Share News

ఆర్డీవో కార్యాలయంలో కుర్చీలాట

ABN , Publish Date - Dec 18 , 2024 | 01:16 AM

రెండున్నరేళ్లలో 9మంది బదిలీ పరిష్కారమవని రెవెన్యూ సమస్యలు

ఆర్డీవో కార్యాలయంలో కుర్చీలాట
పలమనేరు ఆర్డీవో కార్యాలయం

పలమనేరు, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుతో తమ సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని భావించిన పది మండలాల రైతులకు నిరాశే మిగులుతోంది. పలమనేరులో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరినా సంతోషం మిగలడంలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ నుంచి వేరుచేసి కుప్పం నియోజకవర్గ కేంద్రాన్ని కుప్పం రెవెన్యూ డివిజన్‌గా, పలమనేరు, గంగవరం బైరెడ్డిపల్లి, వి.కోట, పెద్దపంజాణి,పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, బంగారుపాళ్యం మండలాలతో పలమనేరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. 2022 ఏప్రిల్‌4న పలమనేరుతొలి ఆర్డీవోగా పద్మావతి బాధ్యతలు స్వీకరించారు. 18రోజులకే ఆమె బదిలీ అయ్యారు. దీంతో ఎఫ్‌ఏసీగా భవాని బాధ్యతలు స్వీకరించారు. ఆరురోజుల తరువాత ఆమె బదిలీ కావడంతో మళ్లీ పద్మావతి ఆర్డీవోగా వచ్చారు. ఆ ఏడాది జూన్‌20న ఆమె బదిలీ అయ్యాక ఎస్‌. శివయ్య ఎ్‌ఫఏసీగా బాధ్యతలు స్వీకరించారు. నవంబరు 2న శివయ్య కూడా బదిలీ కావడంతో జి.రామకృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నెలరోజులు తిరగకముందే ఆయన కూడా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మళ్లీ ఎస్‌. శివయ్య వచ్చారు. గతేడాది అక్టోబరు20న శివయ్య బదిలీ కావడంతో ఎన్‌.మనోజ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడాది తరువాత సెప్టెంబరు 29న మనోజ్‌రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శ్రీనివాసులురాజు వచ్చారు. నెల తిరగకముందే ఆయన బదిలీ కావడంతో గతంలో ఎఫ్‌ఏసీగా పనిచేసిన భవానీ మరోసారి ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా రెవెన్యూ డివిజన్‌ ఏర్పడిన రెండున్నరేళ్లలో ఎనిమిదిమంది బదిలీ అయ్యారు. వీరిలో నలుగురు నెలరోజులకే బదిలీ కాగా ఇద్దరు 11నెలలు పనిచేశారు. మరో ఇద్దరిలో ఒకరు ఆరునెలలు, మరొకరు రెండు నెలలు పనిచేశారు. పదేపదే ఆర్డీవోలు బదిలీ అవుతుండడంతో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇబ్బందులెదురవుతున్నాయి.

Updated Date - Dec 18 , 2024 | 01:16 AM