సిఫార్సు లేఖలు పనిచేస్తాయా?
ABN , Publish Date - Aug 29 , 2024 | 01:31 AM
సిఫార్సు లేఖలు పనిచేస్తాయా? అనుకూల ప్రాంతాల్లో పోస్టింగులు వస్తాయా? ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల మధ్య సాగుతున్న చర్చ ఇది.
- అనుకూల స్థానాల్లో పోస్టింగులకు ఉద్యోగుల పాట్లు
- మరో రెండు రోజుల్లో పూర్తికానున్న బదిలీలు
సిఫార్సు లేఖలు పనిచేస్తాయా? అనుకూల ప్రాంతాల్లో పోస్టింగులు వస్తాయా? ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల మధ్య సాగుతున్న చర్చ ఇది. గత నెలలో తహసీల్దార్ల బదిలీల కోసం ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చినా.. చాలావరకు పని జరగకపోవడాన్ని వారు గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు మ్యూచువల్ ఉంటేనే బదిలీలకు ఆమోదించాలని కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తమకు ఎవరైనా మ్యూచువల్ వస్తారా అని మరికొందరు ఉద్యోగులు ఆరా తీసే పనిలో పడ్డారు. - చిత్తూరు రూరల్
వివిధ శాఖల్లో బదిలీల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ నెల 31వ తేదీకంతా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. సెప్టెంబరు ఒకటో తేదికి బదిలీ అయిన స్థానాల్లో ఉద్యోగులు బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అందుకు అనుగుణంగా అధికారులు బదిలీల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇక, వాణిజ్య పన్నుల శాఖలో బదిలీలను ఆపాలంటూ ఏపీ కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 2.0 పునర్వ్యవస్థీకరణ పేరిట జరిగిన తప్పిదాలపై విచారణ చేపట్టి, వాటిని సరిదిద్దాకే బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు. గత 5 సంవత్సరాలలో వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేయాలని, కమర్షియల్ ట్యాక్స్‌లో ఉన్నతాధికారుల అవినీతిపై ఏసీబీ దర్యాప్తు చేయాలని డిమాండు చేస్తున్నారు. అవేవీ పట్టించుకోకుండా ఆ శాఖ అధికారులు బదిలీల ప్రక్రియను చేపడుతున్నారు. ఈ నెల 31వ తేది లోపు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గతేడాదే అధిక శాతం ఉద్యోగులు బదిలీ అయ్యారు. దీంతో ఇప్పుడు నోడల్ డివిజన్ పరిధిలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల నుంచి సుమారు 120 మంది మాత్రమే బదిలీ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు.
జడ్పీలో వేగంగా బదిలీల ప్రక్రియ
జడ్పీలో ఎంపీడీవోల బదిలీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గురువారానికి దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. జడ్పీ పరిధిలో ఎంపీడీవోల నుంచి అటెండర్ వరకు వివిధ క్యాడర్లకు సంబంధించి 575 మంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఐదేళ్లు ఒకే చోట సర్వీసు పూర్తి చేసుకున్న 297 మందికి బదిలీలు అనివార్యమైంది. ఐదేళ్లు పూర్తి కాని వారు కూడా వివిధ స్థానాలకు బదిలీ కావాలని ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో దరఖాస్తు చేసుకున్నారు.
విద్యుత్ శాఖలో 72 మందికి తప్పనిసరి
సదరన్ డిస్కం పరిధిలో బదిలీ ప్రక్రియపై కసరత్తు కొనసాగుతోంది. ఈ నెల 31వ తేదిలోపు బదిలీలు పూర్తి చేయాల్సి ఉంది. ఉద్యోగులు కూడా తమకు కావాల్సిన చోటు బదిలీ చేయించుకునేందుకు ఎమ్మెల్యే, ఎంపీల నుంచి సిఫార్సు లేఖలతో దరఖాస్తులు చేశారు. డిస్కం పరిధిలో వివిధ హోదాలలో 72 మంది ఒకే స్థానంలో ఐదేళ్లు సర్వీసును పూర్తి చేసుకున్నారు. వీరికి బదిలీ తప్పడం లేదు. 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిలో ఎస్‌ఈ, జీఎంలు ముగ్గురు, ఈఈలు 14, డీఈలు 24, ఏఈలు 18, సీజీఎంలు 2, ఏఏవోలు 12 మంది ఉన్నారు.
గ్రామ సచివాలయాల్లో నాలుగు శాఖలకు మినహాయింపు
మొదట్లో గ్రామసచివాలయాల్లో పనిచేస్తున్న అనిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, సిరికల్చర్, ఏఎన్‌ఎంలను ఆయా శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం చూసింది. అయితే బుధవారం వీరికి బదిలీల్లో మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ శాఖలో వీరి బదిలీల ప్రక్రియను నిలిపివేశారు.