airports-విమానాశ్రయాలకు దీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి
ABN , Publish Date - Nov 05 , 2024 | 01:30 AM
దేశంలో విమానాశ్రయాలకు దీటుగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించనున్నట్లు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ వెల్లడించారు.
- స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్
తిరుపతి(సెంట్రల్), నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): దేశంలో విమానాశ్రయాలకు దీటుగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించనున్నట్లు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ వెల్లడించారు. తిరుపతి రైల్వే స్టేషన్‌లో సోమవారం నూతన భవనాల నమూనాలను, అభివృద్ది పనులను పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన రైల్వే స్టేషన్లకు నిధులు కేటాయించిందన్నారు. మరో 50 ఏళ్ల వరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నూతన భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. అంతకుముందు తిరుచానూరు సమీపంలోని ఓ హోటల్‌లో స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. రైల్వే ప్రాజెక్టుల పనితీరుపై చర్చించినట్లు సీఎం రమేష్ తెలిపారు. రైల్వే స్టషన్లలో రైళ్ల అవసరాలకు అనుగుణంగా మల్టీలెవల్ ప్లాట్‌ఫారాలు, రైలు మార్గాల్లోని అత్యవసర ప్రదేశాల్లో అండర్ బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో అన్ని హంగులతో ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఆర్‌ఎస్ మజ్దూర్ యూనియన్ నాయకులు కె.సదాశివరెడ్డి, బాబు, మునికుమార్, మెండ్రిపాల్ హెచ్‌ఆర్‌ఏ పెంచాలని కోరుతూ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. తమ సమస్యల పరిష్కారానికి రైల్వే కూలీపోర్టర్లు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సభ్యులు లక్ష్మణ్, భోలేసింగ్, మహరాజ్‌తో పాటు పలువురు సభ్యులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు అరుణ్‌కుమార్ జైన్, సీఈ సూర్యనారాయణ, సీఏవో సత్యప్రకాష్, డీఆర్‌ఎం విజయకుమార్, స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, ఎస్‌ఎంఆర్ చిన్నస్పరెడ్డి, బీజేపీ నాయకులు కోలా ఆనంద్, సామంచి శ్రీనివాస్, గుండాల గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.