నిధులున్నా నిర్లక్ష్యమే
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:59 AM
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు గోకులం షెడ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించింది. జిల్లాలో ఒక్కటంటే ఒక్కటీ నిర్మించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడిరైతుల సంక్షేమాభివృద్ధి కోసం చర్యలు చేపట్టింది.
గోకులం షెడ్ల నిర్మాణంలో అధికారుల అలసత్వం
2327 గోకులం షెడ్లు మంజూరైతే పూర్తయినవి 34
చిత్తూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు గోకులం షెడ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించింది. జిల్లాలో ఒక్కటంటే ఒక్కటీ నిర్మించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడిరైతుల సంక్షేమాభివృద్ధి కోసం చర్యలు చేపట్టింది. గ్రామాల్లో పశుపోషణ, కోళ్లు, గొర్రెలు, మేకలు పెంపకానికి మెరుగైన వసతి కల్పిస్తూ.. పెంపకందార్లను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే 90శాతం రాయితీతో గోకులం షెడ్లను మంజూరు చేసింది. పశువుల నివాసానికి కొద్దిపాటి స్థలం ఉంటే అక్కడ గోకులం షెడ్లను నిర్మించుకోవచ్చు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాకు 2327 గోకులం షెడ్లు మంజూరు చేశారు.షెడ్ల నిర్మాణానికి రూ.50.99 కోట్ల నిధుల్ని విడుదల చేశారు. షెడ్డు నిర్మించిన వెంటనే బిల్లులు విడుదలయ్యే సౌకర్యాన్ని కల్పించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అర్హుల్ని గుర్తించి లబ్ధిదారుల జాబితా తయారుచేశారు. నిర్మాణాలను పూర్తి చేయడంలో క్షేత్రస్థాయి అధికారులు అలసత్వం వహిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ సహాయకులు, ఉపాధిహామీ సిబ్బంది సమన్వయంతో నిర్మాణాల్లో వేగాన్ని పెంచాల్సి ఉంది. 2327 నిర్మాణాల్లో కేవలం 32 మాత్రమే పూర్తయ్యాయంటే పరిస్థితి అర్థమవుతోంది.
ఫ పెద్దఎత్తున రాయితీ
గోకులం షెడ్లను నిర్మించుకునే వారికి ప్రభుత్వం పెద్దఎత్తున రాయితీ ఇస్తోంది. పెంపకందార్లు నామమాత్రంగా తమ వాటా వేసుకుంటే పశువులకు ఉపయోగపడే షెడ్లను నిర్మించుకోవచ్చు. పశువుల పెంపకందార్లకు 90 శాతం.. గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకందార్లకు 70 శాతం చొప్పున రాయితీ ఇస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డున్న చిన్న, సన్నకారు రైతులు దీనికి అర్హులు.
ఫ మండలాల పురోగతి ఇదీ
28 మండలాల్లో 2327 షెడ్లను మంజూరు చేయగా.. కుప్పంలో 15, గుడుపల్లెలో 8, శాంతిపురంలో 8, సోమల, కార్వేటినగరం,విజయపురం మండలాల్లో ఒకటి చొప్పున నిర్మాణాలు పూర్తయ్యాయి. అంటే 34 షెడ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన మండలాల్లోనూ నిర్మాణాలు ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని షెడ్ల నిర్మాణాల్లో పురోగతి ఉంది. బైరెడ్డిపల్లెలో అత్యధికంగా 220 షెడ్లు మంజూరైతే, కేవలం 37 మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. ఒక్కటీ పూర్తి కాలేదు. అలాగే, పూతలపట్టు మండలంలో 64 మంజూరైతే, 9 ప్రారంభమయ్యాయి.
- జిల్లాకు మంజూరైన షెడ్లు: 2327
- విడుదలైౖన నిధులు: రూ.50.99 కోట్లు
- జియో ట్యాగింగ్ పూర్తయినవి: 1977
- పనులు ప్రారంభమైనవి: 980
- నిర్మాణం పూర్తయినవి: 34