డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
ABN , Publish Date - Nov 15 , 2024 | 02:20 AM
తిరుపతిలోని శ్రీపద్మావతీ మహిళా డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి కృష్ణమూర్తి ఫిర్యాదు మేరకు ఎస్వీయూ సీఐ రామయ్య కేసు నమోదు చేశారు.
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 14(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని శ్రీపద్మావతీ మహిళా డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి కృష్ణమూర్తి ఫిర్యాదు మేరకు ఎస్వీయూ సీఐ రామయ్య కేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండకు చెందిన కృష్ణమూర్తి కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని రెండవ కుమార్తె పి.అనిత తిరుపతిలోని శ్రీపద్మావతీ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్పీ బయోకెమిస్ర్టీలో చేర్పించాడు. ప్రస్తుతం ఈమె రెండవ సంవత్సరం చదువుతోంది. గురువారం అనిత క్లాసులకు హాజరుకాలేదు. మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు అనుమానం వచ్చి వార్డెన్‌కు విషయం తెలియజేశారు. ఎస్వీయూ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రామయ్య, ఏఎస్ఐ దాము, కానిస్టేబుల్ అక్కడకు వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉండడంతో వెంటనే మృతురాలు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు హాస్టల్ వద్దకు చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. జరిగిన ఘటనపై విద్యార్థులు హాస్టల్ వద్ద కాసేపు ఆందోళన నిర్వహించారు. మృతికి గల కారణాలపై ఆరా తీయాలని డిమాండ్ చేశారు. కాగా స్వగ్రామంలో అనిత స్నేహితుడొకరు రెండు రోజుల క్రితం మృతి చెందడంతో అప్పటి నుంచి ముభావంగా ఉన్నట్లు సమాచారం. ఆ బాధలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.