Share News

Flexi- చిచ్చు రేపిన సినీ- పొలిటికల్‌ ఫ్లెక్సీ

ABN , Publish Date - Dec 05 , 2024 | 02:00 AM

పాకాలలో సినీ-పొలిటికల్‌ ఫ్లెక్సీ వైసీపీ, టీడీపీ వర్గీయుల నడుమ చిచ్చు రేపింది. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని సినిమా థియేటర్‌లో బుధవారం పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్‌ అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టారు. వైసీపీ నేత మునీర్‌ కుమారుడు అఫ్రీద్‌ కూడా అల్లు అర్జున్‌తో పాటు మాజీ సీఎం జగన్‌, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీ పెట్టారు.

Flexi- చిచ్చు రేపిన సినీ- పొలిటికల్‌ ఫ్లెక్సీ
వివాదానికి కారణమైన ఫ్లెక్సీ

పుష్ప-2 ఫ్లెక్సీలో వైసీపీ నేతల ఫొటోలు, రాజకీయ కామెంట్లు

చింపేసిన టీడీపీ వర్గీయులపై రాళ్ల దాడి

గంటన్నర పాటు ఉద్రిక్తత

పాకాల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పాకాలలో సినీ-పొలిటికల్‌ ఫ్లెక్సీ వైసీపీ, టీడీపీ వర్గీయుల నడుమ చిచ్చు రేపింది. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని సినిమా థియేటర్‌లో బుధవారం పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్‌ అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టారు. వైసీపీ నేత మునీర్‌ కుమారుడు అఫ్రీద్‌ కూడా అల్లు అర్జున్‌తో పాటు మాజీ సీఎం జగన్‌, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీ పెట్టారు. ‘మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా... 2029 సీఎం తాలూకా... తగ్గేదే లే...’ అంటూ కామెంట్స్‌ కూడా జోడించారు. సినీ ఫ్లెక్సీల్లో నేతల ఫొటోలు, వ్యాఖ్యలపై టీడీపీ మద్దతుదారులు అభ్యంతరం తెలిపారు. తొలగించాలని పట్టుబట్టడంతో ఇరువర్గాల నడుమ వివాదం తలెత్తింది. ఫ్లెక్సీ తొలగింపునకు అంగీకరించకపోవడంతో టీడీపీ వర్గీయులు చించేశారు. దీంతో వైసీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. అదే సమయంలో వైసీపీకి చెందిన వారు కర్రలతో భారీగా చేరుకున్నారు. టీడీపీ వర్గీయులూ రావడంతో ఇరువర్గాలూ వాగ్వాదానికి, తోపులాటకూ దిగాయి. ఈ క్రమంలో ఓ టీ స్టాల్‌ పాక్షికంగా ధ్వంసమైంది. ఈ గొడవతో తిరుపతి- దామలచెరువు మెయిన్‌ రోడ్డులో గంటన్నర పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. డీఎస్పీ ప్రసాద్‌, సీఐ సుబ్బరామిరెడ్డి పోలీసు బలగాలతో చేరుకుని ఇరువర్గాలనూ చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాజకీయ నేతల ఫొటోలు, కామెంట్లతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వైసీపీ వారే రెచ్చగొట్టారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ప్రాంతంలోనూ ఆ పార్టీ మద్దతుదారులు కొందరు రౌడీయిజం చెలాయిస్తుంటారని, దుకాణాల్లో తిష్టవేసి మహిళల పట్ల వెకిలి చేష్టలకు పాల్పడుతుంటారన్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని చక్కదిద్దాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘర్షణకు సంబంధించి వైసీపీ వర్గీయుల తమపై రాళ్లు, కర్రలు, వేడినీటితో దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. శాంతి భద్రతల సమస్య కారణంగా ఘటనా స్థలి సమీపంలో.. రోడ్డు పక్కన ఉన్న వైసీపీ మద్దతుదారుడి టీ దుకాణాన్ని రాత్రి డీఎస్పీ ప్రసాద్‌, తహసీల్దారు నిత్యానందబాబు, ఎంపీడీవో శశిరేఖ, పంచాయతీ సిబ్బందితో తొలగించారు.

Updated Date - Dec 05 , 2024 | 02:00 AM