Share News

సామాన్య భక్తులకే పెద్దపీట

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:56 PM

ఈనెల 4 నుంచి 12వ తేది వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం.

సామాన్య భక్తులకే పెద్దపీట

‘ప్రస్తుతమున్న ఉన్నతాధికారులందరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కొత్తే. అయినప్పటికీ గతంలో పనిచేసిన అధికారులు, మీడియా, భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాం. అన్నిటినీ పరిశీలించి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాం. స్వామి దర్శనం, వసతిలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తాం’ అని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. ఈనెల 4న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

తిరుమలలో ఈనెల 4 నుంచి 12వ తేది వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. మూలవిరాట్టు దర్శనంతో పాటు వాహనసేవ దర్శనం సంతృప్తికరంగా జరిగేలా చర్యలు తీసుకున్నాం. ఆలయంలోని క్యూలైన్లతో పాటు గ్యాలరీల్లోని భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టడానికి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. గతంలో గరుడవాహనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి? మరుగుదొడ్లు, తాగునీరు అందించడంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? గ్యాలరీల్లోకి రావడానికి, కూర్చోవడానికి భక్తులు పడిన ఇబ్బందులను తెలుసుకున్నాం. వాటిని అధిగమించేలా చర్యలు చేపట్టాం.

పెరటాసి రద్దీని తట్టుకునేలా..

తమిళ భక్తులకు ముఖ్యమైన పెరటాసితో పాటు బ్రహ్మోత్సవాలు కూడా రావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేశాం. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఆర్జితసేవలు, వీఐపీ బ్రేక్‌ దర్శనం, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాం. గరుడసేవకు ప్రొటోకాల్‌ దర్శనాన్నీ నిలిపేశాం. బ్రహ్మోత్సవాల రోజులకు సంబంధించి ఇప్పటికే 1.32 లక్షల దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో ఇచ్చాం. సర్వదర్శన టోకెన్లు రోజుకు 24వేల చొప్పున జారీ చేస్తాం. మామూలుగా 80 వేల మందికి దర్శనం చేయిస్తాం. కానీ బ్రహ్మోత్సవాల్లో రోజుకు 90 వేల నుంచి 95 వేల మంది దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశాం. మాడవీధుల్లోని గ్యాలరీల్లో 2 లక్షల మంది మాత్రమే కూర్చోగలరు. అదనంగా మాడవీధుల్లోని కార్నర్‌ క్యూలైన్ల ద్వారా దాదాపు 20 వేల మందికి వాహనసేవల దర్శనం చేయిస్తాం.

భక్తులకు భద్రత

తొలిరోజున సీఎం పర్యటనకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3.5 లక్షల మంది భక్తులు గరుడసేవకు వస్తారని అంచనా. దానికి అనుగుణంగా అధికారులను, సిబ్బందిని సిద్దం చేశాం. ఎక్కడా ఎక్కడ తోపులాటలు తొక్కిసలాటలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. 1,225 మంది విజిలెన్స్‌, 3,800 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. 2,770 సీసీ కెమెరాల ద్వారా నిఘా పెడుతున్నాం.

60 వేల మందికి వసతి

తిరుమలోని 7వేల గదుల ద్వారా 40 వేల మందికి వసతి లభిస్తుంది. యాత్రికుల వసతి సముదాయాల్లోని 68 హాళ్లద్వారా 7 వేల లాకర్లు ఉన్నాయి. వీటి ద్వారా 20 వేల మందికి వసతి కల్పించవచ్చు. ఇక, 411 బస్సుల ద్వారా 3వేల ట్రిప్పులతో ఆర్టీసీ సేవలందిస్తుంది. 4 వేల వాహనాలకు పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశాం. నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తాం.భక్తులకు ఇబ్బంది లేకుండా 7 లక్షల లడ్డూల బఫర్‌ స్టాక్‌ ఉంచుకున్నాం. లడ్డూ కౌంటర్లు 54 నుంచి 65కు కౌంటర్లను పెంచాం.

నడకదారి భక్తులకు...

అలిపిరి మార్గంలోని వచ్చిన వారికి గతంలో దివ్యదర్శనం టోకెన్లు ఇచ్చేవారు. దాన్ని గతంలోనే రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల తర్వాత ఆ విషయం ఆలోచిస్తాం. ప్రస్తుతం శ్రీవారిమెట్టు మార్గంలో వచ్చేవారికి దివ్యదర్శనం టోకెన్లు ఇస్తున్నాం. నడిచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించుకున్నాం.

Updated Date - Oct 01 , 2024 | 11:56 PM