Share News

చిత్తూరు యాసను వైరల్‌ చేశాడు!

ABN , Publish Date - Nov 03 , 2024 | 02:42 AM

కరోనా విజృంభించిన సమయంలో ‘ట్రంప్‌- కిమ్‌’ చిత్తూరు యాసలో మాట్లాడుకునే వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయ్యాయి. ఈ వీడియోలను చూసిన చాలామంది లాక్‌డౌన్‌లో రిలాక్సయ్యారు.

చిత్తూరు యాసను   వైరల్‌ చేశాడు!

విదేశీ కామెడీ వీడియోలకు చిత్తూరు యాసతో డబ్బింగ్‌

సోషల్‌ మీడియాతో పాటు సినిమాల్లోనూ రాణిస్తున్న తేజ

చిత్తూరు, ఆంధ్రజ్యోతి

కరోనా విజృంభించిన సమయంలో ‘ట్రంప్‌- కిమ్‌’ చిత్తూరు యాసలో మాట్లాడుకునే వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయ్యాయి. ఈ వీడియోలను చూసిన చాలామంది లాక్‌డౌన్‌లో రిలాక్సయ్యారు. వాటి వెనుక ఉన్నది మన చిత్తూరు కుర్రాడే. సామాజిక మాధ్యమాల్లో సుమారు 13లక్షలమందికి పైగా ఫాలోవర్స్‌తో దూసుకుపోతున్న తేజ గురించి ప్రత్యేక కథనమిది.

ఐరాల మండలం పుత్రమద్ది గ్రామానికి చెందిన రైతు దంపతులు సుగుణ, రవి కుమారుడైన తేజ చిత్తూరులోని సీతమ్స్‌ కళాశాలలో నాలుగేళ్ల క్రితం ఎంబీఏ చేస్తున్నప్పుడు సరదాగా ‘చిత్తూరు కుర్రాడు’ పేరుతో య్యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించారు.విదేశీ కామెడీ వీడియోలకు చిత్తూరు యాసలో డబ్బింగ్‌ చెప్పి విడుదల చేసేవారు. అవన్నీ బాగా వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా కరోనా సమయంలో ‘ట్రంప్‌- కిమ్‌’ చిత్తూరు యాసలో మాట్లాడుకునే వీడియోలు చూసి జనం బాగా నవ్వుకున్నారు. తర్వాత ఆ ఛానెల్‌లో ‘ధోని- కోహ్లీ’, తాత- మనవడు సిరీ్‌సలు బాగా పాపులర్‌ అయ్యాయి. ఇప్పుడు నడుస్తోన్న ఓబులు సిరీ్‌స వీడియోలు కూడా బాగా నవ్విస్తున్నాయి.వీటిలో వుండే విదేశీ వ్యక్తులు ఐదుగురికి చిత్తూరు యాసలో తేజ డబ్బింగ్‌ చెబుతున్నారు.స్వగ్రామంలో జరిగే సంక్రాంతి వేడుకల్లో స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇస్తూ.. కవర్‌ సాంగ్స్‌, షార్ట్‌ ఫిలిమ్స్‌ వంటివి కూడా చేసి తేజ పాపులర్‌ అయ్యారు. చిత్తూరు యాసలో తేజ వీడియోలు చూసి సినిమా వాళ్లు అవకాశాలు ఇవ్వడం మొదలెట్టారు.చిత్తూరుకే చెందిన కో డైరెక్టర్‌ శ్రావణ్‌.. తాను పని చేస్తున్న ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’ సినిమాలో అవకాశం ఇప్పించారు. రాయచోటికి చెందిన కిరణ్‌ అబ్బవరం హీరోగా చేసిన ఆ సినిమా కరోనా సమయంలో విడుదలై మంచి విజయం సాధించింది. హీరో సీనియర్స్‌, విలన్‌ గ్యాంగ్‌లో కన్పించిన తేజకు తరువాత మంచు విష్ణు తన జిన్నా సినిమాకు రైటర్‌గా అవకాశం ఇచ్చారు.దూరదర్శిని సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేయగా ప్రస్తుతం మరో ఐదు సినిమాల్లో నటిస్తున్నారు.

హీరో కిరణ్‌ అబ్బవరంతో అనుబంధం

ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం అనేది హీరో కిరణ్‌కు రెండో సినిమా. చిత్తూరు తేజకు మొదటిది. తేజ తీరు నచ్చడంతో కిరణ్‌ తన ప్రతి సినిమాలో అవకాశాలిస్తున్నారు. వినరో భాగ్యము విష్ణుకథ, నేను మీకు బాగా కావాల్సినవాడిని, రూల్స్‌ రంజన్‌ సినిమాలతో పాటు ఈ దీపావళికి విడుదలై ఘన విజయం సాధించిన ‘క’ సినిమాలో కూడా తేజ నటించారు.కిరణ్‌ సినిమాలు విడుదలైతే తేజ దగ్గరుండి మరీ పబ్లిసిటీ బాధ్యత చూసుకుంటుంటారు. తాజా సినిమా క కోసం తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, నగరి, బంగారుపాళ్యం, పలమనేరు, మదనపల్లె, కదిరి, హిందూపురం ప్రాంతాల్లోని కాలేజీల్లో విద్యార్థులతో సమావేశమై సినిమా గురించి ప్రచారం చేశారు.

13లక్షలకుపైగా ఫాలోవర్స్‌

ఇప్పుడు సామాజిక మాధ్యమాలే సెలబ్రిటీ స్థాయిని తెలియజేస్తున్నాయి.ఎంతమంది ఫాలోవర్స్‌ ఉంటే అంత పెద్ద సెలబ్రిటీ అని అర్థం. చిత్తూరు తేజకు వివిధ సామాజిక మాధ్యమాల్లో 13 లక్షలమందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. య్యూట్యూబ్‌లో 7.50 లక్షలు, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 3.20 లక్షలు, ఫేస్‌బుక్‌లో 1.20 లక్షలు, మోజ్‌లో 1.30 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉండడమంటే సాధారణ విషయం కాదు.

‘పుష్ప’ కేశవకు యాస సాయం

అల్లుఅర్జున్‌ నటించిన పుష్ప సినిమాకు కూడా చిత్తూరు యాసకు సంబంధించిన కొన్ని పదాలను అందించారు. హీరో అల్లుఅర్జున్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ కేశవ సొంతూరు ఐరాల వచ్చి నాలుగు రోజులు ఉండి తేజ వద్ద శిక్షణ తీసుకున్నారు. పుష్ప విడుదలకు ముందే తేజ వల్ల చిత్తూరు యాస పాపులర్‌ అయిందని చెప్పవచ్చు.

చిత్తూరు యాస వ్యాప్తే ప్రధాన లక్ష్యం

ఎంబీఏ వరకు చదువుకున్న తాను సరదాగా ప్రారంభించిన య్యూట్యూబ్‌ ఛానెల్‌ చిత్తూరు యాసతో ఎక్కడికో వెళ్లిపోయిందని తేజ అంటున్నారు. తనకు ఈ యాస వల్లే మంచి గుర్తింపు లభించిందని.. సినిమాల్లో ఈ యాస కోసమే పాత్రలు రాస్తున్నారని ఆయన చెబుతున్నారు. సినిమా రంగంలోనే ఉంటూ చిత్తూరు యాస వ్యాప్తి కోసం కృషి చేస్తానంటున్నారు.

Updated Date - Nov 03 , 2024 | 02:42 AM