ఆడికృత్తిక ఉత్సవాలు
ABN , Publish Date - Jul 31 , 2024 | 02:22 AM
శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది.
శ్రీకాళహస్తి, జూలై 30: శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీవళ్లీ దేవసేన సమేత కుమారస్వామిని అలంకార మండపంలో విశేషంగా అలకరించి మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య నారద పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు.తెప్పలపై అధిష్ఠింపజేసి పూజలు చేశారు. అనంతరం విద్యుత్ దీపకాంతుల మధ్య పుష్కరిణిలో తెప్పపై విహరించిన కుమారస్వామిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు.ఈవో ఎన్‌వీఎ్‌సఎన్ మూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
కన్నులపండువగా కల్యాణోత్సవం
పాకాల: పాకాల మండలం ఊట్లవారిపల్లె సమీపంలోని ఆనందగిరి (పాళ్యంకొండ)పై ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వళ్లీ దేవసేన సమేత కళ్యాణ సుబ్రమణ్యస్వామికి మంగళవారం ఉదయం కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు.కళ్యాణోత్సవానికి
పూజ సామగ్రి, పూలమాలలను ఎమ్మెల్యే పులివర్తి నాని సమర్పించారు. స్వామివారికి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆడికృత్తికను పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి ఉదయం నుంచీ రాత్రి వరకు భక్తులు బారులు తీరారు. పుష్పకావిళ్లు, తలనీలాలు సమర్పించి స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు.రాత్రి ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన పల్లకిలో వళ్లీ దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో విహరించారు.