Share News

పాఠశాలలో ప్రమాదం

ABN , Publish Date - Aug 23 , 2024 | 02:03 AM

ఓ పాఠశాలలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. పాత ఫర్నిచర్‌ దగ్ధమైంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేయడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది.

పాఠశాలలో ప్రమాదం
భవనంపై పొగలు, మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 22: ఓ పాఠశాలలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. పాత ఫర్నిచర్‌ దగ్ధమైంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేయడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. బైరాగిపట్టెడలోని సోక్రటీస్‌ పాఠశాలలో గురువారం ఉదయం తరగతులు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా భవనం నాల్గవ అంతస్తు నుంచి మంటలు ఎగసి పడ్డాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది భవనంపైకి వెళ్లి చూడగా.. అక్కడున్న గదిలో వాటర్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసిన మోటారు వైర్లలో షార్టుసర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగినట్లు గుర్తించారు. అక్కడున్న పాత ఫర్నిచర్‌, చిత్తు కాగితాలకు మంటలు వ్యాపించాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే ఫైరింజన్‌తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. అప్పటికే విద్యార్థులను పాఠశాల తరగతి గదుల నుంచి బయటకు పంపేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులూ పాఠశాల వద్దకు చేరుకున్నారు. పిల్లలు సురక్షితంగా ఉండటంతో ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. కాగా, పాఠశాలలో ఫైర్‌ ఫైటింగ్‌ పరికరాలు లేకపోవడంపై అగ్నిమాపక సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - Aug 23 , 2024 | 02:03 AM