రివాల్వర్ చూపి, ఇన్‌కంటాక్స్ అని చెప్పి..
ABN , Publish Date - Nov 16 , 2024 | 01:56 AM
రామకుప్పంలో కిడ్నాప్ కలకలం మాజీ సర్పంచు, కుటుంబీకులను 4 వాహనాల్లో తరలింపునకు యత్నం పోలీసులను చూసి పరారైన దుండగులు
రామకుప్పం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండలంలో ఓ మాజీ సర్పంచు, ఆమె కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. రామకుప్పం మండలం పెద్దకురబలపల్లెకు చెందిన మాజీ సర్పంచు మాధవి ఇంటి వద్దకు పదిమంది గుర్తుతెలియని వ్యక్తులు గురువారం 11గంటల ప్రాంతంలో వచ్చారు. ఇంటి తలుపులు తట్టడంతో మాజీ సర్పంచు భర్త గోవిందప్ప బయటకు వచ్చారు. ఆయన వచ్చీ రాగానే రివాల్వర్ చూపుతూ.. తాము ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులమని, తిరుపతి నుంచి వచ్చామన్నారు. మీ కుటుంబానికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని, విచారణకు రావాలని కోరారు. వచ్చినవారిపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మాధవి, గోవిందప్ప దంపతులతోపాటు వారి కుమారుడు పునీత్‌కుమార్, మామ సిద్ధప్ప, అత్త గంగమ్మ, పెద్దఅత్త సుబ్బమ్మ, మరిది జయరాం, అతడి కుమారుడు సోమశేఖర్‌లను ఇంటి బయటకు తీసుకొచ్చి.. చంపేస్తామంటూ బెదిరించి నాలుగు వాహనాల్లో ఎక్కించుకుని బయల్దేరారు. అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో ఈ వాహనాలు రామకుప్పం పట్టణ శివార్లలోని బందార్లపల్లెక్రా్‌సకు చేరుకున్నాయి. ఆ సమయంలో రామకుప్పం పోలీసులు అక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. పోలీసులను చూసిన దుండగులు.. వాహనాలు ఆపి మాధవి, ఆమె కుటుంబీకులను దింపేశారు. గమనించిన పోలీసులొచ్చి ఏం జరిగిందని బాధితులను విచారిస్తుండగానే దుండగులు తమ వాహనాలతో అక్కడినుంచి పరారయ్యారు. కాగా, ఈ కిడ్నాప్ ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసుల విచారణ పూర్తయ్యాకే నిజానిజాలు తెలియనున్నాయి.