నకిలీ పత్రాలతో రుణం పొందిన ముగ్గురు మోసగాళ్ల అరెస్టు
ABN , Publish Date - Oct 29 , 2024 | 01:58 AM
నకిలీ భూమి డాక్యుమెంట్లు తాకట్టుపెట్టి తిరుపతి ఎస్‌బీఐలో దాదాపు రూ.2.80 కోట్ల రుణం పొందిన ముగ్గురిని క్రైం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): నకిలీ భూమి డాక్యుమెంట్లు తాకట్టుపెట్టి తిరుపతి ఎస్‌బీఐలో దాదాపు రూ.2.80 కోట్ల రుణం పొందిన ముగ్గురిని క్రైం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.9 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి క్రైం డీఎస్పీ రమణకుమార్ తెలిపిన ప్రకారం.. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన కడియాల రామారావు, చిలకలూరిపేటకు చెందిన అన్నపురెడ్డి శ్రీనివాసరావు, విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన కంచుపాటి బ్రహ్మయ్య కలిసి సులభంగా డబ్బు సంపాదించడానికి ప్రణాళిక రచించారు. రేణిగుంట మండలంలో ఫ్లోర్ క్లీనింగ్ మ్యాట్స్ తయారుచేసే లక్ష్మీనరసింహ పేరుతో పరిశ్రమ ఏర్పాటుకని తిరుపతికి వచ్చారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ్‌సకు రూ.5 కోట్ల వరకు రుణం ఇచ్చే న్యూబాలాజీకాలనీలోని ఎస్‌బీఐ బ్రాంచిని సంప్రదించారు. ఆస్తి దస్తావేజులు సమర్పించి రూ 2.80 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ తర్వాత కంతులు తిరిగి చెల్లించలేదు. దీంతో ప్రస్తుత బ్యాంకు అధికారులు, క్షేత్ర సిబ్బంది, విజిలెన్సు అధికారులు పరిశ్రమ వద్దకు వెళ్లి చూడగా రుణం తీసుకున్న పరిశ్రమ మూత పడి ఉంది. ఫ్యాక్టరీలో ఎలాంటి ఉత్పత్తులు లేకపోగా రెండేళ్ల కిందటే మూసేసి ఉండటంతో యంత్రాలన్నీ పాడైపోయాయి. దీనిపై వారు తిరుపతి క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైం అదనపు ఎస్పీ నాగభూషణరావు ఆధ్వర్యంలో డీఎస్పీ రమణకుమార్, సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు, చిరునామాల ఆధారంగా వారి కదలికలను గుర్తించారు. సోమవారం తిరుపతిలోని టౌన్‌క్లబ్ వద్ద నిఘా ఉంచి వారిని పట్టుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. రూ.ఆరు లక్షల నగదు స్వాధీ నం చేసుకున్నామన్నారు. ఇదే కేసులో మరికొంతమందిని అరెస్టు చేసి నగదు రికవరీ చేయాల్సి ఉందన్నారు.