Development -ఇక కుప్పంలో అభివృద్ధి పరుగులు
ABN , Publish Date - Nov 07 , 2024 | 01:31 AM
కడా (కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. దీంతో ఇంతదాకా కాస్తంత నత్తనడకన నడిచిన కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ఇకమీదట పరుగులు తీయనుంది.
కడా ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదంతో నిధుల వరద
కుప్పం, నవంబర్ 6 (ఆంధ్రజ్యోతి): కడా (కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. దీంతో ఇంతదాకా కాస్తంత నత్తనడకన నడిచిన కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ఇకమీదట పరుగులు తీయనుంది. నిజానికి నాలుగు నెలల క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చిన సుమారు నెలరోజులకే నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీతోపాటు కుప్పం, గుడుపల్లె, రామకుప్పం, శాంతిపురం మండలాలను కలుపుతూ కడా ఏర్పాటైంది. ఈ ఏడాది జులై 12న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ కడా ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కడా ఏర్పాటుతో అంతకుముందున్న పీకేఎం ఉడా (పలమనేరు, కుప్పం, మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) దానికదే రద్దు అయినట్లయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇతర అంశాలతోపాటు కడా ఏర్పాటుకు అధికారికంగా లాంఛనమైన ఆమోదముద్ర లభించింది. ఇప్పటికే కడా పరిధిలోని కుప్పం మున్సిపాలిటీతోపాటు మిగిలిన నాలుగు మండలాల సర్వతోముఖాభివృద్ధికి కడా పీడీ ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పర్యవేక్షణలో, ముఖ్యమంత్రి సూచనలతో విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. ప్రభుత్వంలోని మొత్తం 18 విభాగాలను ఇందులో భాగస్వాములను చేశారు. అమరావతినుంచి ఆయా విభాగాలలో నిపుణులైన మేధావులు వచ్చి విజన్ డాక్యుమెంట్ తయారీలో పాలుపంచుకున్నారు. అవసరమైన నివేదికలు అందించారు. వీటన్నిటి సమగ్ర రూపంగా విజన్ డాక్యుమెంట్ తయారీ జరిగింది. ప్రధానంగా పేదరిక నిర్మూలన, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కేంద్రంగా ఈ డాక్యుమెంట్‌ను రూపొందించారు. కడా పీడీ ఇటీవల అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈ డాక్యుమెంట్‌ను సమర్పించి వచ్చారు. విజన్ డాక్యుమెంట్‌లోని ప్రతిపాదనల ప్రకారంగా కొన్ని అభివృద్ధి పనులకు రూ.కోట్లలో నిధుల కేటాయింపు కూడా జరిగింది. అయితే విడుదల ఇంకా కాలేదు. ఇప్పుడు కడా ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం లభించడమనే లాంఛనం కూడా పూర్తి అయింది కాబట్టి, ప్రభుత్వం నుంచి నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. దీంతో ఇక కడా పరిధిలో అభివృద్ధి వేగవంతం అయ్యే అవకాశం ఏర్పడింది.