ప్రాథమిక విద్యకు మళ్లీ ప్రాణం
ABN , Publish Date - Oct 30 , 2024 | 01:00 AM
‘విలీనం రద్దు’తో తెరచుకోనున్న 814 పాఠశాలలు సీఎం నిర్ణయంతో మూతబడిన బడులకు జీవం ఉపాధ్యాయ సంఘాల, తల్లిదండ్రుల హర్షం
త్తూరు సెంట్రల్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ తప్పిదంతో గాడి తప్పిన ప్రాథమిక విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. వైసీపీ సర్కారు అమల్లోకి తెచ్చిన 117 జీవోను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీన్ని ఇటు ఉపాధ్యాయ సంఘాలు, అటు విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. జీవో పూర్తి స్థాయిలో రద్దయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక విద్యకు ప్రాణం పోసినట్లే. వీటితోపాటు ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య గణనీయంగా తగ్గడమే కాకుండా, మరింతమంది ఉపాధ్యాయుల ఖాళీల భర్తీతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కానుంది.
తెరచుకోనున్న ప్రాథమిక పాఠశాలలు
వైసీపీ ప్రభుత్వం తెచ్చిన 117 జీవోతో విద్యావ్యవస్థ నిర్వీర్యమైంది. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లతో బోధన చేయిస్తామని.. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. ఈ నిర్ణయంతో విద్యా వ్యవస్థ ఒక్కసారిగా గాడి తప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌పీఎ్‌స)లో భాగంగా 2020-21లో మొదలైన ప్రాథమిక బడుల విలీనం రెండేళ్ల పాటు సాగింది.
జిల్లాలో విలీనం ఇలా..
తొలి దశలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 250 మీటర్ల దూరంలోని 316 ప్రాథమిక పాఠశాలలను 312 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. రెండో దశలో మూడు కిలో మీటర్ల దూరాన్ని నిర్దేశించారు. దీనిపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా ప్రక్రియ ముందుకు సాగింది. రెండో దశలో 498 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను 347 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. 2021లో విలీన నిర్ణయం తీసుకున్నారు.. 2022లో చేపట్టారు.. 2023 విద్యా సంవత్సరం చివరి వరకు ఈ ప్రక్రియ సాగింది. తొలుత ఉపాధ్యాయుల పదోన్నతులు, ఆపై సర్దుబాటుకు దారితీసింది.ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం 117 జీవో రద్దు చేస్తే తొలి, మలి దశల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూతబడిన 814 ప్రాథమిక పాఠశాలలు తెరచుకోనున్నాయి.గ్రామీణ పిల్లలకు విద్య అందడంతోపాటు.. ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడుతాయి. భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ మరోసారి ఇచ్చే అవకాశముంది.
2వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు తగ్గుతాయి
పాఠశాలల విలీనంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్య దూరం కావడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. విలీనం కాగా మిగిలిన పాఠశాలల్లో నిబంధనల ప్రకారం 20 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో ఎక్కువ మంది ఉన్న చోటుకు టీచర్లను బదిలీ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4,900 పాఠశాలలు ఉండగా, 30 మంది కంటే తక్కువ విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు రెండువేలకుపైగా ఉన్నాయి. వీటిల్లో చాలా చోట్ల ఇద్దరేసి టీచర్లు ఉండగా, పాఠశాలల విలీనంతో అవన్నీ ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. కూటమి ప్రభుత్వం 117 జీవో రద్దు చేస్తే ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య వేలల్లో నుంచి కేవలం పదుల సంఖ్యలోకి రానున్నాయి.