‘అమెరికా’ ప్రమాద మృతులకు కన్నీటి వీడ్కోలు
ABN , Publish Date - Oct 26 , 2024 | 02:20 AM
ఆ రెండు కుటుంబాలు తమ పిల్లల మృతదేహాల కోసం పది రోజులుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. ఎదురుచూశాయి.
కేవీబీపురం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆ రెండు కుటుంబాలు తమ పిల్లల మృతదేహాల కోసం పది రోజులుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. ఎదురుచూశాయి. శుక్రవారం సాయితేజారెడ్డి, హరితారెడ్డి దంపతుల మృతదేహాలు రాగానే వీరి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. కేవీబీపురం మండలం ఆదరంలో బంధుమిత్రులు, స్థానికుల కన్నీటి వీడ్కోలు నడుమ ఆ దంపతులకు అంత్యక్రియలు జరిగాయి. ఆదరం గ్రామానికి చెందిన సాయితేజారెడ్డి.. తొట్టంబేడు మండలానికి చెందిన హరితారెడ్డికి 2022లో వివాహమైంది. వీరు అమెరికాలోని టెక్సా్సలో స్థిరపడ్డారు. స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లి వస్తుండగా.. ఈ నెల 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో హరితారెడ్డి, మరో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. సాయితేజారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 15న అసువులు బాసిన విషయం తెలిసిందే. సాయితేజారెడ్డి, హరితారెడ్డి మృతదేహాలను శుక్రవారం స్వగ్రామైన ఆదరానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో విషాదం నెలకొంది.