తిరుపతిలో డీజీపీ
ABN , Publish Date - Dec 29 , 2024 | 02:22 AM
డీజీపీ ద్వారకా తిరుమలరావు రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుపతికి విచ్చేశారు.
తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): డీజీపీ ద్వారకా తిరుమలరావు రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుపతికి విచ్చేశారు. విజయవాడ నుంచి రేణిగుంటలోని విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కారులో తిరుపతిలోని పోలీసు అతిథి గృహం వద్దకు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండులో రూ 6.41 కోట్లతో నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయ కాంప్లెక్సు భవనాలను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడే ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్, రిజర్వు గ్రౌండును పరిశీలించారు. సాయంత్రం 5.50 గంటలకు పోలీసు అతిథి గృహం చేరుకుని అక్కడి నుంచి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. రాత్రికి అక్కడే బసచేసి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు. ఏఎస్పీలు వెంకట్రావు, రవిమనోహరాచారి, శ్రీనివాసులు ఆయన వెంట ఉన్నారు.