గున్న ఏనుగు మృతి
ABN , Publish Date - Feb 19 , 2024 | 01:01 AM
చంద్రగిరి మండలం కూచువారిపల్లె అటవీప్రాంతంలోని నాగపట్ల వెస్ట్ బీట్ పరిధిలో ఓ గున్న ఏనుగు (ఏనుగు పిల్ల) మృతి చెందింది. దివారం ఉదయం అటవీ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా కూచువారిపల్లె అటవీ ప్రాంతంలో గున్న ఏనుగు మృతి చెందినట్లు గుర్తించారు
చంద్రగిరి, ఫిబ్రవరి 18: చంద్రగిరి మండలం కూచువారిపల్లె అటవీప్రాంతంలోని నాగపట్ల వెస్ట్ బీట్ పరిధిలో ఓ గున్న ఏనుగు (ఏనుగు పిల్ల) మృతి చెందింది. నెల రోజులుగా చంద్రగిరి మండలంలోని మూలపల్లె, భీమవరం, చిన్నరామాపురం, శేషాపురం, బీ.కొంగరవారిపల్లె, యల్లంపల్లి ప్రాంతాల్లో ఏనుగులు అర్ధరాత్రయితే పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఇటీవల యల్లంపల్లికి చెందిన రైతు మనోహర్‌రెడ్డి తన పొలం వద్ద నిద్రిస్తుండగా ఏనుగు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం అటవీ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా కూచువారిపల్లె అటవీ ప్రాంతంలో గున్న ఏనుగు మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీ ఉన్నతాధికారులు సీసీఎఫ్ నాగేశ్వరరావు, డీఎ్‌ఫవో సతీష్, శివకుమార్, ఎఫ్‌ఆర్వో దత్తాత్రేయ, డీఆర్వో చక్రపాణి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన గున్న ఏనుగును పరిశీలించారు. సుమారు ఏడాది వయసున్న ఈ ఏనుగు పిల్ల మృతి చెంది 20 రోజులకుపైగా అవుతున్నట్లు భావిస్తున్నారు. కళేబరం కూడా పురుగులు పట్టి, దుర్గంధం వెదజల్లుతోందని తెలిపారు. అనంతరం ఎస్వీ జూపార్కు నుంచి వైద్యులను పిలిపించి పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక వచ్చాక ఎలా చనిపోయిందో తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.