Share News

అనుభవం, అవగాహన వున్నాయి...

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:45 AM

ఐఏఎస్‌ అధికారిగా ప్రభుత్వ పాలనపై తనకు అపారమైన అనుభవం, అవగాహన వున్నాయని... ప్రజలు అవకాశమిస్తే వాటిని ఉపయోగించి నియోజకవర్గ అభివృద్ధిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడం ద్వారా వారి రుణం తీర్చుకుంటానని చెబుతున్నారు తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌.ప్రతిపక్షంలో వుండగానే ఎంపీగా నియోజకవర్గానికి విలువైన సేవలు అందించిన తాను ఈ పర్యాయం గెలిస్తే కేంద్ర, రాష్ట్రాల్లో ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వాల అండతో తిరుపతిని అద్భుతంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు మాట ఇస్తున్నారాయన.

అనుభవం, అవగాహన వున్నాయి...
బీజేపీ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌

కేంద్ర నిధులతో పర్యాటక అభివృద్ధి

పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి కృషి

నేలపట్టు అభయారణ్యం ఆంక్షల తొలగింపు

విదేశాలకు విమాన సర్వీసులు

బీజేపీ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌

తిరుపతి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఐఏఎస్‌ అధికారిగా ప్రభుత్వ పాలనపై తనకు అపారమైన అనుభవం, అవగాహన వున్నాయని... ప్రజలు అవకాశమిస్తే వాటిని ఉపయోగించి నియోజకవర్గ అభివృద్ధిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడం ద్వారా వారి రుణం తీర్చుకుంటానని చెబుతున్నారు తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌.ప్రతిపక్షంలో వుండగానే ఎంపీగా నియోజకవర్గానికి విలువైన సేవలు అందించిన తాను ఈ పర్యాయం గెలిస్తే కేంద్ర, రాష్ట్రాల్లో ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వాల అండతో తిరుపతిని అద్భుతంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు మాట ఇస్తున్నారాయన. తిరుపతి ఎంపీగా, గూడూరు ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూనే ఈ ఎన్నికల్లో గెలిస్తే పార్లమెంటు నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి గురించి తన ఆలోచనలను, అభిప్రాయాలను ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు. అవన్నీ ఆయన మాటల్లోనే...

తిరుపతి ఎంపీగా ఎవ్వరూ చేయని అభివృద్ధి చేశా!

తిరుపతి ఎంపీగా 2014లో గెలిచాక నియోజకవర్గాన్ని గతంలో ఎవ్వరూ చేయనంతగా అభివృద్ధి చేశా. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఆరింటిలో కార్యాలయాలు ఏర్పాటు చేశా. ఏడాదిలో 365 రోజులూ ప్రజలకు అందుబాటులో వున్నా. కార్యాలయాల్లో సిబ్బందిని పెట్టి మరీ సమస్యలపై వచ్చిన ప్రజలకు అవసరమైన లెటర్లు అందేలా చూశా.నియోజకవర్గ పరిధిలోని 1500 గ్రామాల్లో పర్యటించా. 1400 గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టా. దానికోసం నా ఎంపీ నిధులతో పాటు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులను కూడా భారీగా తెప్పించా. ఆ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కమ్యూనిటీ హాళ్ళు, బస్‌ షెల్టర్లు, ఇతర భవనాలు కట్టించా. ఇతరులు చేసినట్టు ఐఎస్‌ఐ మార్క్‌ లేని నాసిరకం వీధిలైట్లు, గ్రావెల్‌ రోడ్లకు నిధులు కేటాయించి వృధా చేయలేదు.

ఇపుడు జరుగుతున్న ప్రాజెక్టులన్నీ ప్రతిపాదించింది నేనే!

ప్రస్తుతం తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రాజెక్టులన్నింటినీ ప్రతిపాదించింది నేనే. వాటి ప్రతిపాదనలు మొదలుకుని మంజూరు వరకూ నా పాత్ర చాలా కీలకం. తిరుపతి వరల్డ్‌ క్లాస్‌ రైల్వే స్టేషన్‌ పేరిట అభివృద్ధి ప్రతిపాదనలు నేనే పెట్టా. తిరుపతి-రేణిగుంట నడుమ ఇరు వైపులా అభివృద్ధి చెందేందుకు వీలుగా మూడు సబ్‌వేలు ప్రతిపాదించా. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే ట్రాక్‌ నిర్మాణ పనులు ఆగిపోతే తిరిగి ప్రారంభించేలా చేశా. తిరుపతి స్మార్ట్‌ సిటీ మొదటి దశలో ప్రధాన పాత్ర పోషించా.నాటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని కలసి స్మార్ట్‌ సిటీగా తిరుపతిని మొదటి విడతలోనే ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశా. తిరుచానూరు రైల్వే స్టేషన్‌ ఏర్పాటుకు కారణం కూడా నేనే.ఎన్నో ఏళ్ళుగా ఆగిపోయి వుండిన నాయుడుపేట- పూతలపట్టు జాతీయ రహదారి పనులు తిరిగి మొదలు పెట్టించా. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేయడం వల్ల మిగిలినవి చేయలేకపోయా.

అనేక ఇతర అభివృద్ధి పనులు చేయించా!

చరిత్ర కలిగిన రాయలచెరువుకు 76 ఏళ్ళుగా గేటు లేదు.గ్రామస్తులు సమస్య వుందని చెబితే గేట్‌ చేయించా. తిరుపతి సీతమ్మ నగర్‌కు ఎంపీ నిధులతో ఎలక్ట్రికల్‌ మెటీరియల్‌ మంజూరు చేయించా. స్కావెంజర్స్‌ కాలనీలో పేద ప్రజల నుంచీ భూమి లాక్కోకుండా కాపాడా. పేదల ఎదుగుదలకు చదువు చాలా ముఖ్యమనేది నా అభిప్రాయం. ముఖ్యంగా పేద పిల్లలు చదువుకునే సంక్షేమ హాస్టళ్ళలో పరిస్థితులు మెరుగుపడేందుకు కృషి చేశా. తరచూ హాస్టళ్ళను తనిఖీ చేశా.

అవకాశమిస్తే అభివృదిఽ్ధతో ప్రజల రుణం తీర్చుకుంటా!

ఎంపీగా అవకాశమిస్తే మరెవ్వరూ చేయలేని రీతిలో అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల రుణం తీర్చుకుంటా. ఈ ఎన్నికల్లో గెలిస్తే తిరుపతి వరల్డ్‌ క్లాస్‌ రైల్వే స్టేషన్‌ పనులు పూర్తి చేయిస్తా. ప్రస్తుతం అక్కడ పార్కింగ్‌ సదుపాయం లేదు. గతంలో నేను చేసిన ప్రతిపాదన ప్రకారం వెయ్యి వాహనాలు పార్కు చేసే సదుపాయం వుండాలి. ఆ సౌకర్యం కల్పిస్తా. ఆ ప్రాంతంలో అనేక చోట్ల సబ్‌వేల అవసరం వుంది. వాటిని ఏర్పాటు చేయిస్తా. అలాగే కొత్త సైబర్‌ కేఫ్‌, హోటల్స్‌, రెస్టారెంట్లు, ప్లే గ్రౌండ్‌లు పెట్టించడానికి కృషి చేస్తా. ప్లాట్‌ ఫామ్‌ విస్తరించేలా చూస్తా.ఆగిపోయిన నడికుడి- శ్రీకాళహస్తి పనులను మొదలు పెట్టించి పూర్తయ్యేలా శ్రద్ధ తీసుకుంటా. రేణిగుంట-తిరుపతి నడుమ కూడా సబ్‌వేలు పూర్తి చేయిస్తా. రేణిగుంట సీఆర్‌ఎస్‌ను మరింత విస్తృత పరిచేందుకు ప్రయత్నిస్తా.దానివల్ల ఉద్యోగాలు పెరుగుతాయి. తిరుపతి-రేణిగుంట నడుమ కాటన్‌ మిల్లును అభివృద్ధి పరిచి ఉద్యోగాలు వచ్చేలా చూస్తా.

విదేశీ విమాన సర్వీసులు నడిపిస్తా!

తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ఎదగడానికి 2014-17 నడుమ కీలక పాత్ర పోషించా. భూ సేకరణలో భూములు, భవనాలు కోల్పోయిన రైతులకు, బాధితులకు పరిహారం అందించడానికి కేంద్రం నుంచీ నిధులు కూడా విడుదల చేయించా. విమానాశ్రయ విస్తరణ పనులు జరిగినా దురదృష్టవశాత్తూ విదేశీ విమాన సర్వీసులు ఇంతవరకూ మొదలు కాలేదు.ఎప్పటినుంచో జిల్లా వాసులు, ఇరుగుపొరుగు జిల్లాల వారు గల్ఫ్‌ దేశాలకు బతుకుదెరువు కోసం వెళుతున్నారు. అలాగే ఇటీవలి కాలంలో విదేశీ విద్య కోసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ యువత ఇతర దేశాలకు వెళ్ళడం పెరుగుతోంది.అంతేకాకుండా విదేశాలు సందర్శించేందుకు టూరిస్టులుగా వెళుతున్న వారి సంఖ్య కూడా క్రమేపీ ఎక్కువవుతోంది. ఇలాంటి వారు బెంగళూరు, చెన్నై, హైదరాబాదు విమానాశ్రయాల నుంచీ విదేశాలకు ప్రయాణించాల్సి వస్తోంది. నేను గెలిస్తే విదేశీ విమాన సర్వీసులు ప్రారంభమయ్యేలా చూస్తా. తొలుత దుబాయ్‌, సింగపూర్‌, మలేషియా, అబుదాబి వంటి సమీప దేశాలకు సర్వీసులు నడిచేలా చూస్తా. తర్వాత యూరప్‌ దేశాలకు, అటుపై అమెరికాకు కూడా విమాన సర్వీసులు నడవడానికి కృషి చేస్తా.

సీబీఐసీతో పరిశ్రమలు రప్పిస్తా!

చెన్నై-బెంగుళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ద్వారా జిల్లాకు పరిశ్రమలు రప్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ఈ కారిడార్‌ వల్ల ప్రధానంగా చిల్లకూరు మండలంలో పరిశ్రమలు రావాల్సి వుంది. అలాగే చెన్నై-వైజాగ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కూడా జిల్లా మీదుగా వెళుతోంది. సాగరమాల కింద తీర ప్రాంతాలను కనెక్ట్‌ చేస్తూ రహదారులు అభివృదిఽ్ధ చెందుతాయి. దాని ద్వారా కూడా జిల్లాకు పరిశ్రమలు తేవడానికి గట్టిగా ప్రయత్నిస్తా. రెండు కారిడార్ల వల్ల వెంకటగిరి, గూడూరు, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో ఎక్కువగా పారిశ్రామిక వాడల ఏర్పాటుకు అవకాశాలున్నాయి. దాన్వి సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తా.

పర్యాటక అభివృద్ధికి కృషి... అభయారణ్యపు ఆంక్షలు తొలగిస్తా!

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పర్యాటక రంగ అభివృద్ధికి విశేష అవకాశాలున్నాయి.ఐఏఎస్‌ అధికారిగా పర్యాటక శాఖ కమిషనర్‌గా పనిచేశా. ఆ రంగంపై అనుభవం,అవగాహన వున్నాయి. నియోజక వర్గంలో తీర ప్రాంతాలుండడం పర్యాటక రంగానికి వరంగా మారింది. వాకాడులో తూపిలి వద్ద బీచ్‌ టూరిజం అభివృద్ధికి అవకాశాలున్నాయి.అయితే దురదృష్టవశాత్తూ నేలపట్టు పక్షుల అభయారణ్యం వున్న కారణంగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలు అనేక ఆంక్షలు విధించాయి. దాంతో కనీసం బీటీ రోడ్డు నిర్మించే అవకాశం కూడా లేదు. గొల్లల గాటు నుంచీ కారికేడు వరకూ రోడ్లు లేవు. అలాగే కొత్తపాలెంలోనూ రోడ్లు లేవు. నేను గతంలో ఎంపీగా వున్నపుడు రూ. 80 లక్షలతో గ్రావెల్‌ రోడ్డు వేయించా. ఆ ప్రాంతంలో అదే తొలిరోడ్డు, చివరి రోడ్డు కూడా. మళ్ళీ గెలిస్తే వైల్డ్‌ లైఫ్‌ యాక్ట్‌ కింద అమలవుతున్న ఆంక్షలు ఎత్తివేయిస్తా. గ్రావెల్‌ రోడ్ల స్థానంలో బీటీ రోడ్లు వేయిస్తా. వాకాడు మండలం మొనపాలెం నుంచీ నవాబ్‌ పేట వరకూ ఆంక్షలు తీసేయించి బీటీ రోడ్లు లేదా సీసీ రోడ్లు వేయిస్తా. పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం నుంచీ నిధులు తెప్పిస్తా.

తిరుపతిలో ప్రజాస్వామ్యం కరువైంది!

గడచిన ఐదేళ్ళుగా తిరుపతిలో ప్రజాస్వామ్యం కరువైందని విన్నా. ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రజల సొంత ఆస్తులు కూడా దౌర్జన్యంగా తీసుకుంటున్నట్టుగా తెలిసింది. ప్రజల్లో భయాందోళనలు నెలకొని వున్నాయి. ఈసారి గెలవబోయే 370 మంది బీజేపీ ఎంపీల్లో నేను కూడా వుంటానన్న నమ్మకం వుంది. నాకు చట్టం తెలుసు. పోగొట్టుకున్న భూములను తిరిగి సొంతదార్లకు అప్పగించేలా చూస్తా.

తుడా అభివృద్ధిలో అసమానతలు లేకుండా చూస్తా!

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఈ ప్రాంత అభివృద్ధికి చాలా కీలకం. అయితే తుడా ప్రస్తుత పనితీరు సమగ్రంగా లేదు. కొన్ని ప్రాంతాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతుంటే మరికొన్ని ప్రాంతాలను పూర్తిగా విస్మరించారు. అభివృద్ధిలో ఎప్పుడూ అసమానతలు అనేవి వుండకూడదు.తుడా పరిధిలోని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పరచాల్సిన అవసరముంది. ఆ దిశగా గట్టిగా కృషి చేస్తా.

గూడూరులో బాగా పనిచేసినా టికెట్‌ ఇవ్వలేదు!

ఎమ్మెల్యేగా ఈ ఐదేళ్ళూ గూడూరులో బ్రహ్మాండంగా పనిచేశా. గతంలో ఏ ఎమ్మెల్యే చేయనంత అభివృద్ధి చేశా. ఎలాంటి అవినీతికీ పాల్పడలేదు.అయినా టికెట్‌ నిరాకరించి మళ్ళీ నేను ప్రజల్లో వుండేందుకు అవకాశం ఇవ్వలేదు.సీఎం ఏవో నామినేటెడ్‌ పోస్టులు ఇస్తామన్నారు. నువ్వు నా గుండెల్లో వున్నావు... నిన్ను ఎలా పోగొట్టుకుంటాం అన్నారు. ఏవేవో లబ్ధి చూపించారు. జీవితంలో ఏ లబ్ధికీ లొంగని వాడిని ఈ నామినేటెడ్‌ పదవులకు లొంగుతానా?

దళిత నాయకత్వాన్ని అవమానించారు!

మాలాంటి చదువుకున్న వారు కూడా రాజకీయాల్లో వుండాలన్న చిన్న విషయం కూడా సీఎంకు తెలియకపోతే ఎలా? జగన్‌ తండ్రి రాజశేఖర్‌రెడ్డి సొంత సామాజికవర్గం వారిని సలహాదార్లుగా పెట్టుకోలేదు.ఉండవల్లిని ప్రోత్సహించారు.కేవీపీ రామచంద్రరావును సలహాదారుగా పెట్టుకున్నారు.ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలనూ కలుపుకుని ముందుకు తీసుకెళ్ళాలే తప్ప అధికారంలో నేనే వుండాలి... వేరే ఎవరూ వుండకూడదు... నేకొక్కడినే పార్టీ అన్న విధానం వుంటే ఎలా? నన్నే కాదు రాష్ట్రవ్యాప్తంగా దళిత నాయకత్వాన్ని సీఎం జగన్‌ అవమానించారు.

ఓడినా గెలిచినా జనంలోనే వున్నా!

ఓడినా గెలిచినా తేడా చూపకుండా జనంలోనే వున్నా. అధికారం వున్నా లేకున్నా సమస్యల పరిష్కారానికి కృషి చేశా.2009లో ప్రజారాజ్యం తరపున ఎంపీగా ఓడిపోయినా కూడా నియోజకవర్గం వదిలిపెట్టకుండా ప్రజలకు అందుబాటులో వున్నా. రాజకీయ నాయకులు, కుల నాయకులు, ప్రజా సంఘాలతో కలసి పనిచేశా. నా కుటుంబం నాపై ఆధారపడదు. ఎవరి వ్యాపారాలు వారికున్నాయి.అవినీతికి పాల్పడాల్సిన అవసరం, ఆలోచన మాకు లేదు. ఎవరిపైనా కక్ష సాధింపు వుండదు. ఎవరిపైనా కేసులు పెట్టించలేదు. ఽఎవరినీ ధూషించలేదు. ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా వుండేందుకు కృషి చేస్తా. నన్ను నమ్మండి.

వచ్చేది ఎన్డీయే ప్రభుత్వాలే....

కేంద్ర రాష్ట్రాల్లో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వాలే. నియోజకవర్గంలోనే పూర్తి సమయం ప్రజలకు అందుబాటులో వుంటా. ప్రభుత్వ పాలనపై నాకు ఎంతో అనుభవం వుంది. అవగాహనతో పాటు సమర్ధతా వుంది. బ్యూరోక్రాట్‌గా అభివృద్ధి ప్రతిపాదనలు ఎలా చేయాలో, ఫైళ్ళు ఎలా కదిలించాలో, అనుమతులు ఎలా సాధించాలో, నిధులు ఎలా పొందాలో నాకు తెలియంది కాదు. గతంలో ఎంపీగా వున్నపుడు అపాయింట్‌మెంట్‌ లేకుండా ప్రధాని మోదీని ఆరుసార్లు కలిశా. అలాంటిది ఇపుడు ఆయన ప్రభుత్వంలోనే ఎంపీగా మళ్ళీ గెలిస్తే నా అనుభవాన్ని, సమర్థతను వినియోగించి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సరికొత్త రూపమిచ్చేందుకు శ్రమిస్తా!

Updated Date - Apr 27 , 2024 | 01:45 AM