మెలగిన రామ్మూర్తినాయుడును చివరిసారి చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. కొందరు కన్నీటి పర్యంతం అయ్యారు. నారావారిపల్లికి ఇరువైపులా ఖాళీగా వున్న పంట పొలలాన్నీ వాహనాలతో నిండిపోయాయి.

పినతండ్రి పార్ధివదేహం వెంట వచ్చిన లోకేశ్‌

ఉదయం 7.45 గంటలకల్లా రామ్మూర్తినాయుడు పార్ధివదేహం రేణిగుంటకు ప్రత్యేక విమానంలో చేరుకుంది. నారా లోకేశ్‌, నారా రోహిత్‌, గిరీష్‌, రామ్మూర్తి భార్య ఇందిరలు వెంట వచ్చారు. 8.39 గంటలకు పార్ధివదేహంతో పాటు రోడ్డు మార్గాన బయల్దేరి 9.06 గంటలకల్లా నారావారిపల్లి కి చేరుకున్నారు. స్వగృహం ఆవరణలో రామ్మూర్తినాయుడు భౌతికదేహాన్ని బంధుమిత్రులు, పార్టీ శ్రేణులు, ప్రజల సందర్శనార్ధం వుంచారు.

చంద్రబాబు, లోకేశ్‌ కుటుంబాల నివాళులు

ఉదయం 10.40 గంటలకు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు నారా దేవాన్ష్‌, సోదరి హైమావతిలు హైదరాబాదు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. రోడ్డు మార్గాన 11.22 గంటలకు నారావారిపల్లి చేరుకున్నారు. రామ్మూర్తినాయుడు పార్ధివ దేహానికి చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి, హైమావతిలు పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నారావారిపల్లికి వచ్చిన మహరాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు నారా లోకేశ్‌ పాదాభివందనం చేశారు.

తమ్ముడి పాడె మోసిన చంద్రబాబు

రామ్మూర్తినాయుడు అంతిమయాత్ర సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు ఆయన పాడె మోశారు. ఇంటి వద్ద నుంచీ సమీపంలోని సొంత మామిడి తోట వరకూ సాగిన అంతిమయాత్రలో పులివర్తి నానితో కలిసి చంద్రబాబు పాడె మోశారు.

కన్నీటి పర్యంతం

తమ్ముడి పార్థివదేహాన్ని అంతిమయాత్రకు కదలించినపుడు, అంత్యక్రియల సందర్భంలోనూ చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. లోకేశ్‌ కూడా గంభీరంగా ఉండిపోయారు. రోహిత్‌, గిరీ్‌షలు విలపించారు.

అమ్మానాన్నల సమాధుల దగ్గరే..

మధ్యాహ్నం 1.30 గంటల నుంచీ అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అనంతరం 2.33 గంటలకు ఇంటి వద్ద నుంచీ అంతిమయాత్ర ప్రారంభమైంది. చేరువలోనే వున్న సొంత మామడి తోపులో చంద్రబాబు తల్లిదండ్రుల సమాధుల సమీపంలోనే అంత్యక్రియలు జిల్లా యంత్రాంగం అధికార లాంఛనాల నడుమ జరిగాయి. తొమ్మిది మంది ఆర్ముడ్‌ రిజర్వు పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. 3.50 గంటలకు తనయులు నారా రోహిత్‌, నారా గిరీ్‌షలు తండ్రి చితికి నిప్పంటించారు.

డప్పు కొట్టిన మంద కృష్ణ

మాదిగ ఉద్యమం నారావారిపల్లె నుంచి మొదలు పెట్టినపుడు రామ్మూర్తి నాయుడు తమను ఆదరంగా చూసుకున్నారంటూ ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణ మాదిగ జ్ఞాపకం చేసుకున్నారు. ఆయనకు నివాళిగా డప్పు కొట్టారు.

నేటి మధ్యాహ్నం దాకా పల్లెలోనే చంద్రబాబు, లోకేశ్‌

సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. సోమవారం మధ్యాహ్నం వరకూ నారావారిపల్లిలోనే వుంటారని సమాచారం. సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌లు కూడా ఆయనతో పాటే నారావారిపల్లిలోనే వుండనున్నారు. ఆదివారం రాత్రి నుంచీ సోమవారం సాయంత్రం దాకా గ్రామస్తులు, సన్నిహిత బంధువులనూ ఆయన కలవనున్నట్టు తెలిసింది.

అంత్యక్రియలకు రాజకీయ, సినీ ప్రముఖులు

రామ్మూర్తినాయుడు అంత్యక్రియలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. మహరాష్ట్ర గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణ, హీరోలు నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్‌, మోహన్‌ బాబు, మంచు మనోజ్‌, నిర్మాత ఎన్‌వీ ప్రసాద్‌, మాజీ మంత్రులు అమరనాధరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కొత్తపల్లి సుబ్బరాయుడులు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చంద్రగిరి, నగరి, శ్రీకాళహస్తి, చిత్తూరు, సత్యవేడు, పూతలపట్టు, వెంకటగిరి, చింతలపూడి, పెదకూరపాడు, మడకశిర ఎమ్మెల్యేలు పులివర్తి నానీ, గాలి భానుప్రకాష్‌, బొజ్జల సుధీర్‌రెడ్డి, గురజాల జగన్మోహన్‌, కోనేటి ఆదిమూలం, మురళీ మోహన్‌, కురుగొండ్ల రామకృష్ణ, రోహణ్‌ కుమార్‌, భాష్యం ప్రవీణ్‌, ఎంఎస్‌ రాజు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకా్‌షరెడ్డి, ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణ మాదిగ, శాప్‌ ఛైర్మన్‌ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నరసింహ యాదవ్‌, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సి.ఆర్‌.రాజన్‌, చిత్తూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ ఛైర్‌పర్సన్‌ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీలు దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు, దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు ఏ.మోహన్‌, సుగుణమ్మ, టీడీపీ మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, ఊకా విజయ్‌ కుమార్‌, చల్లా రామచంద్రారెడ్డి, ఆర్‌సి మునికృష్ణ, వీరబల్లి హేమాంబరధర నాయుడు, కోడూరు బాలసుబ్రమణ్యం, కలెక్టర్‌, డీఐజీ, ఎస్పీ, ఎస్వీయూ వీసీ అప్పారావు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, స్విమ్స్‌ సీఎంవో శివశంకర్‌ తదితరులు హాజరైన వారిలో వున్నారు.

Updated Date - Nov 18 , 2024 | 01:08 AM