Share News

ఎట్టకేలకు పట్టుబడిన సీఎ్‌సడీటీ విష్ణు

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:01 AM

రేషన్‌ బియ్యం అక్రమాల్లో కడప, నగరి, ఏర్పేడు బియ్యం వ్యాపారుల భాగస్వామ్యం

ఎట్టకేలకు పట్టుబడిన సీఎ్‌సడీటీ విష్ణు

పుత్తూరు అర్బన్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఇటీవల పుత్తూరు పౌరసరఫరాల శాఖ గోదాములో రేషన్‌ బియ్యం అక్రమంగా తరలించిన సీఎ్‌సడీటీ సీహెచ్‌ విష్ణు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. సోమవారం పట్టుబడిన ఇతడిని మంగళవారం రిమాండ్‌ నిమిత్తం పుత్తూరులోని ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మెజిస్ర్టేట్‌ కోర్టులో హాజరు పరిచారు. పుత్తూరు ఎస్డీపీవో రవికుమార్‌ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించనున్నట్లు సీఐ కె.వి.సురేంద్రనాయుడు తెలిపారు. పుత్తూరు, పిచ్చాటూరు పౌరసరఫరాల శాఖ మండల లెవల్‌ స్టాక్‌ (ఎంఎల్‌ఎస్‌) పాయింట్లలో సీఎ్‌సడీటీగా సీహెచ్‌ విష్ణు 2022 డిసెంబరు నుంచి 2024 ఆగస్టు వరకు విధులు నిర్వహించాడన్నారు. గోడౌన్ల నుంచి సుమారు 4,056 రేషన్‌ బియ్యం బస్తాలను అక్రమంగా విక్రయించినట్లు గుర్తించామన్నారు. ఉద్యోగ బాధ్యతలను విస్మరించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడనే నేరారోపణలపై అరెస్టు చేశామన్నారు. ఆహార భద్రతా చట్టం -1955 అండర్‌ సెక్షన్‌ 314, 316, 316(5), 318(4), 7(1) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

అక్రమాల్లో బియ్యం వ్యాపారుల భాగస్వామ్యం

రేషన్‌ బియ్యం అక్రమాల్లో కడప, నగరి, ఏర్పేడుకు చెందిన కొందరు బియ్యం వ్యాపారులతో పాటు పౌరసరఫరాల శాఖకు చెందిన మరో అధికారి భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. పుత్తూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి 2,840 బియ్యం బస్తాలు విక్రయించి రూ.14.90 లక్షలు, పిచ్చాటూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి 2,200 బస్తాలు విక్రయించి రూ.14.80 లక్షలు అక్రమంగా ఆర్జించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

అప్పులకు.. విలాసాలకు..

ఈ అక్రమ సంపాదనను సీఎ్‌సడీటీ విష్ణు తాను చేసిన అప్పులకు గాను నెల్లూరుకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డికి రూ.14 లక్షలు, పాపిరెడ్డికి రూ.1.50 లక్షలు, గూడూరుకు చెందిన రమణరాజుకు రూ.1.50 లక్షలు, చెన్నైకి చెందిన మరికొందరి నగదు రూపంలో చెల్లించినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నట్లు తెలిసింది. ఇక, విలాసాలకు ఖర్చు చేసిన మొత్తం ఎంతనేది లెక్క తేలలేదని పోలీసులు అంటున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని తన సొంతూరు రాజుపాళెంలో ఒక ఇల్లు, రెండు రేకుల షెడ్లు, బైక్‌ ఉందని, తన తల్లి పేరున ఎకరా మామిడి తోట ఉన్నట్టు విచారణలో విష్ణు చెప్పినట్లు సమాచారం.

Updated Date - Nov 06 , 2024 | 01:02 AM