వీఆర్‌కు ఈస్ట్ సీఐ
ABN , Publish Date - Nov 08 , 2024 | 02:39 AM
తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులును వీఆర్‌కు పంపుతూ ఎస్పీ సుబ్బరాయుడు గురువారం ఆదేశాలు జారీ చేశారు.
విధుల పట్ల నిర్లక్ష్యం..
కేసుల నమోదులో అలసత్వమే కారణం
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులును వీఆర్‌కు పంపుతూ ఎస్పీ సుబ్బరాయుడు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈస్ట్ సీఐగా ఆయన బాధ్యతలు స్వీకరించి నెల రోజులే కావడం గమనార్హం. విధుల పట్ల నిర్లక్ష్యం.. కేసుల నమోదులో అలసత్వంతో వ్యవహరించడమే కారణమని తెలిసింది. విధుల్లో చేరినప్పటి నుంచీ ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల అసహనం వ్యక్తం చేయడం, ప్రతి రోజూ నమోదవుతున్న ఎఫ్‌ఐఆర్‌లను ఉన్నతాధికారులకు తెలియచేయడంలో అలక్ష్యం చూపడం, కొన్ని కేసుల వివరాలు స్టేషన్ జనరల్ డైరీలో ఎంట్రీ చేయకనే నేరుగా బాధితులతో మాట్లాడి రాజీ కుదుర్చుతున్నారనే ఫిర్యాదులు ఎస్పీ దృష్టికి వెళ్లాయి. దీంతో వీటిపై విచారణకు ఆయన ఆదేశించారు. తిరుపతి స్పెషల్ బ్రాంచి అధికారులు విచారించి నివేదిక ఇచ్చారు. దీంతో ఆయన్ను వీఆర్‌కు పంపారు. తక్షణం రిలీవ్ అయి ఎస్పీ వద్ద రిపోర్టు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
గత సీఐ కూడా వీఆర్‌కే..
గతంలో ఈస్ట్ సీఐగా పనిచేసిన మహేశ్వరరెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడం, టీటీడీ మార్కెటింగ్ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేయడానికి భయపడి అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయన్ను వీఆర్‌కు పంపారు. ఆయన స్థానంలో శ్రీనివాసులును నియమించారు. అయితే కొద్ది రోజులకే ఈయనపైనా పలు అవినీతి ఆరోపణలు రావడంతో వీఆర్‌కు బదిలీ చేశారు.
ఈస్ట్ ఇన్‌చార్జి సీఐగా రామకృష్ణ
తిరుపతి ఈస్ట్ ఇన్‌చార్జి సీఐగా వెస్ట్ సీఐ రామకృష్ణను నియమిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గురువారం ఈస్ట్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఎస్‌ఐలు, సిబ్బంది స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందచేశారు. అనంతరం డీఎస్పీ వెంకటనారాయణను మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందచేశారు.