హ్యాపీ న్యూఇయర్ పాలిటిక్స్
ABN , Publish Date - Jan 02 , 2024 | 12:51 AM
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిత్తూరులో న్యూఇయర్ వేడుకల పేరుతో రాజకీయ సందడి జోరందుకుంది.
- చిత్తూరులో డీకే కుటుంబం సందడి
- నూతన సంవత్సర వేడుకల పేరిట డీఏ శ్రీనివా్‌సను కలిసిన టీడీపీ, వైసీపీ నేతలు
చిత్తూరు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిత్తూరులో న్యూఇయర్ వేడుకల పేరుతో రాజకీయ సందడి జోరందుకుంది. చిత్తూరు నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు నూతన ఆంగ్ల సంవత్సరాది వేడుకలు జరుపుకొన్నారు. మాజీ ఎంపీ, దివంగత డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు డీఏ శ్రీనివాస్ ఇంటికి టీడీపీ, వైసీపీ నాయకులు సోమవారం క్యూకట్టారు. వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఆదికేశవులు నాయుడి తమ్ముడు బద్రినారాయణ పలువురు ప్రముఖులను ఇంటికి ఆహ్వానించారు. వేడుకలకు వచ్చిన వారిలో సింహభాగం టీడీపీ నాయకులే. ఓ దశలో ఆయనకు టీడీపీ నాయకులు పసుపు కండువాను వేయడం చూస్తుంటే డీఏ శ్రీనివాస్ టీడీపీలో యాక్టివ్ అయ్యేటట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. శ్రీనివా్‌సను కలిసిన టీడీపీ నాయకుల్లో దొరబాబు, చంద్రప్రకాష్, హేమలత, కాజూరు బాలాజీ, గురజాల జగన్‌మోహన్, వసంత్, ఎన్‌పీఎ్‌స ప్రకాష్ తదితరులున్నారు.
డీఏను కలిసిన విజయానందరెడ్డి
చిత్తూరు అసెంబ్లీకి వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి.. డీఏ శ్రీనివా్‌సను కలవడం కూడా చర్చగా మారింది. విశేషం ఏమిటంటే ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును కూడా ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీకి చెందిన కార్పొరేటర్ ఏకే రవి, కోఆప్షన్ మెంబర్ కోలా కిరణ్‌కుమార్ కూడా సోమవారం శ్రీనివా్‌సను కలిసినవారిలో ఉన్నారు.
చంద్రప్రకాష్, గురజాల హడావుడి
ఇలా ఉండగా టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న చంద్రప్రకాష్ కూడా ఆదివారం రాత్రి జిల్లా టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల పేరుతో సందడి చేశారు. చిత్తూరుతో పాటు జీడీనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున శ్రేణులు తరలివచ్చారు. అలాగే సోమవారం కూడా చిత్తూరు రూరల్ మండల నేతల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఇక, గురజాల జగన్‌మోహన్ తన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు కూడా శ్రేణులు రాగా, వారికి స్వీట్లను పంపిణీ చేశారు.