చెంగాళమ్మ దేవస్థానం ఈవో సస్పెన్షన్
ABN , Publish Date - Jul 31 , 2024 | 02:26 AM
అవినీతి ఆరోపణల నేపథ్యంలో సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు సస్పెండయ్యారు.
తడ, జూలై 30 : అవినీతి ఆరోపణల నేపథ్యంలో సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు సస్పెండయ్యారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడలోని కామాక్షమ్మ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధుల గోల్మాల్ జరిగింది. కుంభాభిషేకం, కోటి కుంకుమార్చన పేరుతో పాలకులు రూ.కోట్లు భోంచేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాతల విరాళాల లెక్కలు కూడా గల్లంతయ్యాయనే ఫిర్యాదులందడంతో ఇటీవల దేవదాయ శాఖ ఉన్నతాధికారులు మూడు రోజులపాటు విచారించారు. సుమారు 3 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం.ఈ అవినీతిలో ముఖ్య పాత్రధారులు వైసీపీ ప్రాపకంతో పాలకమండలి పదవులు వెలగబెట్టిన వారే కాగా, అప్పట్లో పనిచేసిన ఈవోలు కూడా తాము ఆలయ పరిరక్షకులమని మరిచిపోయి అధికార పార్టీ నాయకులకు సాగిలపడ్డారు. ఆ గోల్‌మాల్‌కు జొన్నవాడ ఆలయ పూర్వ ఈవో, ప్రస్తుత చెంగాళమ్మ ఆలయ ఈవోగా పనిచేస్తున్న డబ్బుగుంట వెంకటేశ్వర్లుతోపాటు మరో నలుగురు కార్యనిర్వాహణాధికారులు వి. గిరికృష్ణ, మల్లికార్జున రెడ్డి, జానకమ్మ, కెవిటి ప్రసాద్‌లపై క్రమశిక్షణ చర్యలకు విచారణ అధికారులు సిఫారసు చేసినట్లు సమాచారం. ఆ మేరకు మంగళవారం సదరు అధికారులపై దేవదాయ శాఖ కమిషనర్ సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.