Share News

నేరాల నియంత్రణకు ‘కమాండ్‌’

ABN , Publish Date - Oct 28 , 2024 | 01:19 AM

కంట్రోల్‌ రూమ్‌ పరిధిలోకి కుప్పం డివిజన్‌

నేరాల నియంత్రణకు ‘కమాండ్‌’
కుప్పంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌

కుప్పం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలీసులు ఎంత నిఘా ఉంచినా కుప్పం డివిజన్‌లో గ్రానైట్‌, బియ్యం, ఇసుక అక్రమ రవాణా సాగుతూనే ఉంది. దీనికితోడు గంజాయి రవాణా, వినియోగం కూడా ఎక్కువగానే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో వీటిని అదుపు చేయడాన్ని పోలీసు అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎస్పీ మణికంఠ ఆదేశాలు, సూచనలతో కుప్పం అర్బన్‌ సీఐ జీటీ నాయుడు కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను మరింత పటిష్ఠంగా వినియోగంలోకి తేవడానికి అవసరమైన ప్రణాళికలు రచిస్తున్నారు.

కుప్పం నియోజకవర్గం మొత్తం ఒకే పోలీసు సర్కిల్‌ పరిధిలో ఉన్న సమయంలో సీఐ రాజశేఖర్‌ హయాంలో 2017లో ఏర్పాటు చేసిన ఈ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కుప్పం పట్టణంతోపాటు పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. వాటిని ఈ రూమ్‌కు అనుసంధానం చేశారు. అప్పట్లో దొంగతనాలు, ట్రాఫిక్‌ వంటి సమస్యలు అదుపు చేయడం సాధ్యమైంది. ఆయన బదిలీపై వెళ్లాక ఈ వ్యవస్థ క్రమేణా బలహీనపడి.. వినియోగంలో లేకుండా పోయింది. కుప్పం అర్బన్‌ సీఐగా జీటీ నాయుడు బాధ్యతలు స్వీకరించాక కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ మళ్లీ కొంత వినియోగంలోకి వచ్చింది. గతంలో అమర్చిన సీసీ కెమెరాలు పాడైపోవడంతో, ఇటీవల పట్టణంలోని ప్రధాన కూడళ్లతోపాటు రద్దీ ఎక్కువగా ఉన్న ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్‌, పూల మార్కెట్టు వంటి ప్రదేశాలలో మళ్లీ సీసీ కెమెరాలు అమర్చారు. వీటిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, శాంతిపురం పోలీసు స్టేషన్లను ఎస్పీ మణికంఠ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కుప్పం రూరల్‌ సీఐ కార్యాలయం ఆవరణలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించారు. ఈ వ్యవస్థను పటిష్ఠంగా వినియోగంలోకి తేవాలని డివిజన్‌లోని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. తగిన సూచనలూ ఇచ్చారు.

మల్లానూరులో చిన్న కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌!

నియోజకవర్గంలో ప్రస్తుతం కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాలు ఉన్నాయి. ఇవికాక మల్లానూరు, రాళ్లబూదుగూరులను మండలాలు చేయడానికి ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కుప్పంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను కేంద్రంగా చేసుకుని.. మల్లానూరులో మరో చిన్న కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయడమనే ఆలోచన ఇప్పుడు సాగుతోంది. అలాగే కేవలం కుప్పం పట్టణంలోని సీసీ కెమెరాల కన్నునే కాకుండా డివిజన్‌లోని నాలుగు మండలాలలో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని కూడా కుప్పంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించాలన్న ఆలోచనా చేస్తున్నారు. దీనిపై సీఐ జీటీ నాయుడు మాట్లాడుతూ.. మల్లానూరులో సైతం ఒక చిన్నపాటి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఎస్పీ సూచనలతో పరిశీలిస్తున్నామని చెప్పారు.

Updated Date - Oct 28 , 2024 | 01:19 AM