భయం...భయం
ABN , Publish Date - Nov 03 , 2024 | 02:46 AM
మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కెళ్లే ముఠా జిల్లాలో చెలరేగిపోతోంది.
చెలరేగిపోతున్న గొలుసు దొంగలు
రక్షించుకోబోయి ఓ మహిళ మృతి
బయట తిరగాలంటే భయపడిపోతున్న మహిళలు
చిత్తూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కెళ్లే ముఠా జిల్లాలో చెలరేగిపోతోంది. గత నెల 26వ తేదీన ఒకేరోజు ఇలాంటివి మూడు ఘటనలు జరిగాయి. శుక్ర, శనివారాల్లో మరో మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి.పూతలపట్టులో అయితే తన చైన్‌ను రక్షించుకోబోయిన ఓ మహిళ దొంగల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించింది కూడా.మొత్తానికి గొలుసుదొంగల ముఠా జిల్లా పోలీసులకు సవాల్ విసురుతోంది.
15 నిమిషాల్లో మూడు దొంగతనాలు..
పూతలపట్టు, ఐరాల మండలాల్లో అక్టోబరు 26వ తేదీన మూడు చైన్ దొంగతనాలు 15 నిమిషాల వ్యవధిలో జరిగాయి. చిత్తూరు- పీలేరు హైవేపై కేటీఎం బైకులో వెళ్తూ ఇద్దరు యువకులు ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ మూడు ఘటనలు జరిగి వారం దాటినా పోలీసులు ఆ ముఠాను పట్టుకోలేకపోయారు. అక్టోబరు 26న మధ్యాహ్నం 3 గంటలకు పూతలపట్టు మండలం కిచ్చన్నగారిపల్లెకు చెందిన మల్లిక (50) మెడలోని 56 గ్రాముల చైన్ తీసుకెళ్లిపోయారు. అదే రోజు, అదే మండలం తలపులపల్లె వద్ద వైఎస్ గేటుకు చెందిన ప్రమీల (55) మెడలో మధ్యాహ్నం 3.08 గంటలకు చైన్ లాక్కెళ్లే ప్రయత్నం చేయగా.. ఆమె పోరాడి గాయపడింది. చికిత్స పొందుతూ మరణించింది. ఇక ఐరాల స్టేషన్ పరిధిలో అదే రోజు మధ్యాహ్నం 3.15 గంటలకు మరో దొంగతనం జరిగింది. జి.గొల్లపల్లెకు చెందిన నాగరత్నమ్మ (45) చిత్తూరు-పీలేరు మార్గంలోని గొల్లపల్లె బస్టా్‌పలో నిలబడి ఉండగా.. ఇద్దరు బైకులో వచ్చి ఆమె మెడలోని 36 గ్రాముల గొలుసును లాక్కెళ్లారు.
ముఠాతో పోరాడి మరణించిన ప్రమీల
ఐరాల మండలం వైఎస్ గేటుకు చెందిన ప్రమీల (55) అక్టోబరు 26న స్కూటీలో పూతలపట్టుకు బయల్దేరింది. చిత్తూరు- పీలేరు హైవేపై తలపులపల్లె వద్ద వస్తుండగా.. ఎదురుగా కేటీఎం బైకులో వస్తున్న ఇద్దరు యువకులు ఆమెను అడ్రస్ కోసమంటూ నిలిపారు. అనుమానం వచ్చిన ప్రమీల మెడలోని చైన్‌ను గట్టిగా పట్టుకుంది. అయినా ఆ దుండగులు ఆమె మెడను గట్టిగా పట్టుకుని లాక్కెళ్లారు. చైన్‌ను మాత్రం తీసుకెళ్లలేకపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ రాణిపేట సీఎంసీలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది.
చౌడేపల్లెలో 75 ఏళ్ల వృద్ధురాలి మెడలో..
మండల కేంద్రమైన చౌడేపల్లెలోని బైసాని పంక్షన్ హాల్ పక్కన నివాసం ఉంటున్న కె.రాజమ్మ (75) శనివారం మధ్యాహ్నం ఇంటి బయట నిల్చొని ఉన్నారు. ఇంటి పక్కనే ఉన్న కిరాణాషాపులో సిగరెట్ కోసం స్కూటర్ ఆపిన ఇద్దరు యువకులు దుకాణం పక్కనున్న రాజమ్మ మెడలో 42 గ్రాముల బంగారు గొలుసు లాక్కుని కందూరు వైపు వెళ్లిపోయారు. ఆమె గట్టిగా అరిచేసరికి కుటుంబ సభ్యులు మూడు స్కూటర్లలో దొంగల్ని వెంబడించారు. పోలీసులు కూడా స్పందించి ఫాలో అయ్యారు కానీ ముఠాను పట్టుకోలేకపోయారు.
పుంగనూరులో రెండు ఘటనలు
శుక్రవారం రాత్రి పుంగనూరు మినీ బైపాస్ రోడ్డులో స్వగ్రామమైన రామసముద్రం వెళ్లేందుకు నాగజ్యోతి భర్త పిల్లలతో బస్సు కోసం వేచి ఉన్నారు. బస్సు వచ్చాక ఎక్కే సమయంలో ఆమె మెడలోని 15 గ్రాముల చైన్‌ను హెల్మెట్ వేసుకున్న ఇద్దరు యువకులు లాక్కెళ్లారు. అలాగే శనివారం రాత్రి మేలుపట్ల వద్ద కమల అనే మహిళ కుమార్తెతో కలిసి గుడి నుంచి ఇంటికి వెళ్తుండగా.. బైకులో వచ్చిన ముఠా ఆమె మెడలో 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లారు. శుక్ర, శనివారాల్లో జరిగిన ఈ ఘటనలు రెండూ రాత్రి 7 గంటలకే జరిగాయి.
రెండు ముఠాలా..? ఒకటేనా..?
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. అక్టోబరు 26న చిత్తూరు- పీలేరు హైవే మీద 15 నిమిషాల్లో ఓ ముఠా మూడు దొంగతనాలు చేయగా.. శుక్ర, శనివారాల్లో పుంగనూరు, చౌడేపల్లెలో మరో ముఠా మూడు దొంగతనాలకు పాల్పడింది. 26వ తేదీన కేటీఎం బైకులో ఇద్దరు యువకులు దొంగతనాలు చేయగా.. తాజాగా పుంగనూరు, చౌడేపల్లెలో జరిగిన మూడు దొంగతనాల్లోనూ ఇద్దరు యువకులే ఎఫ్‌జెడ్ బైకులో వచ్చారు. అక్కడ కేటీఎం.. ఇక్కడ ఎఫ్‌జెడ్.. అంతే తేడా. దొంగతనం జరిగిన తీరు. పాల్గొన్న దొంగల సంఖ్య ఒకటే. దీంతో ఈ ఆరు దొంగతనాల్లో పాల్గొంది రెండు ముఠాలా..? ఒకటేనా..? అని కోణంలో కూడా విచారణ జరగాల్సి ఉంది.
పోలీసుల వైఫల్యం..
జిల్లా పోలీసుల వైఫల్యంతో మహిళలు బయట తిరగాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబరు 26న జరిగిన మూడు దొంగతనాల విషయంలో ముఠాను వారం దాటినా పట్టుకోలేకపోయారు. ఆ ముఠాను పట్టుకోలేకపోవడంతో తాజాగా పుంగనూరు ప్రాంతంలో మరో మూడు దొంగతనాలు జరిగాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రౌడీ షీటర్లపై, అనుమానితులపై నిఘా ఉంచేందుకు ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్’ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జిల్లా పోలీసులూ 790 మంది రౌడీషీటర్లను, 1600 మంది అనుమానితుల్ని గుర్తించారు. అయినా ఈ దొంగతనాల్ని నిలువరించలేకపోయారు.