Share News

మగాళ్లకు భయమా..?

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:54 AM

నాలుగేళ్లలో 27,436 మంది మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు ఇదే కాలంలో ‘వేసెక్టమీ’ చేసుకుంది ముగ్గురు పురుషులే..!

మగాళ్లకు భయమా..?

చిత్తూరు రూరల్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్లు చేయించుకోవడంలో మహిళలకంటే పురుషులు చాలా వెనుకబడి ఉన్నారు. కు.ని కోసం మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్‌, పురుషుడికైతే వేసెక్టమీ ఆపరేషన్‌ చేస్తారు. ఇందులో ట్యూబెక్టమీ ఆపరేషన్లే ఎక్కువగా జరుగుతున్నాయి. ఆపరేషన్‌ అంటే మగాళ్లు భయపడుతున్నారా? లేదా అది మహిళలకే అన్నట్టుగా మిన్నకుండి పోతున్నారో? తెలియడం లేదు. శనివారం వేసెక్టమీ డే సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

జిల్లావ్యాప్తంగా నాలుగేళ్లలో 27439 కు.ని ఆపరేషన్లు జరిగాయి. అందులో మహిళలు 27,436 మంది ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటే, పురుషులు మాత్రం ముగ్గురంటే ముగ్గురు వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్నారు. ఈ ఆపరేషన్‌ చేయించుకుంటున్న మగవారి సంఖ్య ఒక్కో ఏడాది అసలు ఉండటం లేదు.

పురుషులకే సులువు

కు.ని ఆపరేషన్‌ మహిళల కంటే పురుషులకే సులువని వైద్యులు చెబుతున్నారు. పురుషులకు ఎలాంటి కడుపు కోత లేకుండా 5 నుంచి 10 నిమిషాల్లో అయిపోతుంది. ఆపరేషన్‌ అయిన వెంటనే వారు ఇంటికి, పనులకు యథావిధిగా వెళ్లొచ్చని అంటున్నారు. వీర్యం ప్రయాణించే చిన్న వాహికకు గాటు పెట్టి.. అక్కడే మూసివేస్తారు. ఒకసారి ఈ ఆపరేషన్‌ పూర్తయ్యాక మళ్లీ కావాలనుకుంటే దీన్ని తెరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే మహిళలకు కు.ని. ఆపరేషన్‌ పూర్తయ్యాక నెల రోజుల పాటు జాగ్రతతో కూడిన విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని నెలలపాటు బరువులు ఎత్తకూడదు. ఆపరేషన్‌ జరిగిన పొట్ట భాగంలో ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదమూ లేకపోలేదు.

ప్రోత్సాహకం రూ.1,100

వేసెక్టమీ ఆపరేషన్‌ చేయించుకున్న వారికి ప్రభుత్వం రూ.1,100 ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఈ ఆపరేషన్‌ని ప్రోత్సహించి ఆస్పత్రికి తీసుకొచ్చిన వారికి కూడా రూ.250 చెల్లిస్తారు. వేసెక్టమీ చేసిన వైద్యుడికి రూ.150 ఇస్తారు. అదే ట్యూబెక్టమీ ఆపరేషన్‌ చేయించుకునే మహిళలకు రూ.850, ప్రోత్సహించి తీసుకొచ్చినవారికి రూ.150 చెల్లిస్తారు.

అపోహలు తొలగించడానికి కృషి

వేసెక్టమీ ఆపరేషన్‌పై ఉన్న అపోహలను తొలగించడానికి కృషి చేస్తున్నాం. ప్రధానంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయన్న అపోహ పురుషుల్లో బలంగా నాటుకుపోయింది. ఇది నిజం కాదని.. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నాం.

- ప్రభావతీదేవి, డీఎంహెచ్‌వో

Updated Date - Nov 16 , 2024 | 01:54 AM