Share News

20నుంచి ఓటర్ల జాబితా సవరణ షురూ

ABN , Publish Date - Aug 12 , 2024 | 01:43 AM

జిల్లాలో ఈనెల 20 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే 18-19 సంవత్సరాల యువతను కొత్త ఓటరుగా నమోదుకు భారత ఎన్నికల కమిషన్‌ అవకాశమిచ్చింది. ఈనెల 20 నుంచి అక్టోబరు 18వ తేదీ నాటికి సవరణ ప్రక్రియ పూర్తి చేసి, అదేనెల 29న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సమాచారాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది.

20నుంచి ఓటర్ల జాబితా సవరణ షురూ

- ఓటరుగా నమోదుకు యువతకు అవకాశం

తిరుపతి(కలెక్టరేట్‌), ఆగస్టు 11: జిల్లాలో ఈనెల 20 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే 18-19 సంవత్సరాల యువతను కొత్త ఓటరుగా నమోదుకు భారత ఎన్నికల కమిషన్‌ అవకాశమిచ్చింది. ఈనెల 20 నుంచి అక్టోబరు 18వ తేదీ నాటికి సవరణ ప్రక్రియ పూర్తి చేసి, అదేనెల 29న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సమాచారాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఓటర్ల జాబితాల్లో పొరపాట్లను గుర్తించి తొలగించడం, ఫొటోల నాణ్యతను మెరుగుపరచడం, పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్‌ చేయనున్నారు. అక్టోబరు 19 నుంచి 28వ తేదీవరకు 1 నుంచి 8 వరకు ఫారాల తయారీతో పాటు వచ్చే ఏడాది జనవరి ఒకటోతేదీ నాటికి సమగ్రమైన డ్రాఫ్ట్‌ రోల్స్‌ సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. అలాగే ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఇతర క్లెయిమ్‌లు నవంబరు 28వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఈ ఏడాది డిసెంబరు 24వ తేదీ నాటికి అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిష్కరిస్తారు. తుది ఓటర్ల జాబితాను వచ్చే ఏడాది జనవరి 6న ప్రచురించనున్నారు.

ఈసారైనా దొంగ ఓట్లను తొలగిస్తారా..?

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ బరితెగించి బీఎల్వోలు, ఇతర అధికారుల సహకారంతో ఇబ్బడి ముబ్బడిగా దొంగ ఓట్లను చేర్పించడం, డెడ్‌, షిఫ్టెడ్‌ ఓట్లను తొలగించలేదన్న విమర్శలు వచ్చాయి. అప్పట్లో ఈ అంశాలపై కూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 20 నుంచి చేపట్టబోయే ప్రక్రియలోనైనా దొంగ ఓట్లను తొలగించాలని వారు కోరుతున్నారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ సమయానికి మొత్తం 18,12,980మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 8,83,330 మంది, మహిళలు 9,29,466మంది, ఇతరులు 184మంది ఉన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా ఓటర్ల సవరణ ప్రక్రియ నిర్వహిస్తే ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చంద్రగిరి, తిరుపతిలో అత్యఽధికంగా దొంగ ఓట్లు నమోదైన విషయం బహిరంగ రహస్యమే. ఈ విషయాలపై కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ దృష్టి సారించాల్సి ఉంది.

Updated Date - Aug 12 , 2024 | 01:43 AM