నిధులు ఘనం
ABN , Publish Date - Nov 12 , 2024 | 01:09 AM
చిత్తూరు, తిరుపతి జిల్లాకు బడ్జెట్‌లో గణనీయంగా నిధుల కేటాయింపు సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో ఇక కదలిక
తిరుపతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బడ్జెట్‌లో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు గణనీయంగా నిధుల కేటాయింపులు జరిగాయి. తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా తదితర సాగునీటి ప్రాజెక్టులకు రూ. 4530 కోట్లు దక్కాయి. దీంతో ఐదేళ్ళ తర్వాత సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో కదలిక రానుంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు వివిధ కార్యక్రమాల కింద రూ. 350 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రెండు జిల్లాల పరిధిలోని యూనివర్శిటీలు, శ్రీసిటీ ఐఐటీ సంస్థలకు రూ. 500 కోట్లు ఇచ్చింది. పులికాట్ పరిధిలో మత్స్యకారులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పూడికతీత పనులకు రూ. 97 కోట్లు మంజూరు చేసింది. చెన్నై-వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సైతం ప్రభుత్వం కొత్త బడ్జెట్‌లో రూ. 210 కోట్లు కేటాయించింది. గత ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ఈ రెండు జిల్లాల పరిధిలో సాగునీటి, పారిశ్రామిక, విద్యా రంగాలకు నిధులేమీ కేటాయించని నేపధ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం జరిపిన నిధుల కేటాయింపులు రెండు జిల్లాల ప్రజలకు ఊరటనిస్తున్నాయి.
తెలుగు గంగ ప్రాజెక్టు పనులకు రూ. 879.24 కోట్లు
ఎన్టీయార్ తెలుగు గంగ ప్రాజెక్టుకు మొత్తంగా ప్రభుత్వం రూ. 879.24 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు పనులకు గత వైసీపీ ప్రభుత్వం 2022-23లో రూ. 231.84 కోట్లు కేటాయించగా 2023-24లో రూ. 798.11 కోట్లు ప్రతిపాదించింది. అయితే బడ్జెట్ సవరణల్లో ఆ మొత్తాన్ని రూ. 619 కోట్లకు కుదించింది. ప్రస్తుత ప్రభుత్వం రూ. 879.24 కోట్లు కేటాయించినప్పటికీ అందులో సింహభాగం నెల్లూరు జిల్లా పరిధిలో ఖర్చు చేయనున్నారు. తిరుపతి జిల్లా విషయానికొస్తే అందులో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులకు రూ. 66 కోట్లు రానున్నాయి. ఈ కెనాల్ పనులకు గత ప్రభుత్వం 2022-23లో రూ. 10.17 కోట్లు కేటాయించింది. అలాగే 2023-24లో రూ.41.92 కోట్లు కేటాయించినప్పటికీ తర్వాత దాన్ని బడ్జెట్ సవరణల్లో రూ. 4.19 కోట్లకు కుదించింది. దీంతో ఈ కెనాల్ పనులేమీ జరగలేదు. తాజా కేటాయింపులతో పనులు తిరిగి మొదలు కానున్నాయి. అలాగే తాజా బడ్జెట్‌లో తెలుగు గంగకు కేటాయించిన నిధుల నుంచీ కండలేరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు రూ. 11 కోట్లు దక్కనున్నాయి. ఈ స్కీమ్‌కు గతేడాది కూడా బడ్జెట్‌లో రూ. 11.54 కోట్లు కేటాయించారు.
గాలేరు నగరికి రూ. 2438.94 కోట్లు
దశాబ్దాలుగా జిల్లా ప్రజలను ఊరిస్తున్న గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనులకు కూటమి ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ. 2438.94 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుపై గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పనులు జరగని సంగతి తెలిసిందే. 2022-23లో నామమాత్రంగా రూ.275.48 కోట్లు కేటాయించినప్పటికీ పనులేమీ జరగలేదు. ఇక 2023-24లో రూ.855.34 కోట్లు తొలుత కేటాయించిన ప్రభుత్వం తర్వాత బడ్జెట్ సవరింపుల్లో దాన్ని రూ. 2072.86 కోట్లకు పెంచింది. నిధుల కేటాయింపును పెంచినా పనులు మాత్రం మొదలు కాలేదు. గత టీడీపీ ప్రభుత్వంలో పనులు వేగంగా జరగగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక అప్పటివరకూ అమల్లో వున్న టెండర్లను రద్దు చేయడంతో పాటు ఏకంగా ప్రాజెక్టు డిజైన్‌ను కూడా మార్చివేసింది. శేషాచల అడవుల్లో టన్నెల్ నిర్మాణానికి బదులు గండికోట రిజర్వాయర్ నుంచీ కాలువ తవ్వి నీటిని తంబళ్ళపల్లి, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల మీదుగా తూర్పు ప్రాంతానికి తరలించేలా ప్రణాళికను మార్చింది.కానీ దానికి నిధులేవీ కేటాయించలేదు. ఇపుడు కూటమి ప్రభుత్వం తొలి ఏడాది బడ్జెట్‌లోనే ఏకంగా రూ. 2438 కోట్లు కేటాయించడంతో మునుపటి డిజైన్ ప్రకారమే పనులు సజావుగా సాగుతాయని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
హంద్రీ-నీవాకు రూ. 2014.23 కోట్లు
చిత్తూరు జిల్లాకు ప్రాణాధారంగా మారనున్న హంద్రీ-నీవా ప్రాజెక్టును గత ప్రభుత్వం ఐదేళ్ళూ విస్మరించగా కొత్త ప్రభుత్వం మొదటి బడ్జెట్‌లోనే గణనీయంగా నిధులు కేటాయించింది. వైసీపీ ప్రభుత్వం 2022-23లో రూ. 979.73 కోట్లు కేటాయించినా పనులేవీ చేపట్టలేదు. 2023-24లో తొలుత రూ.270.14 కోట్లు కేటాయించిన అప్పటి ప్రభుత్వం తర్వాత దాన్ని రూ. 486.37 కోట్లకు పెంచింది. అయినప్పటికీ ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు సాగలేదు. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన పనులు తప్ప ఈ ఐదేళ్ళలో కాలువ తవ్వకాలు గానీ, రిజర్వాయర్ల పనులు గానీ జరగలేదు. గత టీడీపీ ప్రభుత్వంలో తంబళ్ళపల్లి, మదనపల్లె, పుంగనూరు, కుప్పం నియోజకవర్గాలకు హంద్రీ-నీవా జలాలందించిన చంద్రబాబు తాజా బడ్జెట్ కేటాయింపులతో ఈ పర్యాయం పీలేరు, పలమనేరు నియోజకవర్గాలకు నీరందించే అవకాశం కనిపిస్తోంది.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ. 350 కోట్లు
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్త బడ్జెట్‌లో రూ. 350 కోట్లు కేటాయించారు. తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద వివిధ అభివృద్ధి పనులకు రూ. 20 కోట్లు రానుండగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద వాడిన నీటిని తిరిగి వినియోగించేలా మార్చేందుకు రూ. వంద కోట్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 16.17 కోట్లు, ఇతర ఖర్చులకు 6.50 కోట్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు రూ. 75.94 కోట్లు, సామర్థ్యాల పెంపునకు రూ. 27.29 కోట్లు, సిబ్బంది వేతనాలకు రూ. 78.80 కోట్లు చొప్పున ఇతర నిధులు దక్కాయి. అలాగే నగరంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయడానికి రూ. 25.58 కోట్లు కేటాయించారు.
ఉన్నత విద్యా సంస్థలకు రూ. 500 కోట్లు
జిల్లాలో ఉన్నత విద్యా సంస్థలకు కొత్త ప్రభుత్వం తొలి బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించింది. ఎస్వీయూకు తాజా బడ్జెట్‌లో రూ. 226.38 కోట్లు కేటాయించగా ఈ వర్శిటీకి 2022-23లో 263 కోట్లు, 2023-24లో రూ. 211.83 కోట్లు చొప్పున వచ్చాయి. ఎస్వీ వెటర్నరీ వర్శిటీకి గతేడాది రూ. 127.85 కోట్లు దక్కగా ఈ పర్యాయం రూ. 153 కోట్లు కేటాయించారు. ఇక పద్మావతీ మహిళా వర్శిటీకి రూ. 72.73 కోట్లు ఈ బడ్జెట్‌లో దక్కగా ఇదే వర్శిటీకి 2022-23లో 52.22 కోట్లు, 2023-24లో రూ. 51.74 కోట్లు వంతున నిధుల కేటాయింపులు జరిగాయి. కుప్పంలోని ద్రవిడ యూనివర్శిటీకి తాజా బడ్జెట్‌లో రూ. 27.91 కోట్లు కేటాయించారు. ఈ వర్శిటీకి 2022-23లో రూ. 18.48 కోట్లు, 2023-24లో రూ. 23.17 కోట్లు వంతున నిధుల కేటాయింపులు జరిగాయి.శ్రీసిటీలో కొత్తగా ఏర్పాటవుతున్న ఐఐటీకి కూటమి ప్రభుత్వం రూ. 19.52 కోట్లు కేటాయించింది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దశలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులు తిరుపతి, చిత్తూరు జిల్లాల అభివృద్ధికి మేలు చేస్తుందని ప్రజలు భావిస్తున్నారు.