Share News

CID inspections- ఎస్వీఆర్‌ డిస్టిలరీ్‌సలో ముగిసిన సీఐడీ తనిఖీలు

ABN , Publish Date - Oct 24 , 2024 | 01:49 AM

రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని ఎస్వీఆర్‌ డిస్టిలరీ్‌సలో సీఐడీ అధికారుల బృందం మంగళవారం చేపట్టిన తనిఖీలు బుధవారం ముగిశాయి.

CID inspections- ఎస్వీఆర్‌ డిస్టిలరీ్‌సలో ముగిసిన సీఐడీ తనిఖీలు

ఫ పలు రికార్డులు, హార్డు డిస్కులు స్వాధీనం

ఫ ఉత్పత్తికి.. సరఫరాకు మధ్య తేడాలున్నట్లు సమాచారం

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని ఎస్వీఆర్‌ డిస్టిలరీ్‌సలో సీఐడీ అధికారుల బృందం మంగళవారం చేపట్టిన తనిఖీలు బుధవారం ముగిశాయి. విజయవాడ నుంచి వచ్చిన సీఐడీ అధికారులు బృందాలుగా ఏర్పడి కొన్ని అంశాలు చొప్పున పరిశీలించారు. 2019లో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటైనప్పటి నుంచీ ఈ ఏడాది ఎన్నికల నాటి వరకూ డిస్టిలరీ్‌సలో జరిగిన మద్యం తయారీ, ఉత్పత్తి, సరఫరా తదితర అంశాలపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. అదే సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రాజకీయ ప్రముఖుడి సంస్థ ఈ డిస్టిలరీ్‌సను లీజుకు తీసుకున్నప్పటి నుంచీ జరిగిన కార్యకలాపాలపైనా సమాచారం తీసుకున్నారు. మద్యం సీసాలపై అతికించే సీళ్లు పక్కదారి పట్టినట్టు, అలాగే తయారైన మద్యం పరిమాణానికి, బయటకు సరఫరా చేసిన మద్యం పరిమాణానికి నడుమ వ్యత్యాసం గుర్తించినట్టు తెలిసింది. అలాగే ఎక్సైజ్‌ డ్యూటీ చెల్లింపుల్లో కూడా కొంతమేరకు తేడాలను గుర్తించినట్టు సమాచారం. ఈ అంశాలకు సంబంధించి సీఐడీ అధికారులు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కాగా డిస్టిలరీ్‌సలో గత ఐదేళ్ళలో మద్యం తయారీకి సంబంధించి డిస్టిలరీస్‌ ప్రతినిధుల నుంచీ చివరికి హమాలీల నుంచీ కూడా స్టేట్‌మెంట్లు తీసుకున్నట్టు సమాచారం. 2019-2024 నడుమ జరిగిన మద్యం తయారీ, ఉత్పత్తి, సరఫరాలకు సంబంధించిన పూర్తి రికార్డులను సీఐడీ అధికారులు సీజ్‌ చేశారు. కంప్యూటర్లకు సంబంధించిన హార్డు డిస్కులను కూడా స్వాధీనం చేసుకుని రికార్డులతో పాటు విజయవాడకు తీసుకెళ్ళారు. అక్కడ పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదించనున్నారు.

Updated Date - Oct 24 , 2024 | 06:40 AM