Share News

'Festival of studies' - 7న ప్రభుత్వ బడుల్లో ‘చదువుల పండుగ’

ABN , Publish Date - Dec 05 , 2024 | 02:02 AM

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏడో తేదీన ‘చదువుల పండుగ’ నిర్వహించనున్నారు. ఈ మెగా పేరంట్స్‌ మీటింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.42.79 లక్షలు విడుదల చేసింది. మొత్తం 2,322 ప్రభుత్వ పాఠశాలల్లో 1.56 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

'Festival of studies' - 7న ప్రభుత్వ బడుల్లో ‘చదువుల పండుగ’

మెగా పేరంట్స్‌ మీటింగ్‌కు రూ.42.79 లక్షలు విడుదల

తిరుపతి(విద్య), డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏడో తేదీన ‘చదువుల పండుగ’ నిర్వహించనున్నారు. ఈ మెగా పేరంట్స్‌ మీటింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.42.79 లక్షలు విడుదల చేసింది. మొత్తం 2,322 ప్రభుత్వ పాఠశాలల్లో 1.56 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్యనుబట్టి ఆయా పాఠశాలలకు నిధులు కేటాయిస్తారు. 10 మందిలోపుంటే రూ. 1000, 101 నుంచి 200 మంది విద్యార్థులున్న పాఠశాలలకు రూ. 3 వేలు, 301 నుంచి 400 మంది ఉన్న పాఠశాలలకు రూ. 6వేలు ఇలా అత్యధికంగా 901 నుంచి 1000 మంది ఉన్న పాఠశాలలకు రూ. 11 వేల చొప్పున కేటాయించారు. ఈ మీటింగు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి విద్యాపరమైన అంశాలు చర్చించనున్నారు. తమ పిల్లలు ఎలా చదువుతున్నారు? ఏ పాఠ్యాశంలో వెనుకబడి ఉన్నారు? ఎన్నెన్ని మార్కులు వస్తున్నాయనేది అక్కడికక్కడే తల్లిదండ్రులు తెలుసుకునే వీలు కలుగుతుంది. ఇలా జిల్లాలోని 1.56 లక్షల విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులను అందించనున్నారు. దీనివల్ల విద్యార్థుల చదువు, ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టిపెట్టి సరిదిద్దేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. పిల్లల చదువులపై వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు జవాబుదారీతనం పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని డీఈవో కేవీఎన్‌ కుమార్‌ చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలకోసం తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయులు.. ఉపాధ్యాయుల నుంచి తల్లిదండ్రులు ఎలాంటి సహకారం కోరుకుంటున్నారనేది తెలుసుకోవచ్చని ఈ కార్యక్రమ నోడల్‌ అధికారి జి.సురేష్‌ తెలిపారు.

Updated Date - Dec 05 , 2024 | 02:02 AM