సత్యవేడు గురుకులంలో జ్వరాల కలకలం
ABN , Publish Date - Nov 15 , 2024 | 02:21 AM
సత్యవేడులోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో 60 మందికి పైగా విద్యార్థులు జ్వరాల బారిన పడడం కలకలం రేపింది.
60 మంది జ్వర బాధితులు ఆస్పత్రికి తరలింపు
విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్
సత్యవేడు, నవంబరు 14: సత్యవేడులోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో 60 మందికి పైగా విద్యార్థులు జ్వరాల బారిన పడడం కలకలం రేపింది. గురువారం ఉదయం మెస్‌కు అల్పాహారానికి వెళుతున్న సమయంలో ఇద్దరు కళ్లు తిరిగి పడిపోయారు. తోటి విద్యార్థులు గుర్తించి వెంటనే ఉపాధ్యాయులకు తెలియజేశారు. పాఠశాల స్టాఫ్‌నర్స్ భువనేశ్వరి విద్యార్థులను పరీక్షించగా జ్వరం తీవ్రంగా ఉందని నిర్ధారించారు. మరో 15 మంది కూడా జ్వరంతో బాధపడుతున్నారని గుర్తించి వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో వైద్య బృందం చికిత్స అందించారు. 60 మందికి పైగా జ్వర బాధితులను గుర్తించారు. ఆరవ తరగతి విద్యార్థి శివశంకర్‌కు జ్వరం తీవ్రంగా ఉండడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి రెఫర్ చేశారు. తహసీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో రవి ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు దాసుకుప్పం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ గుణశేఖర్ ఆధ్వర్యంలో పాఠశాలలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ రెడ్డి పాఠశాలను సందర్శించి వివరాలను ఆరా తీశారు. రుయాలో చికిత్స పొందుతున్న శివశంకర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సాధారణ వైరల్ ఫీవర్ మాత్రమేనని ధ్రువీకరించారు. కలెక్టర్ వెంకటేశ్వర్ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. డీఎంహెచ్‌ఓ శ్రీహరి, డీసీహెచ్‌ఓ ఆనందమూర్తి, ఆర్డీవో కిరణ్మయితో కలిసి ఆస్పత్రిని సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, స్టాఫ్‌నర్స్ భువనేశ్వరిలతో సమీక్షించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు కోలుకునే వరకు పాఠశాలలో వైద్య బృందం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదిమూలం ఈ ఘటనపై ఆస్పత్రి డాక్టర్లు, పాఠశాల యాజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జ్వర బాధిత విద్యార్థులకు మలేరియా, టైఫాయిడ్, డెంగీ, జాండీస్ తదితర రక్త పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగటివ్ రిపోర్టులు వచ్చాయని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ గుణశేఖర్ తెలిపారు. పాఠశాలలో నీటి శాంపిల్స్ తిరుపతి పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌కు పంపించినట్లు వివరించారు. పాఠశాలలో మూడు రోజుల నుంచి పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలిసింది.