అర్హులైన పేదలకు కేంద్ర పథకాలు అందించాలి
ABN , Publish Date - Oct 31 , 2024 | 02:24 AM
అర్హులైన పేదలకు కేంద్ర పథకాలు అందాలని, ఇందుకోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తిరుపతి జిల్లా సమన్వయ అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ(దిషా) చైర్మన్ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, కో చైర్మన్ చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు సూచించారు.
- దిషా సమావేశంలో ఎంపీలు ప్రసాదరావు, గురుమూర్తి
తిరుపతి(కలెక్టరేట్), అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలకు కేంద్ర పథకాలు అందాలని, ఇందుకోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తిరుపతి జిల్లా సమన్వయ అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ(దిషా) చైర్మన్ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, కో చైర్మన్ చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో తిరుపతి జిల్లా సమన్వయ అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ(దిషా) సమావేశం నిర్వహించారు. గురుమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో ఇతర రాష్ట్రాలు, జిల్లాలతో పోటీపడాలన్నారు. లక్ష్యసాధన దిశగా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్రం నుంచి 54 పథకాలు అమలవుతున్నాయని, లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా సమీక్షించుకుని ముందడుగు వేయాలని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి పథకాలు సక్రమంగా అందేలా పనితీరు ఉండాలని తెలిపారు. సభ్య కార్యదర్శి, కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ పథకాలను సమన్వయంతో అమలు చేస్తామన్నారు. నెల్లూరు జడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ వాకాడు, నాయుడుపేట, బీఎన్‌కండ్రిగ మండలాల్లో అంగన్‌వాడీలకు సొంత భవనాలు నిర్మించాలని, ఇందుకోసం జడ్పీ నిధులు ఇస్తామని తెలిపారు.
పలు అంశాలపై సమీక్ష
జిల్లాలో అదనపు భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటుకు నివేదికలు పంపుతామని, గాజులమండ్యం చక్కెర పరిశ్రమ పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఎన్టీఆర్ హౌసింగ్, పీఎం ఉజ్వల యోజన, రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు, ఎంపీ నిధులు దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తిరుపతిలో పెండింగ్‌లో ఉన్న మల్టీలెవల్ పార్కింగ్, ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ కాంప్లెక్సు తదితర ప్రాజెక్టు నిధుల కొరతపై సమీక్షించారు. సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జేసీ శుభం బన్సల్, కమిషనర్ మౌర్య, ఎంపీపీలు పాల్గొన్నారు.