Share News

Yamini Krishnamurthy: భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత.. చంద్రబాబు సంతాపం

ABN , Publish Date - Aug 03 , 2024 | 06:49 PM

భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి(84)(Yamini Krishnamurthy) శనివారం మరణించారు. ఆమె గత కొంత కాలంగా వయోభార సమస్యలతో బాధపడుతున్నారు.

Yamini Krishnamurthy: భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత.. చంద్రబాబు సంతాపం

ఇంటర్నెట్ డెస్క్: భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి(84)(Yamini Krishnamurthy) శనివారం మరణించారు. ఆమె గత కొంత కాలంగా వయోభార సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సాయంత్రం ఢిల్లీలో కన్నుమూశారు.

ఆమె స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లె. 1940లో జన్మించిన ఆమె.. వేల సంఖ్యలో భరతనాట్య ప్రదర్శనలిచ్చారు. ఆమె ప్రతిభకుగానూ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డులను అందుకున్నారు.


యామిని గురించి..

భరత నాట్య నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా దేశానికి పేరు తెచ్చారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రేమ ఉన్న యామిని తన జీవితమంతా ఈ కళకే అంకితం చేశారు. మదనపల్లిలో డిసెంబర్ 20, 1940లో జన్మించిన యామిని భరతనాట్యం, కూచిపూడి, ఇతర సంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేశారు.

యామిని పుట్టుకతో తెలుగమ్మాయి కావచ్చు కానీ ఆమె పెరిగింది తమిళనాడులో. చిన్న వయసులోనే కుటుంబంతో సహా తమిళనాడుకి వచ్చారు. శివాలయంలో ఉన్న నటరాజ విగ్రహాన్ని చూసి మైమరచిపోయిన ఆమె నాట్యం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. యామిని రుక్మిణీ దేవి అరుండేల్ కళాక్షేత్రంలో నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారు.ప్రాథమిక నైపుణ్యాలను నేర్చుకున్న తరువాత, ఆమె ప్రసిద్ధ ఎల్లప్ప పిళ్లై, తంజావూరు కిట్టప్ప పిళ్లై వద్ద నృత్యాలు నేర్చుకోవడానికి కాంచీపురం వెళ్లారు. 1957లో తిరిగి చెన్నైకి వచ్చాక అనేక ప్రదర్శనలు ఇచ్చి అతి తక్కువ కాలంలో తారగా మారారు.


వీణ వాయించడం...

డ్యాన్స్‌తో పాటు, యామిని కర్ణాటక గాత్ర సంగీతం, వీణ వాయించడంలో కూడా శిక్షణ తీసుకున్నారు. విభిన్న అభిరుచులు ఉన్నప్పటికీ, కృష్ణమూర్తి ప్రధానంగా భరతనాట్యం, కూచిపూడిపై దృష్టి సారించారు. ఈ నృత్య రూపాలను ప్రదర్శించి దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందాడు. 1990లో ఆమె ఢిల్లీలో సొంత డ్యాన్స్ స్టూడియో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌ను ప్రారంభించారు. ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా (రెసిడెంట్ డ్యాన్సర్) గౌరవం పొందారు. కూచిపూడికి టార్చ్ బేరర్‌గా మారారు.

మూడు అత్యున్నత పురస్కారాలు..

కళారంగానికి చేసిన సేవలకుగానూ కృష్ణ మూర్తి... పద్మశ్రీ (1968), సంగీత నాటక అకాడమీ అవార్డు (1977), పద్మ భూషణ్ (2001), పద్మ విభూషణ్ (2016)తో సహా అనేక అవార్డులను అందుకున్నారు.


సీఎం చంద్రబాబు సంతాపం..

"భారత దేశం గర్వించదగిన నృత్యకారిణి, పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్రమైన ఆవేదన చెందాను. 1940లో మదనపల్లెలో జన్మించిన ఆమె తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన నర్తకిగా పని చేశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో ఆమె నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎనలేని పేరు తెచ్చిపెట్టింది కూడా యామినీ కృష్ణమూర్తి గారే. ఆమె లేని లోటు నృత్య కళా రంగంలో ఎవరూ తీర్చలేరు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను" అని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Updated Date - Aug 03 , 2024 | 09:04 PM