Share News

Srivari Laddu శ్రీవారి లడ్డూ కల్తీపై నేతల ఆందోళనలు

ABN , Publish Date - Sep 22 , 2024 | 01:55 AM

శ్రీవారి భక్తులు పవిత్ర ప్రసాదంగా భావించే లడ్డూను అపవిత్రం చేశారంటూ తిరుపతిలో శనివారం ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు ఆందోళనలు చేపట్టారు.హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు.

 Srivari Laddu  శ్రీవారి లడ్డూ కల్తీపై నేతల ఆందోళనలు

శ్రీవారి లడ్డూ కల్తీపై నేతల ఆందోళనలు

జగన్‌,వైవీ,భూమన దిష్టిబొమ్మల దహనం

శ్రీవారి భక్తులు పవిత్ర ప్రసాదంగా భావించే లడ్డూను అపవిత్రం చేశారంటూ తిరుపతిలో శనివారం ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు ఆందోళనలు చేపట్టారు.హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు.మాజీ ముఖ్యమంత్రి జగన్‌ , టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బా రెడ్డి, భూమన కరుణాకర రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.వారిని అరెస్టు చేయాలని బీజేపీ నేతలు, జనసేన నేతలు ఎస్పీ సుబ్బరాయుడికి వినతిపత్రాలు అందజేశారు.

-ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌

అఖండ దీపానికీ అదే నెయ్యి వాడారా?

‘కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదాల్లో వినియోగించడమే కాకుండా శ్రీవారి మూలవిరాట్‌ ముందు అఖండ దీపానికి వినియోగించి ఉంటే దానిపైనా విచారణ జరగాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి’ అని కూటమి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు , పులివర్తి నాని, మురళీ మోహన్‌ , గురజాల జగన్మోహన్‌ డిమాండు చేశారు.. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.శనివారం తిరుపతిలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. లడ్డూ నాణ్యత తగ్గిందని పవన్‌ కల్యాణ్‌ గతంలోనే చెప్పారని జంగాలపల్లి శ్రీనివాసులు అన్నారు. అన్యమతస్తులు కొండపై చేరి సర్వనాశనం చేశారని, అయితే దేవుడి శిక్షనుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. స్వయం ప్రకటిత మేధావి కరుణాకర రెడ్డి ఏమీ ఎరగనట్టు ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.తిరుమలను కూడా వైసీపీ వారు సొంత అవసరాలకు వాడుకున్నారని పులివర్తి నాని ఆరోపించారు. ఈ వ్యవహారంలో జగన్‌కు అత్యంత సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రమేయమూ ఉందని ఆరోపించారు. ఆల్ఫా కంపెనీకి 2లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా కాంట్రాక్టు ఇచ్చారంటే కమీషన్లకు కక్కుర్తిపడే ఆ పనిచేశారని ఎవరికైనా అర్థమైపోతుందన్నారు. ఆధ్యాత్మికతను వంటినిండా పులుముకుని కనిపించే చెవిరెడ్డి ఇప్పుడు ఎక్కడికి పోయారో తెలియడంలేదన్నారు.తిరుమలలో అపచారం జరిగిందని నిరూపిస్తే డైవర్షన్‌ రాజకీయాలంటారా? వైసీపీవే వక్రబుద్ధి రాజకీయాలని మురళీ మోహన్‌ విమర్శించారు. ఆలయాన్ని వైసీపీ కార్యాలయం లాగా మార్చుకున్నారని పేర్కొన్నారు. లడ్డూ కల్తీపై చర్చకు, ప్రమాణానికి సిద్ధమా అని నారా లోకేశ్‌ సవాల్‌ విసిరితే తప్పు చేయకపోతే కోర్టును ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో టీటీడీని కూడా వైసీపీ నేతలు భ్రష్టుపట్టించారని గురజాల జగన్మోహన్‌ అన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి ప్రసాదాన్ని కలుషితం చేశారని దుయ్యబట్టారు. తప్పుచేసిన వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదన్నారు.

సీబీఐ విచారణ చేయాలి - సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్యే

పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేసిన అంశంపై సీబీఐతో విచారణ జరిపించి, దోషులను శిక్షించాలి. రీటెండరింగ్‌ విధానంతో రూ.320కే కిలో నెయ్యి కొన్నామని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్‌రెడ్డి, ధర్మారెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలి. గత ఐదేళ్లలో నిత్యం కొండపై శిలువ గుర్తులు, కాఫీ కప్పులు, గంజాయి అమ్మకాలు సాగాయి. జే బ్రాండ్‌ మద్యం తరహాలో జగన్‌ బ్రాండ్‌ నెయ్యి తెచ్చారు.

దోషులు తప్పించుకోలేరు - నరసింహయాదవ్‌, టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు

కలియుగ దైవం వెంకన్న దృష్టి నుంచి దోషులెవరూ తప్పించుకోలేరు. తిరుమలలో ఏమీ జరగలేదని, చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని జగన్‌రెడ్డి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. శ్రీవాణి ట్రస్టు నిధులు మాయం, అగ్నిప్రమాదంలో కొన్ని ఫైళ్లు దగ్ధం కావడం నిజం కాదా? కల్తీ నెయ్యి విషయమై శ్రీవారి భక్తుల్లో అలజడి రేపిన ఘనత జగన్‌రెడ్డికి దక్కింది.

క ల్తీ నెయ్యిపై దర్యాప్తు చేపట్టాలి -తిరుమలలో ఎమ్మెల్సీలు రాంగోపాల్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్‌, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర

శ్రీవారి లడ్డూల్లో వినియోగించిన కల్తీ నెయ్యి అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. నెయ్యిలో కల్తీ జరగడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. గత ప్రభుత్వంలో శ్రీవారి పరకామణిలో జరిగిన దోపిడీ గురించి కూడా విచారణ చేయమని గతంలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఈ కుట్రలో అప్పటి ఈవో ధర్మారెడ్డి, చైర్మన్‌ కరుణాకర రెడ్డి, విజిలెన్స్‌, పోలీసు అధికారులు ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశంలోనూ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం.

భక్తులకు ధర్మారెడ్డి సమాధానం చెప్పాలి - నవీన్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నేత

కమీషన్ల కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీసిన అప్పటి ఈవో ధర్మారెడ్డి సమాధానం చెప్పాలి. ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలి. సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలి. వైసీపీ పాలనలో ధర్మకర్తల మండలి డమ్మీగా మారింది.

బాధ్యులను అరెస్టు చేయాలి - జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి కిరణ్‌రాయల్‌

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలకు గండి కొట్టిన మాజీ సీఎం జగన్‌, టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిలను అరెస్టు చేయాలని జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి కిరణ్‌రాయల్‌ డిమాండ్‌ చేశారు. జనసేన నాయకులతో కలిసి ఆయన శనివారం లడ్డూ, వడ చేతిలో పెట్టుకుని నిరసన తెలిపారు. తిరుమల పవిత్రతను, ప్రసాదాన్ని అపవిత్రం చేసి నీతులు వల్లించడం జగన్‌ రెడ్డికే చెల్లుతుందన్నారు. తిరుమల ఆలయాన్ని, పోటును సంప్రోక్షణ చేయాలని కోరారు. ఈ మేరకు ఎస్పీ సుబ్బరాయుడుకు వినతిపత్రం అందజేశారు.

కల్తీ నెయ్యితో రూ.కోట్లు దోచుకున్నారు - బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌ రెడ్డి

కల్తీ నెయ్యితో స్వామి వారికి నైవేద్యాలు చేయించి, రూ.కోట్లు దోచుకున్న మాజీ సీఎం జగన్‌, మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిలు కాలగర్బంలో కలసిపోతారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌ రెడ్డి దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో బాధ్యులను అరెస్టు చేయాలని బీజేపీ నేతలు సామంచి శ్రీనివాస్‌, అజయ్‌కుమార్‌, మునిసుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ఎస్పీ సుబ్బరాయుడికి ఫిర్యాదు చేశారు. హిందువుల ఆరాధ్య దైవం తిరుమలను ఐదేళ్లలో అపవిత్రం చేసి ఇష్టానుసారంగా దోచుకున్నారని, ల్యాబ్‌ నివేదిక బయటపెట్టడంతో అవినీతికి పాల్పడిన అధికారులు, చైర్మన్లు తడుముకుంటున్నారన్నారు. క్రిస్టియన్‌ మిషనరీలతో చేతులు కలిపి తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా జగన్‌ ప్రవర్తించారని ఆరోపించారు.

Updated Date - Sep 22 , 2024 | 01:55 AM